ఏపీ ప్రత్యేక హోదాకు ఉమ్మడిగా పట్టు పట్టాలి
టీడీపీ, బీజేపీ ఎంపీల సమావేశంలో నిర్ణయం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరచిన విధంగా ఏపీకిప్రత్యేక హోదా సాధించుకోవడానికి టీడీపీ, బీజేపీ ఎంపీలంతా ఒక్కటై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని రాష్ట్రంలో అధికార టీడీపీ ఎంపీలు కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంపై అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్న దృష్ట్యా ఈ విషయంపై రెండు పార్టీల ఎంపీలూ గట్టిగా పట్టు పట్టాల్సిందేనన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ చేసిన డిమాండ్‌ను.. ఇప్పుడు వారి పార్టీ అధిష్టానవర్గానికి గుర్తుచేయాలని ఆ ఎంపీలను టీడీపీ ఎంపీలు కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన టీడీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు శనివారం విజయవాడలో తొలిసారి సమావేశమయ్యారు. టీడీపీపీ నేత సుజనాచౌదరి ఆహ్వానం మేరకు సమావేశానికి బీజేపీ ఎంపీలు సైతం హాజరయ్యారు. సమావేశం వివరాలను సుజనాచౌదరి ఆ తర్వాత విలేకరులకు వెల్లడించారు.
రమేష్, శివప్రసాద్‌ల డుమ్మా...
టీడీపీ ఎంపీల సమావేశానికి ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌లు డుమ్మా కొట్టారు. సుజనా నాయకత్వంలో జరిగినందునే రమేష్ హాజరుకాలేదని సహచర ఎంపీలు వ్యాఖ్యానించారు.