కేబినెట్ సమావేశం ప్రారంభం.. రాష్ట్రపతి పాలనవైపే మొగ్గు!
ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు రంగం సిద్ధమైపోయింది. ఈ విషయమై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఉదయం సమావేశమైంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ అంశంపై కేంద్రం నియమించిన జీవోఎం సభ్యులు, ఇతర సీనియర్ మంత్రులు కూడా పాల్గొన్నట్లు సమాచారం.సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తూ ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఒక నోట్ సిద్ధం చేసింది. ఆ నోట్ గురించి సమావేశంలో చర్చించి, ఆపై ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితి లేదని, అందువల్ల రాష్ట్రపతి పాలన తప్పదని ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు అంటున్నారు. దీంతో ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంకా, త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు తాయిలాలు ఇచ్చే నిర్ణయాలకు కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. రాహుల్ బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో తేవాలని నిర్ణయిస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఖర్చును 40 నుంచి 70లక్షలకు పెంచేలా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. డీఏ, పెన్షన్‌ల పథకాలకు కూడా ఓకే చెప్పే అవకాశం కనిపిస్తోంది.