సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు వ్యయం రీయింబర్స్‌మెంట్ విషయంలో కాంపొనెంట్ వారీ సీలింగ్ ఎత్తివేయడానికి అభ్యంతరం లేదని ఆర్థిక శాఖ పేర్కొందని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. అంచనా వ్యయం పెరుగుదల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సిఫారసు మేరకు కాంపొనెంట్ వారీ సీలింగ్‌ను సడలించినట్లు చెప్పారు.
ఈమేరకు ఆయన గురువారం లోక్‌సభలో వైఎస్సార్‌సిపీ సభ్యుడు పోచ బ్రహ్మానందరెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. చెల్లింపులకు అర్హమైనప్పటికీ కాంపొనెంట్‌వారీ నియంత్రణవల్ల రూ.550.97 కోట్లు అబయెన్స్‌లో ఉండిపోయాయని, వాటిని ఇప్పుడు రీయింబర్స్ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
కృష్ణా ట్రిబ్యునల్ –2 గడువు పొడిగింపు
ఏపీ, తెలంగాణల మధ్య నదీ జలాల వివాద పరిష్కారానికి ఏర్పాటైన కృష్ణా ట్రిబ్యునల్–2 కాలపరిమితిని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. ఈమేరకు ఆయన వైఎస్సార్‌సీపీ సభ్యుడు అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఏపీలో 307 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో 355 పబ్లిక్ ఈవీ (ఎలక్ట్రికల్ వెహికల్) ఛార్జింగ్ పాయింట్లు ఉండగా.. 307 అమలులో ఉన్నాయని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ వైఎస్సార్‌సీపీ సభ్యుడు గోరంట్ల మాధవ్ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
గిరిజనుల రక్షణకు చర్యలు
ఇటీవల గోదావరి వరదల నేపథ్యంలో వేలేరుపాడు, కుకునూరు, పోలవరం, చింతూరు, ఎటపాక, రంపచోడవరం మండలాల్లోని నదీ పరిసర ప్రాంతాల్లో నివసించే గిరిజనుల రక్షణకు ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. గోదావరి ఒడ్డుకు ఎలాంటి విఘాతం కలగకుండా జులై 17న అత్యధికంగా వరద నీరు సముద్రంలోకి విడుదల చేసినట్లు వైఎస్సార్‌సీపీ సభ్యుడు మార్గాని భరత్‌రామ్ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
నవంబరు 2024 కల్లా కృష్ణపట్నం పోర్టుకు ఆరు లేన్ల రహదారి
కృష్ణపట్నం పోర్టుకు ఆరు లేన్ల రహదారి ప్రాజెక్టు వచ్చే ఏడాది నవంబరుకల్లా పూర్తవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. వైఎస్సార్‌సీపీ సభ్యుడు బాలశౌరి ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment