సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పెన్షన్ సొమ్మును వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల పాటు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌కు జమ చేయకుండా మళ్లించి ఇప్పుడు ఆ పార్టీ నేతలు మొసలి కన్నీరు కార్చడంపై ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ ఇచ్చాకే ఎన్నికలు జరపాలని తాము కోరుతుంటే టీడీపీ నేతలు సీపీఎస్, జీపీఎఫ్ గురించి మాట్లాడుతున్నారని పేర్కొంటున్నాయి. 2017-18లో సీపీఎస్ ఉద్యోగులకు చెందిన రూ.730.94 కోట్ల పెన్షన్ సొమ్మును నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌కు జమ చేయకుండా వాయిదా వేసినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తెలిపింది.
నేషనల్ డిపాజిటరీ లిమిటెడ్‌కు బదిలీ చేయనందున వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడటమే కాకుండా ఉద్యోగుల సొమ్మును సరికాని రీతిలో వినియోగించినట్లైందని కాగ్ స్పష్టం చేసింది. దీనివల్ల ఉద్యోగులకు సమకూరే ప్రతిఫలం రేటులో అనిశ్చితి ఏర్పడటమే కాకుండా మొత్తానికి పథకమే విఫలమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. 2018-19లో మార్చి 31 నాటికి సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ సొమ్ము రూ.663.63 కోట్లను గత ప్రభుత్వం నేషనల్ సెక్యురిటీ డిపాజిటరీ లిమిటెడ్‌కు జమ చేయకుండా తరువాత సంవత్సరానికి వాయిదా వేసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. నిబంధనల మేరకు ఉద్యోగుల చందాకు సమానంగా ప్రభుత్వం కూడా చందా చెల్లించాల్సి ఉంది. అయితే ఉద్యోగుల నుంచి రూ.765.02 కోట్లను వసూలు చేసినప్పటికీ గత ప్రభుత్వం తన వాటా కింద కేవలం రూ.320.58 కోట్లనే చెల్లించిందని, రూ.444.44 కోట్ల మేర తక్కువగా చెల్లించిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
జీపీఎఫ్ డబ్బులూ ఇవ్వకుండా..
పిల్లల వివాహాలు, ఇతర అవసరాలకు అక్కరకు వస్తాయని ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులను గత ఎన్నికలకు ముందు టీడీపీ సర్కారు ఇవ్వకుండా వేల సంఖ్యలో బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. ఉద్యోగులకు డీఏలను కూడా ఇవ్వకుండా ఎన్నికల ముందు పోస్ట్ డేటెడ్ జీవోలు జారీ చేసి మోసగించింది. ఎన్నికల ముందు పీఆర్సీ అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు కాలయాపన చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక పీఆర్సీ నివేదిక రాకపోయినప్పటికీ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వడమే కాకుండా చంద్రబాబు సర్కారు పెండింగ్‌లో పెట్టిన రెండు డీఏలను సైతం మంజూరు చేశారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. వాస్తవాలు ఇలా ఉండగా టీడీపీ నేతలు ఉద్యోగుల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు.
పెన్షన్ సొమ్మునూ వదలని బాబు, ఇప్పుడు మాత్రం
Published Wed, Jan 27 2021 9:32 AM | Last Updated on Wed, Jan 27 2021 10:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment