న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాజకీయాలతో ప్రమేయమున్న వ్యక్తుల (పీఈపీ) ఆర్థిక లావాదేవీలను కూడా రిపోర్టింగ్ సంస్థలు (బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొదలైనవి) తప్పనిసరిగా రికార్డు చేసేలా పీఎంఎల్‌ఏ చట్టానికి సవరణలు చేసింది. అలాగే, లాభాపేక్ష రహిత సంస్థల (ఎన్‌జీవో) ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కూడా ఆర్థిక సంస్థలు సేకరించాల్సి ఉంటుంది.
ప్రభుత్వాలు లేదా దేశాధినేతలు, సీనియర్ రాజకీయ నేతలు, సీనియర్ ప్రభుత్వ ..న్యాయ .. మిలిటరీ అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, కీలకమైన రాజకీయ పార్టీల అధికారులు పాటు ఇతర దేశాల తరఫున ప్రభుత్వపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీఈపీల పరిధిలోకి వస్తారని ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ఆర్థిక సంస్థలు తమ ఎన్‌జీవో క్లయింట్ల వివరాలను నీతి ఆయోగ్‌కి చెందిన దర్పణ్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆయా క్లయింట్లతో వ్యాపార సంబంధాలు ముగిసిన తర్వాత కూడా అయిదేళ్ల పాటు రికార్డులను అట్టే పెట్టాల్సి ఉంటుంది. ఈ సవరణ కారణంగా పీఈపీలు, ఎన్‌జీవోల ఆర్థిక లావాదేవీల రికార్డులను రిపోర్టింగ్ సంస్థలు తమ దగ్గర అట్టే పెట్టుకోవడంతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అడిగినప్పుడు వాటిని అందించాల్సి ఉండనుంది.
ఇప్పటివరకూ రిపోర్టింగ్ సంస్థలు తమ క్లయింట్ల గుర్తింపు ధృవీకరణ పత్రాలు, వ్యాపారపరమైన ఉత్తర ప్రత్యుత్తరాలు, అకౌంటు ఫైళ్లూ, రూ. 10 లక్షల పైబడిన నగదు లావాదేవీలు మొదలైన వివరాలను రికార్డు చేయాల్సి ఉంటోంది. ఇకపై క్లయింట్ల రిజిస్టర్డ్ ఆఫీసు చిరునామా, కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రదేశం వంటి వివరాలు కూడా సేకరించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment