ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్రవ్య లోటును కట్టడి చేయడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. నిర్దేశిత లక్ష్యాన్ని దాటకుండా చూసే క్రమంలో పన్ను వసూళ్లు సహా ఆదాయ, వ్యయాల లెక్కలను రోజువారీగా పర్యవేక్షించనుంది. మార్చి 15 నుంచి ఆర్థిక శాఖ దీన్ని అమలు చేయనుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో దేశీ మార్కెట్లలో ఒడిదుడుకుల వల్ల ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడనుండటం .. ఉక్రెయిన్‌లో చిక్కుబడిపోయిన విద్యార్థులను రప్పించేందుకు అదనంగా వెచ్చించాల్సి వస్తుండటం తదితర అంశాలు ద్రవ్య లోటుపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
పన్నులు, పన్నులయేతర వసూళ్లను రోజువారీగా పర్యవేక్షించడం వల్ల ప్రభుత్వం సత్వర దిద్దుబాటు చర్యలను తీసుకునేందుకు వీలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ముందు రోజు నాటి వరకూ వచి్చన ఆదాయాన్ని మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల లోగా సమర్పించాలంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), కేంద్ర పరోక్ష పన్నులు..కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ)కి ఆదేశాలు వచ్చాయని వివరించాయి. పన్నుయేతర వసూళ్లు, డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా వచ్చే నిధులను రోజువారీ ప్రాతిపదికన అందించాల్సి ఉంటుందని అధికారి పేర్కొన్నారు. మార్చి 15 నుంచి 31 వరకూ వివిధ శాఖల ఆదాయ, వ్యయాల గణాంకాలను రోజువారీగా కేంద్ర వ్యయాల విభాగం కార్యదర్శికి అందించాలని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ)కి సూచించినట్లు వివరించారు.
సవరించిన అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ద్రవ్య లోటు 6.9 శాతంగా ఉండనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 17.65 లక్షల కోట్ల పన్ను వసూళ్లను నిర్దేశించుకోగా కేంద్రం నికరంగా రూ. 15.47 లక్షల కోట్లు సాధించింది. అలాగే పన్నుయేతర వసూళ్ల లక్ష్యం రూ. 3.13 లక్షల కోట్లు కాగా ఇప్పటిదాకా రూ. 2.91 లక్షల కోట్లు (92.9 శాతం) వచి్చంది. అయితే, ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా రూ. 78,000 కోట్లు సమీకరించవచ్చని భావించినప్పటికీ ఇప్పటిదాకా కేవలం రూ. 12,423 కోట్లే వచ్చాయి. దీంతో ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 60,000 కోట్లు సమీకరిస్తే దాదాపు లక్ష్యాన్ని చేరినట్లవుతుందని ప్రభుత్వం భావించింది. కానీ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ ఐపీవోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ప్రభుత్వ వ్యయాలు రూ. 37.70 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తుండగా .. జనవరి ఆఖరు నాటికి ప్రభుత్వ వ్యయం రూ. 28.09 లక్షల కోట్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment