జూలైలో ఏడుశాతం తగ్గిన జీఎస్టీ ఆదాయం
గతేడాది జూలైలో జీఎస్టీ ఆదాయం రూ.3,593 కోట్లు
ఈ ఏడాది రూ.3,346 కోట్లే
ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయంలో 9 శాతం వృద్ధి
గత కొన్ని నెలలుగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయంలో రెండంకెల వృద్ధి
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల కొనుగోలు శక్తి, రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలకు కొలమానంగా నిలిచే జీఎస్టీ ఆదాయం తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తొలినెలల్లోనే పాతాళం బాట పట్టింది. కొన్నేళ్లుగా జీఎస్టీ ఆదాయంలో పొరుగు రాష్ట్రాల కంటే మెరుగైన వృద్ధిరేటును సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ జూలై నెలలో నెగిటివ్ వృద్ధిరేటును నమోదు చేసింది. గతేడాది జూలై నెల జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే దేశంలోని అన్ని పెద్ద రాష్ట్రాల్లో పెరుగుదల నమోదుకాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తగ్గుదల నమోదైంది. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఈ లెక్కల ప్రకారం జూలై నెలలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,346 కోట్లు. గతేడాది ఇదే నెలలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ.3,593 కోట్లు. గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో జీఎస్టీ ఆదాయం ఏడుశాతం క్షీణించింది. రూ.247 కోట్ల ఆదాయం తగ్గింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం తొమ్మిదిశాతం వృద్ధితో రూ.1.34 లక్షల కోట్ల (దిగుమతి వస్తువులు లేకుండా)కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌జీఎస్టీలోను కోత నమోదైంది. గతేడాది జూలైతో పోలిస్తే ఈ జూలైలో ప్రీ సెటిల్‌మెంట్ ఎస్‌జీఎస్టీ వసూళ్లు 10 శాతం, పోస్ట్ సెటిల్‌మెంట్ వసూళ్లు ఐదుశాతం తగ్గాయి.
అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి రెండు నెలలుగా ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించేలా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా కేవలం పెన్షన్లు పెంచడం తప్ప పరిపాలనను గాలికొదిలేయడంతో రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు ఆగిపోయాయని, ఈ ప్రభావం జీఎస్టీ ఆదాయంపై పడిందని అధికారులు వెల్లడించారు. ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టి ఇసుకను అందుబాటులో ఉంచకపోవడంతో భవననిర్మాణ కార్యకలాపాలు ఆగిపోవడం జీఎస్టీ ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.
భవననిర్మాణ పనులు జరిగితే సిమెంట్, ఇనుము, రంగులు, ఎలక్ట్రికల్, కలప.. ఇలా అనేక వస్తువుల కొనుగోళ్లు జరుగుతాయి. కానీ ఇసుక కొరత కారణంగా వ్యాపారాలు జరగడంలేదని పలువురు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల చేతుల్లోకి నగదు రావడంతో కొనుగోళ్లు సాగి వ్యాపారాలు కళకళలాడేవి. ఇప్పుడు ఆషాఢమాసం అని ఆఫర్లు పెట్టినా.. కొనుగోళ్లు లేవని రిటైల్ దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఏడాది రికార్డు
గతేడాది రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ 10 శాతానికిపైగా వృద్ధిరేటు నమోదు చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఆ శాఖ ఆదాయం రూ.50 వేలకోట్ల మార్కు దాటింది. 2023–24లో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ ఆదాయం రూ.50,422.60 కోట్లకు చేరితే అందులో నికర జీఎస్టీ ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.32,029.62 కోట్లు (ఐజీఎస్టీ చెల్లింపులు పోగా). గత ప్రభుత్వం వాణిజ్యపన్నుల శాఖలో రిటర్నులు దగ్గర నుంచి పన్ను చెల్లింపుల వరకు అధికారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పూర్తిగా ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు సంస్కరణలు ప్రవేశపెట్టింది.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధికారుల ప్రమేయం లేకుండా వాహనాల తనిఖీకి ఆటోమేటెడ్ చెక్ ఆఫ్ వెహికల్ ట్రాఫిక్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. స్రూ్కట్నీలో అధికారుల ప్రమేయం లేకుండా ర్యాండమ్ విధానంలో ఎంపిక చేసేలా రిటర్న్ స్రూ్కట్నీ ఆటోమేటెడ్ టూల్ వంటి ఎన్నో వ్యాపార అనుకూల చర్యలను చేపట్టడంతో ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదయింది.
Comments
Please login to add a commentAdd a comment