న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా తీసుకోతగిన చర్యలపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో వర్చువల్‌గా సమావేశం (వీజీఐఆర్) కానున్నారు. దీని ద్వారా భారతీయ వ్యాపార దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల వర్గాలతో భేటీ కావడానికి విదేశీ ఇన్వెస్టర్లకు వీలు లభించగలదని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఆర్థిక శాఖ, ప్రధాని కార్యాలయం (పీఎంవో) కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించనున్నాయి. (ఆంధ్రాలో ఓలా ఈ–స్కూటర్ల ప్లాంటు?)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తదితరులు కూడా ఇందులో పాల్గొంటారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో దాదాపు 6 లక్షల కోట్ల డాలర్ల పైగా విలువ చేసే అసెట్స్‌ను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థల సీఈవోలు, సీఐవోలు ఈ సమావేశంలో పాలుపంచుకోనున్నారు. భారత ఆర్థిక, పెట్టుబడుల పరిస్థితి, వ్యవస్థాగత సంస్కరణలు, 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగేందుకు ప్రభుత్వ ప్రణాళికలు తదితర అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment