సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘వికసిత భారత్’నాలుగు స్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతులను మరింత శక్తివంతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొ న్నారు. ఈ బడ్జెట్ దేశ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్ అని కొనియాడారు. గురువారం బడ్జెట్ అనంతరం ఆయన టీవీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి ‘వికసిత భారత్’పునాదిని బలోపేతం చేసే హామీని ప్రస్తుత బడ్జెట్ ఇస్తోందని చెప్పారు.
ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సమగ్రంగా, వినూత్నంగా ఉందని, దేశ పురోభివృద్ధిపై పూర్తి విశ్వాసాన్ని కలిగిస్తోందని ప్రశంసించారు. భారతదేశ యువ త ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయించిన ట్లు తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు పన్ను మినహాయింపులు ప్రకటించినట్లు గుర్తుచేశారు. గ్రామాలు, నగరాల్లో పేదల కోసం 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని, మరో 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
తొ లుత 2 కోట్ల మంది మహిళలను ’లఖ్‌పతి దీదీ’లుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించకున్నామని, ఆ సంఖ్యను 3 కోట్లకు పెంచామని వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం పేదల కు ఎంతగానో ఉపయోగపడిందని, ఇకపై అంగన్‌వాడీ సభ్యు లు, ఆశావర్కర్లు సైతం లబ్ధి పొందుతారని పేర్కొన్నారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
తాజా బడ్జెట్‌లో ద్రవ్య లోటును అదుపులో ఉంచుతూనే మూలధన వ్యయాలను భారీగా పెంచినట్లు నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మూలధన వ్యయం కోసం రూ.11,11,111 కోట్లు కేటాయించారని, ఆర్థికవేత్తల భాషలో చెప్పాలంటే ఇది తీపి కబురేనని వ్యాఖ్యానించారు. దీనివల్ల 21వ శతాబ్దంలో ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుందని, కోట్లాది మంది యువతకు నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ‘వందేభారత్ స్టాండర్డ్’కింద 40 వేల ఆధునిక కోచ్‌లను తయారుచేసి, సాధారణ ప్యాసింజర్ రైళ్లలో చేర్చాలని బడ్జెట్‌లో ప్రకటించారని, ఇది దేశవ్యాప్తంగా వివిధ రైల్వే మార్గాల్లో లక్షల మంది ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని వెల్లడించారు.
కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్
పేద, మధ్య తరగతి వర్గాలకు సాధికారత కల్పించడం, వారికి కొత్త ఆదాయ అవకాశాలను సృష్టించడంపై బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని మోదీ చెప్పారు. సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్ల ద్వారా కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతుందని అన్నారు. మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా ప్రజలు ఏటా రూ.15 వేల నుంచి రూ.18 వేల అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. ఆదాయపు పన్ను ఉపశమన పథకంతో దాదాపు కోటి మంది మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన లబ్ధి కలుగుతుందన్నారు. నానో డీఏపీ వినియోగం, పశువుల కోసం కొత్త పథకం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్ అభియాన్ వంటి పథకాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని, ఖర్చులు తగ్గుతాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment