సాక్షి, హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు.. ఇప్పుడు దీన్ని ’’సీఎం వరమిచ్చినా దేవాదాయశాఖ కరుణించడం లేదు’’అని మార్చి చదువుకోవాలి. ధూపదీప నైవేద్యాలకు స్వయంగా సీఎం ముందుకొచ్చినా.. దేవాదాయ శాఖే దాన్ని అడ్డుకుంది.
గోపన్‌పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించిన రోజు ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ధూపదీప నైవేద్య పథకాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పథకం కింద అందిస్తున్న భృతిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించిన సమయంలో కొత్తగా మరో 2,796 దేవాలయాలకు కూడా దీన్ని వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు.
అప్పటికే ఆ జాబి తా దేవాదాయ శాఖ పరిశీలనలో ఉన్నందున, ఆ జాబితాలోని దేవాలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు సీఎం తేల్చి చెప్పారు. కానీ, శనివా రం విడుదలైన ఉత్తర్వుల్లో ఆ సంఖ్యను దేవాదాయశాఖ 2,043గానే చూపింది. నిధుల సాకుతో మిగతా గుడులను అందులో నుంచి తప్పించింది. ఫలితంగా, ఆయా దేవాలయాల్లో దేవరులతోపాటు, ఆ ఆలయాలనే నమ్ముకుని ఉన్న అర్చకులు ఇప్పుడు ఆగమాగమయ్యే గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఒకే జాబితా.. ఎలా తొలగిస్తారు..?
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద ప్రతినెలా రూ.6 వేలు చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తోంది. వీటిల్లో రూ.2 వేలను దేవుడికి ధూపదీప నైవేద్యానికయ్యే వ్యయానికి వాడుతుండగా, మిగతా మొత్తాన్ని ఆ ఆలయ పూజారి కుటుంబం గడవటానికి భృతిగా వినియోగిస్తున్నారు.
ఆదాయం లేక ఆలనాపాలనా లేని మరిన్ని దేవాలయాలను కూడా దీని పరిధిలోకి తేవాలన్న ఉద్దేశంతో దేవాదాయ శాఖ గత ఏడాది చివరలో ఓ జాబితాను సిద్ధం చేసింది. ప్రతి జిల్లా అదనపు కలెక్టర్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, ముగ్గురు అర్చకులు.. వెరసి ఐదుగురు సభ్యుల కమిటీ అర్చకుల అర్హతల ఆధారంగా ఎంపికలు జరిపింది. అలా 2,796 మంది పూజారుల జాబితాను సిద్ధం చేసుకుని ప్రభుత్వ పరిశీలనకు పంపింది. ఆ జాబితా ఆధారంగానే ముఖ్యమంత్రి కూడా ప్రకటన చేశారు.
మిగిలిన 753 దేవాలయాల పరిస్థితేంటి?
కొంతకాలంగా ధూపదీప నైవేద్య పథకానికి ఆర్థిక శాఖ నిధులు సరిగా ఇవ్వటం లేదు. మూడు నెలల మొత్తం బకాయిగా పేరుకుపోయి ఉంది. గతేడాది చివరలో కూడా నాలుగు నెలల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఈ జాబితాను తగ్గించాలని భావించిన అధికారులు, సీఎం ప్రకటనకు భిన్నంగా కేవలం 2,043 దేవాలయాలకే పథకాన్ని వర్తింపు చేస్తున్నట్టు శనివారం ఉత్తర్వు జారీ చేశారు. దీంతో ఆ జాబితాలో 753 దేవాలయాలు మిగిలి పోయాయి.
ఒకేసారి రూపొందిన మొత్తం జాబితాను ఓకే చేయాల్సిందిపోయి, సింహభాగం దేవాలయాలను ఎంపిక చేసి కొన్నింటిని వదిలేయటం ఇప్పుడు గందరగోళంగా మారింది. ప్రభుత్వం నుంచి భృతి రాదని తేలితే వారు ఆ ఆలయాల్లో అర్చకులు కొనసాగే పరిస్థితి అంతగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడు ఆలయంలో ధూపదీప నైవేద్యాలు ఆగిపోయే పరిస్థితి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment