సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రస్తుతం బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ బుధవారం జారీ చేశారు. ఉద్యోగుల అభ్యర్థన, పరిపాలన ప్రాతిపదికనే బదిలీలు ఉంటాయని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి రెండేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులు అభ్యర్థన మేరకు బదిలీలకు అర్హులని ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే ఏప్రిల్ నెలాఖరు నాటికి ఐదేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు ఉంటాయని స్పష్టం చేసింది.
► ఒకేచోట అంటే సిటీ, పట్టణం, గ్రామంలో పనిచేయడాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. రాష్ట్ర ఆడిట్ శాఖ ఉద్యోగులకు సంబంధించి ఒకేచోట అంటే ఆ జోన్ పరిధిలో పరిగణిస్తారు. బదిలీల్లో 40 శాతం వైకల్యం కలిగిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తారు. మానసిక వైకల్య బాధిత పిల్లలున్న ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కలిగిన ప్రాంతానికి బదిలీల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. కారుణ్య నియామకాల్లో వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు.
► భార్యా భర్తల కేసుల్లో ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఒకసారి అవకాశం వినియోగించుకుంటే మళ్లీ ఐదేళ్ల తర్వాతే బదిలీలకు అర్హులవుతారు. బదిలీలన్నింటినీ ఉద్యోగుల అభ్యర్థన బదిలీలుగానే పరిగణిస్తారు. పదోన్నతిపై ఉద్యోగి బదిలీ తప్పకపోతే బదిలీ చేసే చోట ఆ పోస్టు ఉండాలి.
► తొలుత ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తూ బదిలీలు చేపట్టాలి. ఆ తరువాతే నాన్ ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీలు చేయాలి.
► ఐటీడీఏ పరిధిలో స్థానిక, జోనల్ కేడర్‌లో రెండు సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులను వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయాలి.
► ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీ చేసే ఉద్యోగులు 50 ఏళ్ల లోపు వారై ఉండాలి. గతంలో ఐటీడీఏలో పనిచేయని ఉద్యోగులై ఉండాలి.
► ఐటీడీఏ ప్రాంతాలతోపాటు మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటే తొలుత ఆ ప్రాంతాల్లో పోస్టులు భర్తీ చేసేలా బదిలీలను చేపట్టాలని కలెక్టర్లు, శాఖాధిపతులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
► ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా బదిలీలు జరిగే బాధ్యత సంబంధిత శాఖాధిపతులపై ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
► ఆదాయార్జన శాఖలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా, వ్యవసాయ శాఖల్లో ఉద్యోగుల బదిలీలను ఆయా శాఖల మార్గదర్శకాల మేరకు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
► పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య, సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలపై సంబంధిత శాఖలు సొంతంగా మార్గదర్శకాలను జారీ చేస్తాయి. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులను బదిలీ చేయరాదు.
► దృష్టి లోపం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఒకవేళ స్వచ్ఛందంగా బదిలీ కోరుకుంటే వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయాలి.
► ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీ అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకోరాదు.
► జూన్ 1వతేదీ నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది.
బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Published Thu, May 18 2023 4:04 AM | Last Updated on Thu, May 18 2023 10:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment