సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, పునరావాసం పనుల కోసం తక్షణమే రూ.16 వేల కోట్లు విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ప్రాజెక్టువల్ల ముంపునకు గురయ్యే గ్రామాల నుంచి వేలాది మంది రైతులు, దళితులు, గిరిజనుల కుటుంబాలను ఖాళీ చేయించినట్లు చెప్పారు. ‘వీరందరి పునరావాసానికి రూ.16 వేల కోట్లు తక్షణం అవసరం. సవరించిన అంచనా వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌పై కేంద్రం తుది నిర్ణయం తీసుకునేలోపు ఈ నిధులను విడుదల చేయాలి’ అని ఆయన కోరారు.
‘దేశంలో నీటి సంక్షోభం నివారణకు జాతీయ ప్రాజెక్టుల సత్వర పూర్తి.. నీటి అంశాన్ని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో చేర్పు’ అంశంపై ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇచ్చిన సావధాన తీర్మానంపై మంగళవారం రాజ్యసభలో గంటపాటు చర్చ జరిగింది. ఈ చర్చలో కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ సహా ఇతర పార్టీల సభ్యులు పాల్గొని ఆయా రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, నీటి సమస్యల గురించి ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టుపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ సందర్భంగా.. అక్టోబర్ 5న ప్రధాని నరేంద్రమోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాసిన విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ఈ నిధులను ఎప్పటిలోగా విడుదల చేస్తారో చెప్పాలని కోరారు. సవరించిన అంచనాలను రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ కమిటీ ఎప్పటిలోగా అమోదిస్తుందని ప్రశ్నించారు. ‘ఏపీ ముఖ్యమంత్రి 2021 నాటికల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయాలన్న సంకల్పంతో ఉన్నారు. నిధుల విడుదల సాఫీగా జరిగేందుకు జలశక్తి మంత్రిత్వ శాఖ వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా? పోలవరం కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం రూ.2,343 కోట్ల నిధులను అదనంగా చెల్లించిన విషయం వాస్తవమేనా? పోలవరం హైడల్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించడానికి ముందుగానే గత ప్రభుత్వం ఆ కాంట్రాక్టు పొందిన నవయుగ కంపెనీకి రూ.787 కోట్లను అక్రమంగా ముందస్తుగా చెల్లించినట్లు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ నిర్ధారించింది. ఈ మొత్తాన్ని తిరిగి వసూలు చేయడానికి జలశక్తి మంత్రిత్వ శాఖ ఎలాంటి చర్యలను ప్రతిపాదిస్తోంద’ని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
కేంద్రం పూర్తి సహకారం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ‘2014 లెక్కల ప్రకారం ప్రాజెక్టు ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. కానీ, 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చాక ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం రూ.55,548 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయ ప్రతిపాదనలు పంపింది. దీన్ని అడ్వైజరీ కమిటీ ఆమోదించింది. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఏర్పాటుచేసిన రివైజ్డ్ కాస్ట్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరింది. వాటిపైనే నిధుల విడుదల ఆధారపడి ఉంటుంది. అంతవరకూ సవరించిన అంచనా విలువను ఖచ్చితంగా నిర్ధారించలేం. అలాగే, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.5వేల కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇందులో ఇంకా రూ.2వేల కోట్లకు సంబంధించిన ఆడిట్ పత్రాలు వచ్చేవరకు తదుపరి నిధులు విడుదలయ్యే పరిస్థితి లేదు’.. అని మంత్రి అన్నారు.
యుద్ధప్రాతిపదికన పూర్తిచేయండి
జాతీయ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కేవీపీ రామచంద్రరావు కోరారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ ఆధిక ప్రాధాన్యమిచ్చి, కుడి, ఎడమ కాలువల్లో అధిక భాగం పూర్తిచేశారన్నారు. ఇందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5,136 కోట్లు ఖర్చుచేసిందన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి నిధులిచ్చే పద్ధతి ఇదేనా?.. ఇలా అయితే 2021 నాటికి ఎలా పూర్తవుతుందని భావిస్తున్నారు’ అని సుబ్బిరామిరెడ్డి ప్రశ్నించారు.
‘ప్రధానమంత్రి పోలవరం ప్రాజెక్టు’ గా గుర్తించాలి
2014కు ముందు ఖర్చుచేసిన నిధులకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమర్పించడంలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు. ఇక ఈ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం రూ.2,377 కోట్లు అదనంగా ఖర్చుచేసినట్టు నిపుణుల కమిటీ నిర్ధారించిన దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తున్నందున దీనిని ‘ప్రధానమంత్రి పోలవరం ప్రాజెక్టు’గా గుర్తించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment