గొప్పలు చెప్పు... ర్యాంకు పట్టు | The implications at every step | Sakshi
Sakshi News home page

గొప్పలు చెప్పు... ర్యాంకు పట్టు

Published Tue, Nov 1 2016 2:20 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

The implications at every step

- ఎంవోయూలన్నీ పెట్టుబడులేనట
- జీవోల్లోనే భూమి కేటాయింపు...అడుగడుగునా చిక్కులే
- కన్సల్టెన్సీల మాయాజాలం... వాస్తవికత డొల్ల
 
 సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్యం (ఈజీడూయింగ్ బిజినెస్)లో రాష్ట్రాలకు కేటాయించే స్థానాల్లో శాస్త్రీయత కన్పించడం లేదు. ఎప్పటికప్పుడు ర్యాకింగ్ మారిపోవడానికి ప్రామాణికత ఏమిటనే ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ తాజాగా ఏపీకి తొలి ర్యాంకు ప్రకటించింది. తమ పారిశ్రామిక విధానాలనే ఏపీ కాపీ కొట్టిందని తెలంగాణ కొన్ని నెలల క్రితం ఆరోపించింది. దీన్నిబట్టి కేవలం ఆన్‌లైన్ డేటాను కొలమానంగా తీసుకునే డీఐపీపీ ర్యాంకులు ఇస్తోంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో డేటాను ఎవరు తెలివిగా ఫీడ్ చేస్తే వాళ్ళకే ర్యాంకు వచ్చే వీలుంది.

పారిశ్రామిక విధానాన్ని సరళీకరించామని, దీనివల్ల పెట్టుబడిదారులు తేలికగా అనుమతులు పొందవచ్చని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి మార్పులు చేశారు? దీనివల్ల ఎంతమంది పెట్టుబడిదారులు ముందుకొచ్చారు? వ్యాపారం ఎలా ముందుకెళ్తోందనేది డీఐపీపీకి వివరిస్తారు. ఈ విభాగం దీనిపై క్షేత్రస్థాయి సర్వే జరపాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వివరాలను సమగ్రంగా శోధించాలి. కానీ ఇక్కడ అలాంటివేమీ జరగడం లేదు.

ప్రభుత్వాలు కన్సల్టెన్సీలను పెట్టుకుని ర్యాంకింగ్ ఎలా సంపాదించాలనే కోణంగానే డీఐపీపీకి సమాచారాన్ని అందిస్తున్నాయి. అక్కడ ఇచ్చే సమాచారం, వాస్తవ పరిస్థితికి ఎంతమాత్రం పొంతన ఉండటం లేదని పారిశ్రామికవర్గాలు అంటున్నాయి. ఏ పరిశ్రమలోనూ పురోగతే కన్పించనప్పుడు సులభతరం వాణిజ్య విధానాల్లో రాష్ట్రం ఎలా దూసుకుపోతుందని ప్రశ్నిస్తున్నారు. 
► విశాఖలో జరిగిన అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఏపీ సర్కార్ ప్రకటించింది. వీళ్ళంతా సులభతర వాణిజ్య విధానాలకు ఆకర్షితులయ్యారనేది ప్రభుత్వ వాదన. ఇదే నిజమైతే ఇంతవరకూ ఏ ఒక్క ఎంవోయు కూడా కార్యరూపం దాల్చలేదు.
► పారిశ్రామికాభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వాన్నే మించిపోయిందని డీఐపీపీకి పంపిన ఫార్మాట్‌లో ఏపీ పేర్కొంది. కానీ ఏపీలో ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు చాలావరకూ మూతపడ్డాయి. ఈ కారణంగానే వీటికి రాయితీలు ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఇంతవరకూ ఒక్కటీ ఆర్థిక పురోభివృద్ధి సాధించలేదు. ఈ విషయాలను మాత్రం ఏపీ ప్రభుత్వం మరుగున పెట్టింది.
► ఆర్థిక స్థితిగతులను వివరించే బ్యాలెన్స్ షీట్స్‌లో విశాఖ స్టీల్‌తో సహా అన్ని పరిశ్రమలు నష్టాల్లోనే ఉన్నాయని పేర్కొన్నాయి. సిమెంట్ డిమాండ్ తగ్గి... ఈ పరిశ్రమ కుదేలైంది. టెక్స్‌టైల్ పరిశ్రమ నష్టాల్లో ఉంది. ఏ సెక్టార్ కూడా లాభాల్లో ఉందని చెప్పలేని పరిస్థితి. డీఐపీపీ ర్యాంకింగ్‌లు ప్రకటించే ముందు ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడంలేదు.
► పెట్టుబడిదారు కోరిన వెంటనే సులభతరంగా భూమి ఇస్తున్నామనేది మరో అంశం. ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణకు, ప్రభుత్వ పెద్దలతో అంటకాగుతున్న బడా కంపెనీలకే భూములు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన భూములపై 75 శాతం కోర్టు వ్యాజ్యాలున్నాయి. ఇంకా చెప్పాలంటే కేవలం భూమి ఇస్తున్నట్టు జీవోలు ఇస్తున్నారనే తప్ప అవి పారిశ్రామిక సంస్థకు స్వాధీనం చేయడం లేదనే ఫిర్యాదులూ ఉన్నాయి.
► నిర్మాణ రంగంలో అనుమతులు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయనేది ప్రభుత్వం చెప్పే ఇంకో అంశం. ఇందులోనూ వాస్తవికత కన్పించడం లేదు. ఇప్పటివరకూ ప్రభుత్వం అనుమతించిన బిల్డింగ్‌లు, పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్నింటికీ పర్యావరణ శాఖ అనుమతి కూడా లభించలేదు. ర్యాకింగ్ కోసం అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ఇలా లేనివాటిని డీఐపీపీకి చెప్పి ర్యాంకింగ్‌ల కోసం పోటీపడటంలో ఏపీ పక్క రాష్ట్రాలనూ మించిపోతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement