పెన్షన్.. పెద్ద టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పెన్షన్ అంశం తీవ్ర చిక్కుముడిగా మారనుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సూచనలు చేయలేదు. జనాభా ప్రాతిపదికన పెన్షన్ మొత్తాన్ని రెండు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని మాత్రం పేర్కొంది. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో.. కేంద్రం ఇలాంటి సూచనే చేసినా, భవిష్యత్తులో అది వాటిల్లో పెద్ద సమస్యగా మారింది. తుదకు కోర్టుల్లో కేసులు దాఖలవటం, వివాదాల కారణంగా ఏ రాష్ట్రం కూడా పెన్షన్ మొత్తం విడుదల చే యకపోవటంతో వేలాది మందికి పెన్షన్ నిలిచిపోయిన దాఖలాలున్నాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవటం ఖాయమని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
జనాభా ప్రాతిపదికన అంటే..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న జనాభా నిష్పత్తిని ఆధారంగా చేసుకుని పెన్షన్ మొత్తాన్ని విభజించి ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ధారించే తేదీకి ముందు పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్‌ను ఇలా విభజించి రెండు రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఈ లెక్కలో ఏమైనా తేడాలొచ్చి జనాభా నిష్పత్తి కంటే భిన్నంగా పంచుకోవాల్సి వస్తే, తక్కువ మొత్తం భరించాల్సిన రాష్ట్రం ఎక్కువ మొత్తం భరించే రాష్ట్రానికి ఆ తేడా మొత్తాన్ని రీయింబర్స్ చేయాలని ముసాయిదా బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. ఈ లెక్కన 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువ భారం పడుతుంది. దీన్ని సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
తెలంగాణకు ఎక్కువ ఆదాయం ఉండటం, పెన్షన్ల భారం ఆంధ్రప్రదేశ్‌పై పడటం ఏమాత్రం సహేతుకం కాదనేది వారి వాదన. ప్రస్తుతం ప్రభుత్వం సాలీనా రూ.13 వేల కోట్లను పెన్షన్ల కోసం ఖర్చు చేస్తోంది. తాజా ముసాయిదా బిల్లు ప్రతిపాదన ప్రకారం ఇందులో రూ. 8.5 వేల కోట్లకుపైగా ఆంధ్రప్రదేశ్‌పై పడుతుందని, రెవెన్యూ షేర్ తక్కువగా ఉన్నందున ఇది ఆ రాష్ట్రానికి తలకుమించిన భారమే అవుతుందనేది సీమాంధ్ర ఉద్యోగుల వాదన. ఇలాంటి చిక్కులున్నందునే రాష్ట్ర విభజన వద్దని గట్టిగా వాదిస్తున్నామని ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యద ర్శి చంద్రశేఖరరెడ్డి ‘సాక్షి’తో చెప్పారు.