వైఎస్సార్ సీపీ ఎంపీల ప్రశ్నలకు రాజ్యసభలో కేంద్రం సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: శాసన, శాసన మండలిలో ఈ–విధాన్ ప్రాజెక్ట్ అమలుపై ఏపీతో పాటు 26 రాష్ట్రాలు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురగన్ తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ–విధాన్ ప్రాజెక్ట్ అంశంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
డ్రోన్ల ఉత్పత్తి ప్రోత్సాహాకం
ఏపీలో డ్రోన్లు, డ్రోన్ల భాగాల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్‌ఐ) కింద మూడేళ్లకు రూ.120కోట్లు ప్రకటించినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర మోహల్ తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
మహారాష్ట్రలోని ఆరు జిల్లాలకు గోదావరి నీళ్లు
గోదావరి బేసిన్‌లోని ప్రాణహిత ఉప బేసిన్‌లోని వైన్ గంగా నదిపై ఉన్న గోసిఖర్డ్(ఇందిరా సాగర్) ప్రాజెక్ట్ నుంచి 1,772 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని మళ్లించి మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని ఆరు జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి తెలిపారు. వైన్‌గంగా–నల్గంగా నదుల అనుసంధాన ప్రాజెక్ట్‌పై వైఎస్సార్ సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
73.22లక్షల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలు
దేశవ్యాప్తంగా గత నాలుగు సంవత్సరాల్లో 73,22,965లక్షల మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలు నోటిఫై చేసినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ ఎస్.నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
స్మార్ట్ సిటీ కింద 47 ప్రాజెక్ట్‌లు..
విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, తిరుపతి నగరాల్లో రూ.6,616కోట్లతో 281 స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లను ప్రారంభించగా.. దాదాపు 83శాతం పూర్తి అయినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘అమరావతిలో రూ.930కోట్లతో 20 ప్రాజెక్ట్‌లను ప్రారంభించగా.. రూ.746కోట్ల వ్యయంతో 14 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. రూ.184కోట్లతో ఆరు ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోంది.
కాకినాడలో రూ.1,908కోట్లతో 92 ప్రాజెక్ట్‌లు మంజూరు కాగా.. రూ.1,722.97కోట్లతో 79 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. రూ.185.12కోట్లతో 13 ప్రాజెక్ట్‌ల పనులు జరుగుతున్నాయి.తిరుపతిలో రూ.2,082.75కోట్లతో 104 ప్రాజెక్ట్‌లు మంజూరు కాగా.. రూ.1,610.65కోట్లతో 79 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. రూ.472.10కోట్లతో 25 ప్రాజెక్ట్‌ల పనులు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నంకు రూ.1,695.23కోట్లతో 65 ప్రాజెక్ట్‌లు మంజూరు కాగా.. రూ.1,573.58కోట్లతో 62 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. రూ.121.65కోట్లతో 3 ప్రాజెక్ట్‌ల పనులు జరుగుతున్నాయి’ అని కేంద్ర మంత్రి తెలిపారు.
241.4వేల మంది ఎల్‌పీజీ సబ్సిడీని వదులుకున్నారు
ఏపీలో 2,41.4వేల మంది తమ ఎల్‌పీజీ సబ్సిడీని వదులుకున్నట్లు పెట్రోలియం, సహజవాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ పరిమళ్‌నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment