సాక్షి, హైదరాబాద్: ‘అసలైన ప్రజల తెలంగాణ వచ్చిందనుకోండి. అందుకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయండి. వాస్తవికతను ప్రతిబింబించేలా 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఉండాలి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలి.’అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, ప్రభుత్వం ముందున్న లక్ష్యాలన్నింటినీ ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆర్థిక శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంపదను దుబారా చేయవద్దని, వృథా ఖర్చులు అరికట్టేవిధంగా ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ‘వాస్తవంగా రాష్ట్ర ఆదాయమెంత ఉంది? ఉద్యోగుల జీతభత్యా లు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఇతర పనులకు ఎంత ఖర్చవుతుంది? ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థం కావాలి. గొప్పలు, ఆర్భాటాలకు పోవద్దు.’అని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఉన్న అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలవారీగా చేయాల్సిన ఖర్చులపై స్పష్టతతో ఉండాలని, ఓ అవగాహన మేరకు ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించాలని సూచించారు.
ఈ క్రమంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని విస్మరించవద్దన్నారు. కొందరు వ్యక్తులను సంతృప్తిపర్చాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రజలను సంతృప్తిపర్చాల్సిన బాధ్యత గుర్తెరగాలని చెప్పారు. ప్రజల కోణంలో బడ్జెట్ ఉండేలా ప్రత్యేక కసరత్తు జరపాలని, గతంలో ఉన్న అప్పులు దాచిపెట్టడం, ఆదాయ, వ్యయాలను భూతద్దంలో చూపెట్టడం లాంటివి చేయొద్దని, బడ్జెట్ ప్రతిపాదనలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు.
తప్పనిసరైతేనే ప్రభుత్వ ప్రకటనలు.. కొత్త వాహనాలు కొనుగోలు చేయొద్దు
రాష్ట్ర ఆదాయవనరులను సద్వినియోగం చేసుకోవాలని, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని, అడ్డగోలు ఖర్చు, అనవసర వ్యయం మంచి ది కాదని సీఎం రేవంత్ ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో వ్యాఖ్యానించారు. తప్పనిసర యితేనే ప్రభుత్వం తరఫున ప్రకటనలు ఇవ్వాలని, కొత్త వాహనాలను కొనుగోలు చేయవద్దని, ఇప్పుడున్న వాహనాలనే వినియోగించుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో గెలవకముందే 22 ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన సీఎం ఇలాంటి ఖర్చులను అస్సలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు.
నేడు నాగ్‌పూర్‌కు ముఖ్యమంత్రి
సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఉదయం నాగ్‌పూర్ వెళ్తున్నారు. అక్కడ జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడానికి వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వివరించాయి. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సాయంత్రం సీఎం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని ఆ వర్గాలు తెలిపాయి.
కేంద్రానికి పేరొస్తుందని ఆలోచించకండి
కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంలో ఎక్కడా వెనుకడుగు వేయొద్దని సీఎం రేవంత్ చెప్పారు. ‘కేంద్రం ఇచ్చే గ్రాంట్లను నూటికి నూరుపాళ్లు సద్వినియోగం చేసుకోవాలి. వీలైనన్ని ఎక్కువ గ్రాంట్లు రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. వివిధ శాఖలు, పథకాల వారీగా కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్‌ను వినియోగించుకోవాలి. కొంత వాటా రాష్ట్రం ఇస్తే కేంద్రం మిగిలిన నిధులను ఇచ్చే ప్రాయోజిత పథకాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు.
కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనో, రాష్ట్ర ప్రభుత్వానికి పేరు పెద్దగా రాదనో బేషజాలకు అస్సలు పోవద్దు.’అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, కార్యదర్శి టి.కె.శ్రీదేవి, జాయింట్ సెక్రటరీ కె.హరితతో పాటు ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి కృష్ణభాస్కర్‌తో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment