సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్ ప్రతిపాదనల తయారీలో ఆర్భాటాలకు పోవద్దని రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మారిన ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతిపాదనల తోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరించిన అంచనాలను పంపాలని సూచించింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు 52 పేజీలతో కూడిన విధివిధానాలను అన్ని ప్రభుత్వ శాఖలకు పంపారు. ఈ నెల 9లోగా ఆన్‌లైన్‌లో ఈ ప్రతిపాదనలను పరిపాలన విభాగాల నుంచి సచివాలయానికి పంపాలని, ప్రతిపాదనలను పరిశీలించి అదే నెల 11లోగా సచివాలయ అధికారులు ఆర్థిక శాఖకు పంపించాలని ఆ విధివిధానాల్లో పేర్కొన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ సూచనలివే:
♦ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిన నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలను కొనసాగించాలో వద్దో నిశితంగా పరిశీలించాలి.
♦కొత్త పథకాలను ప్రారంభించాల్సిన పరిస్థితుల్లో ఎప్పటి నుంచి అమలు కావాలి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చవుతుందన్నది స్పష్టంగా పొందుపర్చాలి.
♦ ప్రభుత్వ శాఖల పరిధిలో పూర్తి కావాల్సిన పనుల వివరాలను పేర్కొనాలి. వాస్తవిక అవసరాల మేరకే వాటికి ప్రతిపాదనలివ్వాలి.
♦ అన్ని ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు, పనుల ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలను వివరంగా తెలపాలి.
♦ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అమలు చేసిన పథకాల వివరాలు, వాటి అమలు కోసం సంవత్సరాలవారీగా అయిన ఖర్చు, లబ్ధిదారుల సంఖ్యను తెలియపర్చాలి.
♦2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 30 వరకు వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్‌పీవీ) ద్వారా తీసుకున్న రుణాల వివరాలను ప్రత్యేక ఫార్మాట్‌లో పంపించాలి.
♦కేంద్ర ప్రాయోజిత పథకాల (సీసీఎస్)ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమయ్యే ప్రతిపా దనలను పొందుపర్చాలి. రాష్ట్ర ప్రభుత్వ కార్య క్రమాలతో కలిసి కేంద్ర పథకాలను వినియో గించుకునే క్రమంలో ఈ ప్రతిపాదనలుండాలి.
♦ ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు అనుగుణంగా అ న్ని శాఖలు ఆస్తుల వివరాలు, పన్ను రాబడు లు, రుణాల వివరాలను పొందుపర్చాలి.
♦ అన్ని శాఖలకు ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలను కూడా పంపాలి.
♦ బడ్జెట్ ప్రతిపాదనలు పంపే క్రమంలో వాస్తవిక అంచనాలుండాలే తప్ప గొప్పలకు పోయి భారీ అంచనాలను పంపొద్దు. గ్రాంట్‌ఇన్ ఎయిడ్ ఖర్చును తగ్గించి పంపాలి. అన్ని విభాగాల ఖర్చులను ఒక్క శాఖ కిందనే పంపాలి.
♦ కార్యాలయ నిర్వహణ, వాహనాలు, అద్దెలు, నీరు, విద్యుత్ ఖర్చులు, స్టేషనరీ, అవుట్ సోర్సింగ్ సర్వీసులు, సంక్షేమ, సబ్సిడీ పథకాల ప్రతిపాదనలు వాస్తవ అవసరాలకే పరిమితం కావాలి.
♦ ప్రభుత్వ రాబడులకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను రేట్ల ప్రకారమే అంచనాలను పంపాలి.
♦ ప్రతి శాఖల్లోని ఉద్యోగుల వివరాలను వారు వేతనాలు తీసుకొనే పద్దులవారీగా విభజించి పంపాలి. హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్లు, వీఆర్‌ఏలు, రోజువారీ వేతన ఉద్యోగులు, ఫుల్‌టైం, పార్ట్‌టైం కంటింజెంట్ ఉద్యోగులు, మినిమమ్ టైం స్కేల్ సిబ్బంది, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వివరాలను ప్రత్యేక ఫార్మాట్‌లో పంపాలి.
♦ 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి ప్రభుత్వ శాఖలోకి వచ్చే అవకాశమున్న ఉద్యోగుల వివరాలను కేడర్‌వారీగా పంపాలి.
Comments
Please login to add a commentAdd a comment