
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లాకు చెందిన రైతుల సమస్య ఎట్టకేలకు తీరింది. ఎనిమిదేళ్ల క్రితం రబీ పంటలకు సంబంధించిన బీమా క్లెయిమ్‌లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో సోమవారం రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. 24,641 మంది రైతులకు 119.44 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఈ సొమ్మును కంపెనీ ద్వారా రైతుల ఖాతాలకు నేరుగా చెల్లిస్తూ తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ బటన్ ప్రెస్ చేశారు. ఆ తర్వాత ఆ జిల్లాలోని తొండూరు, సింహాద్రిపురం, వీరపునాయనిపల్లె, వేంపల్లె, పులివెందుల, వేముల, కమలాపురం మండలాలకు చెందిన రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీమా సొమ్ము కోసం హైకోర్టును కూడా ఆశ్రయించాల్సి వచ్చిందని గతంలో వారు పడిన కష్టాలు వివరించారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్న సమయంలో కూడా డబ్బులు ఇవ్వడం సంతోషకరమని రైతులు పేర్కొన్నారు. అరటి పంటకు సంబంధించిన కష్టనష్టాలను తెలుసుకుని అధికారులకు సీఎం పలు సూచనలు ఇచ్చారు. మంచి రేటు వచ్చేలా చూడాలని ఆదేశించారు.
ఇన్‌పుట్ సబ్సిడీ గత ప్రభుత్వ బకాయి విడుదల
రూ.1,100 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు
రాష్ట్రంలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1,100 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు గత చంద్రబాబు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. గత ప్రభుత్వం ఇవ్వలేకపోయిన ఇన్‌పుట్ సబ్సిడీని తామిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment