న్యూఢిల్లీ: ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలను తొలగించే అంశంపై తన వైఖరిని తెలియజేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఒక నోటీసు జారీ చేసింది. బుధవారం కేంద్ర హోం, ఆర్థిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌ఎస్‌ఎస్ మాజీ సిద్ధాంతకర్త కె.ఎన్.గోవిందాచార్య దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏప్రిల్ 14న జరగనుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం.. ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్‌లు భారత్‌లో తమ అధికార ప్రతినిధుల వివరాలను బహిర్గతపరిచేలా ఆయా సంస్థలను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విరాజ్ గుప్తా డిమాండ్ చేశారు.
ద్వేషపూరిత ప్రసంగాలకు స్వర్గ ధామాలైపోయినా సామాజిక మాధ్యమాల్లో చట్టాలను అమలు చేసే వ్యవస్థ పోతోందని, అందుకు జవాబుదారీ అయిన అధికారులు ఎవరనేది తెలియకపోవడమూ ఇందుకు కారణమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలర్లకు, ఆస్తుల విధ్వంసానికి సామాజిక మాధ్యమాలు ఒక పనిముట్టుగా మారకూడదని, భావప్రకటన స్వేచ్ఛలో భాగమని చెప్పుకోవడమూ సరికాదని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛ అన్న భావనను ఈ సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం చేస్తున్నాయని, భారతీయ చట్టాలను పాటించడం లేదని ఆరోపించారు. తగిన చర్యలేవీ లేని కారణంగానే రెచ్చగొట్టే ప్రసంగాలూ ఎక్కువ అవుతున్నాయని పిటిషనర్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment