ఏపీకి ఇచ్చింది రుణమే! గ్రాంట్‌ కాదు! | Sakshi Guest Column On Union Budget Allocation To Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీకి ఇచ్చింది రుణమే! గ్రాంట్‌ కాదు!

Published Wed, Jul 24 2024 12:33 AM | Last Updated on Wed, Jul 24 2024 12:34 AM

Sakshi Guest Column On Union Budget Allocation To Andhra Pradesh

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ ప్రతిపాదించిన బడ్జెట్‌ విద్యారంగాన్నీ, వ్యవసాయాన్నీ పెద్దగా పట్టించుకోలేదు. నిరుద్యోగులకూ ఒరగబెట్టింది ఏమీ లేదు. అలాగే కేటాయింపుల్లో బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు దక్కిందీ అంతంతే! ఏపీ కొత్త రాజధానికి 15 వేల కోట్లు  ఇస్తామంటున్నది ఋణమే తప్ప గ్రాంట్‌ కాదు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో కేటాయించినా ఉద్యో గాల కల్పనకు అది దోహదపడడం లేదన్నది ఇప్పటికే నిరూపి తమయ్యింది. 

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌కు ఒకరోజు ముందు ప్రకటించిన ఎకనమిక్‌ సర్వేతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపా దించిన వార్షిక బడ్జెట్‌కు చాలా అంశాల పరంగా ఎలాంటి లింక్‌ కని పించడం లేదు. 2047 కల్లా ‘వికసిత్‌ భారత్‌’ను సాకారం చేయాలని ప్రతి పాదించినా... దాన్ని ఎలా సాక్షాత్క రింప చేస్తారనే విషయంలో కచ్చి తమైన కార్యాచరణ, చర్యలు ప్రకటించలేదు. గతం నుంచి చూస్తే ఎకనమిక్‌ సర్వే ఆర్థిక రంగ పరిస్థి తులు, ప్రస్తుత స్థితిగా ఎత్తిచూపేదిగా ఉంటూ వస్తోంది. సాధా రణంగా దీనికి అనుగుణంగా బడ్జెట్‌లో ఆ యా రంగాలకు చేసే కేటాయింపులు, ఇతర అంశాలు ఆధారపడి ఉంటాయి.

ప్రతిపాదిత బడ్జెట్‌లోని కీలకరంగాలు, ముఖ్యమైన అంశా లను పరిశీలించినా స్పష్టత కనిపించలేదు. ఉపాధి, నైపుణ్యా భివృద్ధి, ఎమ్మెస్‌ఎంఈలు, మధ్యతరగతి అనే వాటి గురించి ప్రధానంగా పేర్కొన్నారు. వీటిలో మొదటి మూడు అంశాలు ఒక దానికి ఒకటి లంకె కలిగినవి. ఐతే ఈ అంశాలను గురించి చెప్పాక కూడా ప్రభుత్వ ప్రాధాన్యాలు మారే అవకాశాలున్నాయి. అన్నింటికంటే కూడా అత్యధికంగా ఆందోళన కలిగించే అంశం ద్రవ్యోల్బణం. దాని గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు. 

వ్యవసాయ రంగానికి పెద్దగా నిధులు పెంచింది ఏమీ లేదు. పాత విధానానికి కొనసాగింపును ఈ బడ్జెట్‌ కేటాయింపులు ప్రతిబింబిస్తున్నాయి. ఆర్థిక సర్వే వ్యవసాయేతర రంగంలో కనీసం 75 లక్షల ఉద్యోగాలను కల్పించాలని చెప్పినా ఆ మేరకు బడ్జెట్‌లో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎమ్మెస్‌ఎంఈల కంటే దిగువ స్థాయిలో ఉండే అసంఘటిత రంగంలో 2016 నుంచి 2022–23 వరకు  54 లక్షల ఉద్యోగాలు పోయాయి. ప్రధానంగా... పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని ఒత్తిడితో అమలుచేయడం, కోవిడ్‌ పరిస్థితుల ప్రభావం దీనికి కారణాలు. దాదాపు 18 లక్షల యూనిట్లు మూతపడ్డాయి. దీనిని సరిచేసే చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. 

రెగ్యులేటరీ మెకానిజాన్ని రిలాక్స్‌ చేసి రుణాల కల్పన (క్రెడిట్‌ ఫెసిలిటీ) చేస్తామని చెబుతున్నారు. ఇది వాంఛ నీయమే. నైపుణ్యాల అభివృద్ధి (స్కిల్‌ డెవలప్‌మెంట్‌)తోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పడం తప్పుదారి పట్టించడమే అవుతుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నైపుణ్యాలకు మెరుగులు దిద్దడం అనేది విద్యారంగంతో లింకు కలదిగా గుర్తించాలి. పన్నెండో తరగతి దాకా నాణ్యతతో కూడిన విద్యా భ్యాసాన్ని అందించడంలో భాగంగా నైపుణ్యాల శిక్షణను కూడా అందజేయాలి. 

బడ్జెట్‌లో కొత్తగా తూర్పు (ఈస్ట్రన్‌ స్టేట్స్‌) రాష్ట్రాలు అని పేర్కొన్నారు. ఇది కొత్త ఆవిష్కరణగా భావించాలా? ఈ రాష్ట్రాల కింద పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒరిస్సాల గురించి చెప్పారు. అయినా వీటిలో కేవలం ఆంధ్రప్రదేశ్, బిహార్‌ల గురించి ప్రస్తావించారు. దేశంలో ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ పరిస్థితులతో ఈ రెండు రాష్ట్రాలకు రాజకీయంగా ప్రాధాన్యం పెరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాలు పెద్ద ఆర్థిక ప్యాకేజీని, ప్రత్యేక హోదా వంటివి కోరుకుంటుండగా వాటికి కంటితుడుపుగానే కేటాయింపులు చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ విషయా నికొస్తే... కొత్త రాజధాని కోసం రూ. 15 వేల కోట్లు రుణం (ప్రపంచబ్యాంక్, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ల ద్వారా ఇచ్చే అవకాశాలు) ఇప్పిస్తామన్నారు. రాజధానికి కేంద్రం బడ్జెట్‌ ద్వారా గ్రాంట్‌ రూపంలో కాకుండా రుణకల్పన వెసులుబాటు కల్పిస్తామనడం సరికాదు. ఈ రాష్ట్రాలకు పరిశ్రమల కల్పన, మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా అది జరగడం లేదు. 

ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాల వృద్ధికి రోడ్లు, బ్రిడ్జీలు వంటివి నిర్మిస్తున్నారు. అవి ఉద్యోగాలు, ఉపాధి కల్పనకు ఉపయోగపడలేక పోతున్నాయి. ప్రైవేట్‌ కన్జమ్షన్‌ డిమాండ్‌ను పెంచలేకపోతే ప్రైవేట్‌ పెట్టుబడులు రావనేది లాజిక్‌. ప్రస్తుతమున్న పరిస్థితులు చూస్తే మాత్రం ఉపాధి కల్పన సరిగా లేక భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద బడ్జెట్‌ చెప్పుకోదగినంత గొప్పగా లేదనేది సత్యం.

ప్రొ‘‘ డి. నర్సింహారెడ్డి 
వ్యాసకర్త పూర్వ డీన్, స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement