మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి
సైదాబాద్ (హైదరాబాద్): రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్ పెంపు.. తదితర అపరిష్కృత సమస్యలను ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి హామీ ఇచ్చారు. గురువారం ఆయన సైదాబాద్‌లోని ఎస్‌బీహెచ్ ఏ కాలనీ కమ్యూనిటీహాల్‌లో నిర్వహించిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.రోహిణిరావు, అసోసియేషన్ సభ్యులతో కలసి కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. గత మూడు దశాబ్దాలుగా బ్యాంక్ ఉద్యోగుల ప్రాథమిక పెన్షన్‌ను సవరించలేదని ఆయన పేర్కొన్నారు. 2002కు ముందు పదవీ విరమణ పొందిన సీనియర్ మేనేజర్లు, టాప్ మేనేజర్‌లలో చాలామంది రూ. 35 వేల కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారని వివరించారు.
పెరిగిన ఖర్చులతో పెద్ద హోదాలోనివారి పరిస్థితే ఇలా ఉంటే తక్కువ క్యాడర్ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని తెలిపారు. కాగా, పెన్షన్ రివిజన్, 100 శాతం డీఏ న్యూట్రలైజేషన్ సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని వారు కోరారు. అసోసియేషన్ వినతులకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment