అభిప్రాయం
మన దేశంలో బడ్జెట్‌ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడతారు. ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్ర వరి నెలలో మధ్యంతర బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశ పెట్టారు. అందుకే పూర్తి స్థాయిలో నేడు (జూలై 23న) 18వ లోక్ సభలో 2024–25 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేశారు.
గత బడ్జెట్లు అన్నీ సంపన్నులకు లాభం చేకూర్చే విగానే ఉన్నాయనీ, ఈసారైనా కాస్త సామా న్యులకు ఊరట కలిగించేవిగా ఉండాలనీ జనం ఎదురుచూస్తున్నారు. భాగస్వామ్య పక్షాల వెన్ను దన్నుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ దూకుడు తగ్గించి సామాన్యుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందనీ, ఇవ్వాలనీ ప్రజలు ఆశిస్తున్నారు.
కోవిడ్ కాలం నుండి పేదల బతుకుల్లో ఆశించిన మార్పులు లేవు. ఉపాధి కోల్పోయి కొను గోలు శక్తి లేక ఆకలి సైతం తీర్చుకోలేక విలవిలలాడుతున్న దుర్భర పరిస్థితులు ఉండడం బాధాకరం. ఇప్పటికీ వ్యవసాయం, చేనేత,లఘు పరిశ్రమలు వంటివి సంక్షోభంలో పడిపోగా కోట్లాదిమంది అర్ధాకలితో, పస్తులతో గడుపుతున్నారు. 125 దేశాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ ఆకలి సూచికలో 111వ స్థానంలో భారత్ ఉంది. దీన్ని బట్టి ఇక్కడ పేదరికం ఎంతగా ఉందో అర్థమవుతుంది.
ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తు న్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలోనే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఆహార ధాన్యాలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.పెరిగిన ఆహార ద్రవ్యోల్భణం తగ్గించేలా 3.0 బడ్జెట్‌లో చర్యలు ఉండాలి.
గత ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు పేద ప్రజలందరికీ గృహ నిర్మాణ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి. 2022–23 బడ్జెట్‌తో పోలిస్తే 2024–25 మధ్యంతర బడ్జెట్లో వ్యవ సాయ అనుబంధ కార్యకలాపాలకు వేల కోట్ల రూపాయలు తగ్గించారు. ఇది సరికాదు.
రైతన్నను ఆదుకోవడానికి తగిన కేటాయింపులు ఈసారన్నా జరగాలి. దేశ ప్రగతికి కీలక అవసరమైన విద్యపై గత బడ్జెట్లో ఆశించిన కేటాయింపులు లేవు. ప్రైవేటు విద్యను ప్రోత్సహించేలా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి నిధుల కేటాయింపు పెంచాలి.
అలాగే ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించేలా బడ్జెట్ రూపొందించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రజారోగ్యంపై స్థూల జాతీయోత్పత్తిలో ఐదు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం 2.1 శాతం మాత్రమే మన దేశంలో ఖర్చు పెడుతున్నారు. ఈ బడ్జెట్‌లోనైనా 5 శాతం నిధులు ప్రజారోగ్యంపై కేటాయించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలి.
స్టాండర్డ్ డిడక్షన్ కొత్త పన్ను విధానంలో 7 లక్షల నుండి 12 లక్షల వరకు పెంచాలి. అదేవిధంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలి. ‘బేటీ పఢావో బేటీ బచావో’ అనేది నినాదాలకు పరిమితం చేయకుండా మహిళా సాధికారత దిశగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలి.
మహిళల పట్ల వేధింపులు లేకుండా ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధిని కల్పించడానికి ఏకైక మార్గమైన ‘ఉపాధి హామీ పథకా’నికి ఎక్కువ నిధులు కేటాయించాలి. మొత్తం మీద ఈ బడ్జెట్ నిరుపేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెడతారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
తండ సదానందం
వ్యాసకర్త టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్
మొబైల్: 99895 84665
Comments
Please login to add a commentAdd a comment