కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రాభివృద్ధి
-
బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి
వెంకటాచలం : కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి అన్నారు. వెంకటాచలంలో మంగళవారం జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని రాజకీయ పార్టీలు బీజేపీపై దుష్ప్రచారం చేయడం సరి కాదన్నారు. ప్రత్యేక హోదా బిల్లులో ప్రవేశపెట్టకుండా కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీపై నిందలు వేయడం ప్రజలు హర్షించరని చెప్పారు. హోదాకంటే అదనంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రూ.1.43 వేల కోట్ల ఇప్పించారని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, రాష్ట్రానికి 11 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కేంద్రం చొరవేనన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న స్వచ్ఛభారత్, ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, పంచాయతీల ద్వారా జరిగే పనులు, ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చే నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కానీ కేంద్రం గురించి ఒక్కమాటైన చెప్పకుండా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిగా టీడీపీ చెప్పుకోవడం జరుగుతుందన్నారు. బీజేపీ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోవు రెండు నెలల్లో ప్రతి గ్రామం తిరిగి బీజేపీ అమలు చేస్తున్న పథకాలను, అభివృద్ధిని ప్రజలకు చేరవేసి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆత్మకూరు మార్కెటింగ్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు ఆరుముళ్ల మురళి, మండల కన్వీనర్ ఆలూరు ప్రసాద్‌నాయుడు, చేనేత సెల్ నాయకుడు చక్రధర్, వేణుగోపాల్‌రెడ్డి, తూమాటి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.