పోలవరం ఫలాలు త్వరగా అందాలి  | CM YS Jagan appeal to Nirmala Sitharaman On Polavaram | Sakshi
Sakshi News home page

పోలవరం ఫలాలు త్వరగా అందాలి 

Published Fri, Oct 6 2023 3:39 AM | Last Updated on Fri, Oct 6 2023 6:53 AM

CM YS Jagan appeal to Nirmala Sitharaman On Polavaram - Sakshi

ఢిల్లీలో కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి, ఫలితాలు అందించడానికి కేంద్రం సహకరించాలని కోరారు. గురువారం సాయంత్రం సీఎం జగన్‌.. కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బకాయిలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.

ప్రజలకు ప్రాజెక్టు ఫలితాలు అందించడానికి సహకరించాలని కోరారు. పూర్తి నిర్మాణ వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాలన్నారు. 2017–18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లుగా ఇప్పటికే సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడహాక్‌గా నిధులు విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు ఆమోదం లభించడం సంతోషకరమని, అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామని తెలిపారు.

లైడార్‌ సర్వే ప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, 2022 జూలైలో వచి్చన భారీ వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలి దశ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేయాల్సిన పనులపై ఈ అంచనాలు రూపొందించామని చెప్పారు. పోలవరం తొలి దశను పూర్తి చేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని, ఆ మేరకు నిధులు విడుదలచేయాలని కోరారు.  
 
రూ.1,355 కోట్లు రీయింబర్స్‌ చేయాలి 
ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధుల నుంచి ఖర్చు చేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్‌ చేయాలని సీఎం జగన్‌ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలు సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రూ.7,359 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ బకాయిల రూపంలో  చెల్లించాల్సి ఉందన్నారు. 2014 జూన్‌  నుంచి 2017 జూన్‌న్‌వరకు సరఫరా చేసిన విద్యుత్‌కు ఇప్పటి వరకు ఛార్జీలు చెల్లించలేదని, తొమ్మిదేళ్లుగా ఈ సమస్య పెండింగులో ఉందని గుర్తు చేశారు. ఏపీ జెన్‌కోకు, డిస్కంలకు ఇది తీవ్ర గుదిబండగా మారిందని  తెలిపారు.

తద్వారా వివిధ సంస్థలకు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ నుంచి సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సొమ్ము ఇప్పించాలంటూ ఏపీ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేసిన తర్వాత 30 రోజుల్లోగా ఏపీకి బకాయిలు చెల్లించాలంటూ 2022 ఆగస్టు 29న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం హైకోర్టును ఆశ్రయించిందని, దీంతో ఈ అంశంలో కోర్టు పరిధిలోకి వెళ్లిందని తెలిపారు. ఏపీ విద్యుత్‌ సంస్థలకు ఆ సొమ్ము వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్‌ రంగానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.  
 
ఏపీలో విద్యుత్‌ రంగం బాగుంది 
అనంతరం కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ మీడియాతో మాట్లాడారు. ఏపీలో విద్యుత్‌ రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించానన్నారు. ఏపీలో విద్యుత్‌ రంగం పనితీరుపై కేంద్రం సంతృప్తిగా ఉందని స్పష్టం చేశారు. రీ వ్యాంప్డ్‌ డి్రస్టిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం (ఆర్‌డీఎస్‌ఎస్‌)కు ఏపీ క్వాలిఫై అయిందని తెలిపారు. తెలంగాణ విద్యుత్‌ బకాయిలపై మీడియా ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement