
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారంటీల విజయం ఆర్థిక శాఖపై ఆధారపడి ఉందని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఆదాయం పెంచుకోవడం ద్వారానే వాటి అమలు సక్రమంగా సాగుతుందని స్పష్టం చేశారు. సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రిగా శనివారం తొలి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రం రూ. 5.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ ఈ శాఖను గాడిన పెట్టగలననే నమ్మకంతోనే ఈ బాధ్యతలు స్వీకరించినట్లు భట్టి అధికారులకు తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయవ్యయాలు, అప్పుల గురించి ఈ సందర్భంగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు.
రాష్ట్ర ఆర్థిక పురోగతిని కలసికట్టుగా సాధిద్దాం..
సంపద సృష్టించడం, సృష్టించిన సంపదను ప్రజలకు పంచడం కోసం ఆర్థిక శాఖ అధికారులు ఆదాయ వనరుల అన్వే షణ కోసం తమ మేధస్సును ఉపయోగించాలని భట్టి వారికి సూచించారు. ప్రభుత్వ విజయం ఆర్థిక శాఖపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను నెరవేర్చడానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు పనిచేయాలని కోరారు.
ఉద్యోగస్తుల్లా కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న ఆలోచనతో విధులు నిర్వర్తించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని.. తద్వారా ప్రభుత్వ విజయానికి దోహదపడిన వారు అవుతారన్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని కలసికట్టుగా సాధిద్దామని పిలుపునిచ్చారు.
రెండ్రోజుల్లోనే రెండు గ్యారంటీల అమలు మా చిత్తశుద్ధికి నిదర్శనం..
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను తమ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే అమలు చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని భట్టి పేర్కొన్నారు. మహిళా సాధికారతకు తొలి అడుగుగా మహాలక్ష్మి పథకం ప్రారంభించి అందులో భాగంగా రాష్ట్రంలోని మహిళలందరికీ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని, ఆరోగ్య తెలంగాణగా ఈ రాష్ట్రం ఉండాలనే ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ. 10 లక్షలకు పెంచి నేటి నుంచి అమలు చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, సెక్రటరీ టి.కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కె. హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్. రవి, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇవి ఉచితాలు కాదు.. మానవవనరులపై వ్యయం
ప్రతిపక్షంలో ఉండగా తాను చేపట్టిన పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పుకున్న బాధలు విన్నాక తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని భావించానని భట్టి పేర్కొన్నారు. ప్రజాసమస్యలను పరిష్కరించడానికి ఆరు గ్యారంటీలు, అభయహస్తం మేనిఫెస్టోలో హామీలను ప్రకటించామన్నారు.
ఇళ్లు లేక కొందరు, కొలువులు లేక నిరుద్యోగులు, ఉన్నత చదువులు చదివించలేక విద్యార్థుల తల్లిదండ్రులు, కొలువులు రాక పెళ్లిళ్లలో కేటరింగ్ సప్లయర్స్‌గా వెళ్లి పనిచేస్తున్న యువత దుస్థితిని పాదయాత్రలో చూశా నని ఈ సందర్భంగా భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా ఇవ్వడం లేదని మానవవనరులపై వ్యయంగా చేస్తున్నట్లు భావించాలని ఆయన సూచించారు. మానవ వనరులు పెరిగితే అందుకు అనుగుణంగా ఆదాయాలు పెంచే అవకాశం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment