పక్కా ప్లాన్తో సీమాంధ్ర ఎంపీలకు చెక్
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. ఎవరేమన్నా లెక్కచేయకుండా తన మాట నెగ్గించుకుంది. తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013ను లోక్సభలో ప్రవేశపెట్టడానికి కేంద్రం పక్కాప్రణాళిక అమలు చేసింది. బిల్లును ఎప్పుడు పెడతామనేది ముందుగా చెప్పకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
ఇవాళ, రేపు అంటూ అంటూ నెట్టుకొచ్చిన యూపీఏ సర్కారు అనూహ్యంగా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. సీమాంధ్ర ఎంపీలు, ప్రధాన ప్రతిక్షం గట్టిగా వ్యతిరేకించినా లెక్కచేయకుండా మొండిగా వ్యవహరించి బిల్లును సభలో పెట్టింది. సభను అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీలకు చెక్ పెట్టేందుకు పక్కా వ్యూహం అమలు చేసింది. ముందుగానే పథకం రచించి వారిని అడ్డుకుంది.
లోక్సభలో బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో సుశీల్ కుమార్ షిండేకు రక్షణగా 25 మంది ఎంపీలు నిలిచారు. సీమాంధ్ర ఎంపీలను అడ్డుకునేందుకు మిగతా ఎంపీలను పెద్ద సంఖ్యలో మోహరించింది. బిల్లుతో సంబంధం లేని ఎంపీలను కూడా స్పీకర్ పోడియం వద్దకు పంపించి సీమాంధ్ర ఎంపీలు అక్కడకు రాకుండా జాగ్రత్త పడింది. సభలో ఘర్షణ వాతావరణం ఉన్నా వెనక్కి తగ్గకుండా బిల్లుపై కాంగ్రెస్ ముందుకెళ్లింది. ప్రభుత్వ మొండి వైఖరితో సీమాంధ్ర ఎంపీలు తీవ్రచర్యలకు దిగారు. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆందోళనలకు దిగారు.
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సభలో మిరియాల పొడి చల్లి సంచలనం సృష్టించారు. దీంతో సభలో ఒక్కసారిగా అయోమయ పరిస్థితి తలెత్తింది. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి పార్లమెంటరీ సెక్రటరీ మైకు విరిచేసి బీభత్సం సృష్టించారు. మిగతా ఎంపీలు బల్లపైకి ఎక్కి ఆందోళనలు చేశారు. సీమాంధ్ర ఎంపీలను తెలంగాణ సభ్యులు అడ్డుకోవడంతో లోక్సభ రణరంగాన్ని తలపించింది. చేసింతా చేసి తమకేమీ తెలియనట్టుగా వ్యవహరించింది. 18 మంది ఎంపీలను సభను నుంచి ఐదు రోజుల పాటు బహిష్కరించి చేతులు దులుపుకుంది. కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా యూపీఏ సర్కారు పట్టించుకోవడం లేదు.