చెక్‌ బౌన్స్‌ నేరం... ఇక క్రిమినల్‌ కాదు!! | Check Bounce Is Offense And Not Criminal Anymore | Sakshi
Sakshi News home page

చెక్‌ బౌన్స్‌ నేరం... ఇక క్రిమినల్‌ కాదు!!

Published Thu, Jun 11 2020 4:31 AM | Last Updated on Thu, Jun 11 2020 4:47 AM

Check Bounce Is Offense And Not Criminal Anymore - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన సంక్షోభంతో తల్లడిల్లుతున్న వ్యాపార వర్గాలకు కాస్త ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చిన్న చిన్న ఉల్లంఘనలను క్రిమినల్‌ చర్యల పరిధి నుంచి తప్పించడంపై దృష్టి సారించింది. ఖాతాల్లో బ్యాలెన్స్‌ లేక చెక్‌ బౌన్స్‌ కావడం, రుణాల చెల్లింపు నిబంధనల ఉల్లంఘన మొదలైన చిన్నపాటి నేరాలను డీక్రిమినలైజ్‌ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకోసం 19 చట్టాలకు తగు విధంగా సవరణలు చేయనుంది. వీటిపై సంబంధిత వర్గాలు జూన్‌ 23లోగా తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా నిర్దిష్ట సెక్షన్‌ పరిధిలో ఏ నేరాలను క్రిమినల్‌ నేరాల కింద కొనసాగించాలి, వేటిని డీక్రిమినలైజ్‌ చేయొచ్చు అన్నది ఆర్థిక సర్వీసుల విభాగం నిర్ణయం తీసుకుంటుంది. ‘చిన్న నేరాలను డీక్రిమినలైజ్‌ చేయడమనేది వ్యాపారాలకు సులభతరమైన పరిస్థితులు కల్పించే దిశగా ఎంతగానో తోడ్పడుతుంది. న్యాయవ్యవస్థలు, జైళ్లపై ఒత్తిడి తగ్గగలదు‘ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఉల్లంఘనల జాబితా సిద్ధం.. 
కరోనా వైరస్‌ ప్రభావిత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ప్యాకేజీ వివరాల వెల్లడి సందర్భంగా సాంకేతిక, ప్రక్రియపరమైన చిన్నపాటి ఉల్లంఘనలను డీక్రిమినలైజ్‌ చేసే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత నెలలోనే ప్రస్తావించారు. దీనికి అనుగుణంగా కేంద్ర ఆర్థిక సర్వీసుల శాఖ వివిధ చట్టాల్లో డీక్రిమినలైజ్‌ చేయతగిన చిన్న స్థాయి ఉల్లంఘనల జాబితాను రూపొందించింది. ప్రస్తుతం నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ 1881లోని సెక్షన్‌ 138 కింద ఖాతాలో తగిన బ్యాలెన్స్‌ లేక చెక్‌ బౌన్స్‌ అయితే దాన్ని జారీ చేసిన వ్యక్తి నేరం చేసినట్లుగా పరిగణించి రెండేళ్ల దాకా జైలు శిక్ష లేదా చెక్‌ పరిమాణానికి రెట్టింపు పెనాల్టీ విధించవచ్చు. లేదా జైలుశిక్ష, జరిమానా రెండూ విధించవచ్చు. తాజా ప్రతిపాదనల ప్రకారం దీన్ని సవరించే అవకాశం ఉంది. అలాగే, ఎల్‌ఐసీ విషయానికొస్తే ఆ సంస్థ పత్రాలు, ఖాతాలు లేదా ఇతరత్రా ప్రాపర్టీ ఏదైనా చట్టవిరుద్ధంగా ఎవరైనా తమ వద్ద ఉంచుకుంటే ఏడాది దాకా జైలు శిక్ష, రూ. 1,000 దాకా జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. దీన్ని కూడా సవరించవచ్చు.

విదేశీ ఇన్వెస్టర్లకు ఊరట..: ఆర్థిక నేరాలకు సంబంధించి క్రిమినల్‌ చర్యల గురించి విదేశీ ఇన్వెస్టర్లలో ఎంతో కాలంగా ఆందోళన నెలకొందని, తాజా ప్రతిపాదనలు వారికి ఊరటనివ్వగలవని నిషిత్‌ దేశాయ్‌ అసోసియేట్స్‌ సంస్థ వ్యవస్థాపక భాగస్వామి ప్రతిభా జైన్‌ తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐవో, ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీల పరిధిపై స్పష్టత లేకపోవడంతో బహుళ నియంత్రణ సంస్థలు ఒకే నేరంపై విచారణ జరుపుతుండటం వల్ల ప్రతివాదులకు పెద్ద సమస్యగా ఉంటోందని ఆమె పేర్కొన్నారు. మరోవైపు చర్యలు తీసుకున్నా, తీసుకోకపోయినా కొన్ని నేరాల డీక్రిమినలైజేషన్‌తో ఉల్లంఘనలకు పాల్పడేవారిలో భయం పోతుందని శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కో పార్ట్‌నర్‌ వీణ శివరామకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. రుణాలిచ్చే సంస్థల కోణంలో చూస్తే క్రిమినల్‌ చర్యల భయంతోనైనా డిఫాల్టర్లు కనీసం పునర్‌వ్యవస్థీకరణ లేదా చెల్లింపులపై చర్చలకైనా ముందుకొస్తున్నారని, దాన్ని డీక్రిమినలైజ్‌ చేస్తే ఆ భయాలు కూడా ఉండవని పేర్కొన్నారు.

సవరణలు ప్రతిపాదించిన చట్టాలు
► నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (చెక్‌ బౌన్స్‌) 
► సర్ఫేసీ (బ్యాంకు రుణాల రీపేమెంట్‌పరమైన ఉల్లంఘనలు) 
► ఎల్‌ఐసీ ళీ పీఎఫ్‌ఆర్‌డీఏ ళీ ఆర్‌బీఐ 
► ఎన్‌హెచ్‌బీ ళీ బ్యాంకింగ్‌ నియంత్రణ 
► చిట్‌ ఫండ్స్‌ ళీ యాక్చువేరీస్‌
► జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ (జాతీయీకరణ) 
► అనియంత్రిత డిపాజిట్‌ స్కీముల నిషేధ చట్టం 
► డీఐసీజీసీ ళీ నాబార్డ్‌ ళీ  బీమా చట్టం 
► ప్రైజ్‌ చిట్స్, మనీ సర్క్యులేషన్‌ స్కీమ్స్‌ (నిషేధ) 
► పేమెంట్‌ అండ్‌ సెటిల్మెంట్స్‌ సిస్టమ్స్‌ యాక్ట్‌ 
► స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్స్‌ 
► క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీస్‌ (నియంత్రణ) 
► ఫ్యాక్టరింగ్‌ నియంత్రణ చట్టం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement