ప్రభుత్వ ఉద్యోగుల నాలుగు పెండింగ్ డీఏల్లో రెండు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు
సెప్టెంబర్‌లోనే మంజూరు చేసే అవకాశం.. లేదంటే దసరా కానుకగా ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం(డీఏ) బకాయిలను త్వరలో చెల్లించనున్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు బకాయిల్లో రెండింటిని వీలున్నంత త్వరగా మంజూరు చేయా లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు రెండు డీఏల ప్రతిపాదనలు, అవసర మైన నిధుల అంచనాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు.
వీలును బట్టి సెప్టెంబర్‌లోనే ఈ రెండు డీఏలను మంజూరు చేయాలని, లేదంటే దసరా కానుకగా ప్రకటించాలనే యోచనలో ప్రభు త్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా మొదటి తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయని, పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేయడం ద్వారా వారిలో మరింత మనోస్థై ర్యాన్ని నింపాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. వీలైనంత త్వరలోనే రెండు డీఏలను మంజూరు చేస్తూ అధి కారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
నెలకు రూ.150 కోట్ల భారం
వాస్తవానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 2022 జూలై, 2023 జనవరి, జూలై, 2024 జనవరికి సంబంధించిన డీఏలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. 2024 జూలై డీఏను కేంద్రం ఇంకా ప్రకటించలేదు. అంటే కేంద్రం ప్రకటించిన విధంగా ప్రతి డీఏ కింద బేసిక్‌పేలో 3.64 శాతం వేతనాన్ని ప్రకటించాల్సి ఉంది. నాలుగు డీఏలు కలిపి అది 14.56 శాతానికి చేరుతుంది.
ఇప్పుడు రెండు డీఏలు మంజూరు చేయాల్సి వస్తే 7.28 శాతం వేతనం ప్రకటించాలి. ప్రస్తుత వేతన స్కేల్ ప్రకారం ప్రతి శాతం వేతనానికి ఏడాదికి రూ.250 కోట్ల చొప్పున ప్రభుత్వంపై భారం పడు తుందని ఉద్యోగ సంఘాలు చెపుతున్నాయి. ఈ లె క్కన రెండు డీఏలు కలిపి రూ.1,820 కోట్లు అవ సరమవుతాయి. అంటే ప్రతి నెలా రాష్ట్ర ఖజానాపై రూ.150 కోట్ల పైచిలుకు భారం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment