కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో దేశీయ వజ్రాల పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందన్న తొలి అంచనాలు తాజాగా కొంత మెరుగుపడుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) విభాగం క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. నివేదికలోకి ప్రధానాంశాలను పరిశీలిస్తే...
తొలి అంచనాలు ఇలా..
కోవిడ్–19 తీవ్ర ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 2020–21 దేశీయ వజ్రాల పరిశ్రమ ఆదాయాలు 33 శాతానికి పైగా పడిపోతాయన్నది (2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చి) తొలి అంచనా. లాక్‌డౌన్ తత్సంబంధ అంశాల నేపథ్యంలో ఎదురయిన బలహీన డిమాండ్ పరిస్థితుల వల్ల ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) దేశీయ ఎగుమతుల పరిశ్రమ దాదాపు సగానికి సగం నష్టపోయి, (2019 ఇదే కాలంతో పోల్చి) కేవలం 5.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పరిశ్రమ వద్ద అటు ముడి, పాలిష్డ్ డైమండ్ల పరిమాణం భారీగా ఉంది. దాదాపు 7 నెలల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. ప్రతికూల అంచనాలకు ఇదీ ఒక కారణం అయ్యింది. రఫ్ డైమండ్ ధరలు స్థిరంగా ఉండి, పాలిష్డ్ డైమండ్ల ధరలు పడిపోతుంటే బలహీన డిమాండ్‌కు ఇది సంకేతమవుతుంది. ఇది పరిశ్రమను నిల్వల పరమైన నష్టానికి గురిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రెండవ త్రైమాసికం ముగిసే నాటికి మైనింగ్ సంస్థలు రఫ్ డైమండ్ ధరలను దాదాపు 10 శాతం తగ్గించేశాయి. నిజానికి ప్రతియేడాదీ నిల్వల పెంపుపై రెండవ త్రైమాసికం నుంచే ఇండియన్ డైమండ్ పాలిష్డ్ పరిశ్రమ దృష్టి సారిస్తుంది. నవంబర్ ప్రారంభం నుంచీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ పండుగల సీజన్, అలాగే చైనా కొత్త ఏడాది ఉత్సవాల ప్రారంభం వంటి అంశాలు దీనికి నేపథ్యం. అయితే 2020లో ఈ తరహా పరిస్థితి చోటుచేసుకోలేదు. కేవలం నిల్వలు తగ్గించుకోవడం ఎలా అన్న అంశంపైనే పరిశ్రమ దృష్టి పెట్టింది.
రికవరీకి దోహదపడిన అంశాలు..
ఎగుమతుల మార్కెట్‌లో చక్కటి రికవరీ నమోదవుతోంది. డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రత్యేకించి అమెరికా, చైనా, హాంకాంగ్ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు వేగంగా మెరుగుపడుతున్నాయి. భారత్ ప్రధాన మార్కెట్లు అయిన అమెరికా, చైనాల్లో రిటైల్ అమ్మకాలు దాదాపు 3 నుంచి 5 శాతం మేర వృద్ధి చెందుతున్నాయి. స్వల్ప కాలంలో ఈ రంగం పురోగతిలో ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాల్లో కొత్తగా లాక్‌డౌన్‌లు విధిస్తున్నప్పటికీ, వజ్రాల పరిశ్రమ డిమాండ్ తగ్గదని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 వ్యాక్సినేషన్ పక్రియ క్రియాశీలంగా ఉండడం దీనికి కారణం. రుణాలకు సంబంధించి భారత్ బ్యాంకింగ్ సకాలంలో ఇచ్చిన మద్దతు కూడా పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొనడానికి దోహదపడింది.
నవంబర్ గణాంకాలు చూస్తే..
2020 మేలో భారత్ డైమండ్ ఎగుమతులను చూస్తే, ఈ పరిమాణం విలువలు వరుసగా దాదాపు 5 లక్షల క్యారెట్లు, 389 మిలియన్ డాలర్లులుగా ఉన్నాయి. నవంబర్ 2020 నాటికి ఈ లెక్కలు 23 లక్షల క్యారెట్లు, 1,665 మిలియన్ డాలర్లుగా ఉంది. 2019 మేలో విలువలు 21 లక్షల క్యారెట్లు, 1,864 మిలియన్ డాలర్లు.
అమెరికా, యూరప్‌లే మన ప్రధాన మార్కెట్లు
భారత్ పాలిష్డ్ డైమండ్ ఎగుమతుల విలువ దాదాపు రూ.1.32 లక్షల కోట్లు. వీటిలో దాదాపు సగం వాటా అమెరికా, యూరప్‌లదే కావడం గమనార్హం. రూ. 1.8 లక్షల కోట్ల డైమెండ్ మార్కెట్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ పాలిష్డ్ హబ్‌గా సూరత్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దాదాపు ఐదు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రపంచంలోని ప్రతి 10 పాలిష్డ్ డైమండ్స్‌లో 9 ఇక్కడి దాదాపు 6000 పాలిషింగ్ యూనిట్ల నుంచే సరఫరా అవుతున్నాయి. భారత్ మొత్తం ఎగుమతుల్లో 80 శాతం ఇక్కడి నుంచే జరుగుతోంది.
నగదు లభ్యత సవాళ్లు తగ్గాయ్...
ప్రస్తుతం పరిశ్రమకు నగదు లభ్యత సవాళ్లు తగ్గాయి. కఠిన లాక్‌డౌన్ అమలు జరిగిన తొలి త్రైమాసికంలో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో భారత డైమండ్ వ్యాపారస్తులు నిల్వల స్థాయిని తగ్గించుకోవడంపై ప్రణాళికలు రూపొందించుకున్నారు. అలాగే రావాల్సిన వసూళ్లు, ఆదాయాల స్థిరత్వంపై దృష్టి సారించారు. ఇప్పుడు క్రమంగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. నిల్వలు అలాగే ఆదాయ వసూళ్ల సమయాలు యథాపూర్వ పరిస్థితికి చేరుకుంటున్నాయి. మార్చి నాటికి పరిశ్రమ పూర్తి స్థాయిలో గాడిన పడుతుందని విశ్వసిస్తున్నాము.
– రాహుల్ గుహ, క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్
తాజా అధ్యయనం చెబుతోంది ఇదీ..
వజ్రాల పరిశ్రమ వేగంగా కోలుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆదాయ నష్టం 20 శాతానికి పరిమితం అవుతోంది. ఆదాయాలు 15 బిలియన్ డాలర్లపైనే నమోదయ్యే అవకాశాలు సుస్పష్టమవుతున్నాయి. డిసెంబర్ 2020తో ముగిసిన మూడవ త్రైమాసికంలో ఎగుమతులు నెలవారీగా సగటున 1.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.దీనితో ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఆ రంగంలో ఆదాయాలు కనీసం 15 బిలియన్ డాలర్లను దాటతాయన్న అంచనా నెలకొంది. ఇదే జరిగితే ఆదాయ నష్టం కేవలం 20 శాతంగానే భావించాల్సి వస్తుంది. గడచిన మూడు నెలల్లో ముడి, పాలిష్డ్ డైమండ్ నిల్వలు క్రమంగా తగ్గాయి. పాలిష్డ్ డైమండ్ ధరలు మూడవ త్రైమాసికంలో దాదాపు 2 శాతం పెరిగాయి. మొదటి ఆరు నెలల నష్టాలను కొంత పూడ్చుకోడానికి ఈ పరిస్థితి దోహదపడింది. ప్రస్తుత ధరల పరిస్థితి స్థిరంగా ఉంది. ఆయా అంశాల నేపథ్యంలో నిర్వహణా పరమైన లాభదాయకత పూర్తి ఆర్థిక సంవత్సరం చెక్కుచెదరదన్నది తాజా విశ్లేషణ.
Comments
Please login to add a commentAdd a comment