Government employees Transfers
-
బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రస్తుతం బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ బుధవారం జారీ చేశారు. ఉద్యోగుల అభ్యర్థన, పరిపాలన ప్రాతిపదికనే బదిలీలు ఉంటాయని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి రెండేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులు అభ్యర్థన మేరకు బదిలీలకు అర్హులని ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే ఏప్రిల్ నెలాఖరు నాటికి ఐదేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు ఉంటాయని స్పష్టం చేసింది. ► ఒకేచోట అంటే సిటీ, పట్టణం, గ్రామంలో పనిచేయడాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. రాష్ట్ర ఆడిట్ శాఖ ఉద్యోగులకు సంబంధించి ఒకేచోట అంటే ఆ జోన్ పరిధిలో పరిగణిస్తారు. బదిలీల్లో 40 శాతం వైకల్యం కలిగిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తారు. మానసిక వైకల్య బాధిత పిల్లలున్న ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కలిగిన ప్రాంతానికి బదిలీల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. కారుణ్య నియామకాల్లో వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. ► భార్యా భర్తల కేసుల్లో ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఒకసారి అవకాశం వినియోగించుకుంటే మళ్లీ ఐదేళ్ల తర్వాతే బదిలీలకు అర్హులవుతారు. బదిలీలన్నింటినీ ఉద్యోగుల అభ్యర్థన బదిలీలుగానే పరిగణిస్తారు. పదోన్నతిపై ఉద్యోగి బదిలీ తప్పకపోతే బదిలీ చేసే చోట ఆ పోస్టు ఉండాలి. ► తొలుత ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తూ బదిలీలు చేపట్టాలి. ఆ తరువాతే నాన్ ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీలు చేయాలి. ► ఐటీడీఏ పరిధిలో స్థానిక, జోనల్ కేడర్‌లో రెండు సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులను వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయాలి. ► ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీ చేసే ఉద్యోగులు 50 ఏళ్ల లోపు వారై ఉండాలి. గతంలో ఐటీడీఏలో పనిచేయని ఉద్యోగులై ఉండాలి. ► ఐటీడీఏ ప్రాంతాలతోపాటు మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటే తొలుత ఆ ప్రాంతాల్లో పోస్టులు భర్తీ చేసేలా బదిలీలను చేపట్టాలని కలెక్టర్లు, శాఖాధిపతులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ► ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా బదిలీలు జరిగే బాధ్యత సంబంధిత శాఖాధిపతులపై ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ► ఆదాయార్జన శాఖలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా, వ్యవసాయ శాఖల్లో ఉద్యోగుల బదిలీలను ఆయా శాఖల మార్గదర్శకాల మేరకు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ► పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య, సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలపై సంబంధిత శాఖలు సొంతంగా మార్గదర్శకాలను జారీ చేస్తాయి. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులను బదిలీ చేయరాదు. ► దృష్టి లోపం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఒకవేళ స్వచ్ఛందంగా బదిలీ కోరుకుంటే వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయాలి. ► ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీ అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకోరాదు. ► జూన్ 1వతేదీ నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది. -
ఎక్కడివాళ్లక్కడే.. కొత్త చోట చేరినా.. ఉన్నచోటే కొలువు
సాధారణంగా ఉద్యోగుల బదిలీ జరిగినప్పుడు ముందుగా పనిచేసే చోట నుంచి రిలీవ్ అవుతారు. ఆ తర్వాతే కొత్త ప్రాం తంలో జాయిన్ అయ్యేందుకు రిపోర్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు రిలీవ్ అవ్వకుండా కేవలం రిపోర్ట్ చేయాలని మాత్రమే ఆదేశాలిచ్చారు. దీంతో కొత్త ప్రదేశంలో విధుల్లో చేరే అంశంపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన గందరగోళంగా మారింది. విభజన ప్రక్రియ పూర్తయ్యి ఎవరెక్కడో అధికారికంగా నిర్ణయించినా..దీనిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినా.. పనిచేసే ప్రాం తం నుంచి రిలీవ్ అయ్యే అవకాశం మాత్రం లేకుండా పోయింది. జిల్లాలు, జోన్లు ఖరారైనా కొత్త ప్రాంతంలో విధుల్లో చేరేందుకు ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. ఇప్పటికైతే కేటాయించిన చోటుకెళ్లి రిపోర్టు చేయాలని మాత్రమే అధికారులు తమ కిందిస్థాయి సిబ్బందికి చెబుతున్నారు. ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. అయితే పాత చోటే మళ్లీ విధులు నిర్వహించాలని అంటున్నారు. దీనితో ఉద్యోగులు, ఉపాధ్యాయులు సందిగ్ధంలో పడ్డారు. మూడురోజుల్లో రిపోర్ట్ చేయాలి: రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఉద్యోగుల విభజన చేపట్టింది. దీనివల్ల జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల లెక్క తేలుతుం దని, అప్పుడు ఖాళీ ఉద్యోగాలెన్నో తెలుస్తాయని అంచనా వేస్తుంది. పైగా డిసెంబర్‌లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విభజన ప్రక్రియ పూర్తి చేసింది. కేటాయింపు సమాచారం అందిన మూడు రోజుల్లోగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. కానీ కొత్త కొలువులో చేరే విషయమై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. మార్గదర్శకాలూ జారీ చేయలేదు. ‘దీనిపై ఏదైనా ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది’అని ఉపాధ్యాయ సంఘం నేతలు చావా రవి, జంగయ్య తదితరులు బుధవారం విద్యాశాఖ ఉన్నతాధికారులను కోరారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని వారు తెలిపారు. మల్టీ జోనల్ బదిలీల ఆటంకం! ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు జిల్లా అధికారులకు రిపోర్టు చేస్తున్నారు. జిల్లా మార్పు జరగని వారికైతే ఫర్వాలేదు. కానీ కొత్త జిల్లాకు వెళ్ళిన టీచర్లకు ఏ స్కూల్లో పనిచేయాలనే విషయంలో కూడా స్పష్టత కొరవడింది. మార్గదర్శకాలు వెలువడిన తర్వాత జిల్లా స్థాయిలో కౌన్సెలింగ్ చేపట్టి పోస్టింగ్ ఇస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దాదాపు లక్షకు పైగా టీచర్లుండే విద్యాశాఖలో కౌన్సెలింగ్ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని ఉద్యోగవర్గాలు అంటున్నాయి. ఈ ప్రక్రియ ఏప్రిల్, మే నెలల్లో చేపట్టే వీలుందని చెబుతున్నారు. కొత్త ప్రాంతంలో రిపోర్టు చేయడం, ఉన్న ప్రాంతంలో పనిచేయడమే దీనికి పరిష్కారమని అధికారులు చెబుతున్నారు. విభజన తర్వాత ప్రభుత్వ ప్రధానోపాధ్యాయ పోస్టుల ఖాళీలు దాదాపు 2 వేల వరకూ ఉండే వీలుంది. వీటిని స్కూల్ అసిస్టెంట్స్ ద్వారా 70 శాతం భర్తీ చేస్తారు. దీంతో ఎస్జీటీలకు పదోన్నతి కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో మల్టీ జోనల్ బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ప్రస్తుతానికి కొత్త పోస్టులో పనిచేయాల్సిందిగా చెప్పడం లేదని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. కొత్త ఏడాదిలో సమస్యలు రాకుండా చూడాలి ఉద్యోగుల విభజనకు సంబంధించి ప్రభుత్వం వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలి. ఈ ఏడాది ముగిసే లోపు మార్గదర్శకాలు జారీచేసి స్పష్టత ఇస్తే కొత్త సంవత్సరంలో సమస్యలు ఉత్పన్నం కావు. కొత్త విద్యా సంవత్సరం వచ్చిన తరువాతే బదిలీల ప్రక్రియ మొదలుపెడితే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయకూడదు. – వంకాయలపాటి మమత, టీఎస్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు స్పౌస్ కేసుల్లో తప్పనిసరిగా మినహాయింపు ఇవ్వాలి ఉద్యోగులైన భార్యాభర్తల విషయంలో స్పష్టత ఇవ్వాలి. సీఎం కేసీఆర్ మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇప్పటికే ప్రక్రియ పూర్తయిందని అంటున్నారు. స్పౌస్ కేసుల్లో తప్పనిసరిగా మినహాయింపు ఇవ్వాలి. – ముజీబ్, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పాఠశాలలకు పంపేలా ఉత్తర్వులివ్వాలి రాష్ట్రంలో ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ అసంతృప్తికరంగా ఉంది. జోన్, జిల్లాలు, స్కూళ్ల కేటాయింపుల్లో స్పష్టత లోపించింది. జిల్లాలకు కేటాయించారు కానీ పనిచేస్తున్న స్కూళ్ల నుంచి రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వడం లేదు. కొత్తగా కేటాయించిన ప్రాంతాల్లో ఎప్పుడు జాయిన్ కావాలనేది తేలడం లేదు. జిల్లాలకు కేటాయించిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి స్కూళ్లకు పంపేలా ఆర్డర్లు ఇవ్వాలి. – చావా రవి, యూటీఎఫ్ కార్యదర్శి నిర్దేశిత ఫార్మాట్లలో దరఖాస్తు చేయాలి ► తొలుత కొత్త లోకల్ కేడర్‌లో రిపోర్టు చేసిన తర్వాత తమ కేటాయింపుల ఉత్తర్వులను జత చేస్తూ నిర్దేశిత ఫార్మాట్లలో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కేడర్ ఉద్యోగులు సంబంధిత శాఖ జిల్లాధికారికి, జోనల్, మల్టీ జోనల్ కేడర్ ఉద్యోగులు సంబంధిత విభాగాధిపతి(హెచ్ఓడీ)కి దరఖాస్తు చేసుకోవాలి. ► ఉద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఆయా శాఖల జిల్లాధికారులు, విభాగాధిపతులు నివేదికలు తయారు చేసి సంబంధిత శాఖ కార్యదర్శికి పంపిస్తారు. ఈ అప్పీళ్లు/దరఖాస్తులపై తగు విచారణ అనంతరం కార్యదర్శులు సత్వర నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల కేడర్‌ను మార్చడమా లేదా కేటాయించిన కేడర్‌ను కొనసాగించడమా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ► అప్పీల్ దరఖాస్తులో ఉద్యోగి పేరు, ఐడీ, హోదా, పాత లోకల్ కేడర్, కేటాయించిన లోకల్ కేడర్, కేటాయింపు ఉత్తర్వుల సంఖ్య, సచివాలయం శాఖ, అప్పీల్‌కు కారణాలను తెలియజేయాల్సి ఉంటుంది. స్పౌస్ కేటగిరీ దరఖాస్తులో ఉద్యోగులు తమతో పాటు జీవిత భాగస్వామికి సంబంధించిన ఇవే వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. రిపోర్టు చేసిన తేదీ, ఫోన్ నంబర్ అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ► భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే స్పౌస్ కేటగిరీ కింద లోకల్ కేడర్ మార్పునకు సైతం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే తొలుత వారికి కేటాయించిన కొత్త కేడర్‌లో రిపోర్ట్ చేయాలని, ఆ తర్వాతే అప్పీల్ చేసుకోవాలని స్పష్టం చేసింది. -
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీపై స్పందించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నూతన జోనల్ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన చేపట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ, నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బదిలీల్లో భార్యభర్తలకు ఒకే చోట పోస్టింగ్‌లు ఇవ్వాలన్నారు. వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర: సీజేఐ ఎన్వీ రమణ యాసంగిలో ఒక కిలో వడ్లను కూడా కొనం.. ‘‘యాసంగిలో ఒక కిలో వడ్లను కూడా కొనం. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయం. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకరమైన విధానాలు వివరించాలి. వానకాలం పంటలపై ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని’’ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
తక్షణమే అమలులోకి ఎన్నికల కోడ్
సాక్షి, అమరావతి : స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రమంతటా తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్‌కుమార్ తెలిపారు. మంత్రులు, పదవుల్లో ఉన్న ఇతర ప్రముఖులు ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలన్నారు. కోడ్ కారణంగా వారు ప్రభుత్వ సదుపాయాలు, వసతులను వినియోగించుకునే వీల్లేదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగే ప్రతీసారి కోడ్ అమలు సాధారణ ప్రక్రియేనని.. కేంద్ర ఎన్నికల సంఘం ఏ మార్గదర్శకాలను పాటిస్తుందో తామూ వాటినే పాటిస్తున్నామన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమలులోకి వచ్చిందని.. కోడ్ ముగిసేవరకు కొత్త బదిలీలు జరగవని ఆయన చెప్పారు. ఇదివరకే బదిలీలు జరిగి, శనివారం 11 గంటల వరకు అమలులోకి రాకపోతే ఆ బదిలీలు నిలిచిపోతాయని రమేష్‌కుమార్ చెప్పారు. సమావేశంలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. - ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు పూర్తి అధికారాలు సంక్రమించాయి. అధికార యంత్రాంగం కలెక్టర్లకు పూర్తిస్థాయిలో తోడ్పాటునందించాలి. - ఎన్నికల కోసం 15 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమిస్తున్నాం. సోమవారం వారితో సమావేశం నిర్వహించిన అనంతరం వారు జిల్లాలకు వెళ్లి జిల్లా అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులకు వారధిగా పనిచేస్తారు. మరో 15 మంది అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమిస్తాం. - స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలి. ప్రజలందరూ ఈ ఎన్నికల్లో భాగస్వాములు కావాలి. - కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలలో ఇప్పుడు ఎన్నికలు జరపడం సాధ్యంకాదు. అలాంటివి 140 దాకా ఉండొచ్చు. - రాజధాని ప్రాంతంలోని గ్రామాలను కొత్తగా అర్బన్ పరిధిలోకి తీసుకొచ్చారు. సాంకేతికంగా అక్కడా ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులున్నాయి. - కొన్ని ప్రభుత్వ భవనాలపై అభ్యంతరకర రంగులున్న అంశం ఓటర్లను పెద్దగా ప్రభావితం చేయదని నా భావన. ఇకపై అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాం. - ఎన్నికల కోడ్ అమలులో ప్రత్యేకంగా ఒక పథకం గురించి స్పందించను. ఓటర్లను ప్రభావితం చేసే ఏ స్కీం అయినా.. పాతవి లేదా కొత్తవి అమలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టదలచిన ఇళ్ల పట్టాల పంపిణీ ఆ పరిధిలో వస్తే నిలిచిపోతుంది. దానిపై కలెక్టర్లు అదనపు సమాచారం కోసం సంప్రదిస్తే చర్యలు తీసుకుంటాం. - బీసీ రిజర్వేషన్లపై కొన్ని రాజకీయ పార్టీలు వేసిన కేసును సుప్రీంకోర్టు స్వీకరించిందో లేదో అనే దానిపై సమాచారంలేదు. ఏదైనా కోర్టు తీర్పునకు అనుగుణంగా పనిచేస్తాం. - ఎన్నికలు ఏకగ్రీవమైన చోట ఈసారీ ప్రోత్సాహకాలు ఉంటాయి. ప్రభుత్వం కూడా ప్రోత్సాహక మొత్తాన్ని పెంచింది. అయితే, బలవంతపు ఏకగ్రీవాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించాను. - ఎన్నికలలో మద్యం, డబ్బు పంపిణీని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం ప్రభుత్వ ధృఢమైన నిర్ణయాన్ని తెలియజేస్తోంది. - సొంత మండలంలో పనిచేసే ప్రభుత్వ సిబ్బందిని ఆ మండలంలోని ఎన్నికల విధులకు ఉపయోగించం. -
ఎంత సీఎం అయినా ఇంత అన్యాయమా!?
సాక్షి, న్యూఢిల్లీ : అది మధ్యయుగాల నాటి రాచరిక ప్రాంగణం. ఎదురుగా ఎత్తైన రాతి కట్టడంపైనున్న సింహాసనంలో ఆసీనుడైన రాజు ప్రజల బాధలను ఆలకిస్తున్నారు. ఓ పెద్దావిడ రాజుముందు మోకరిల్లి తన బాధలను చెప్పుకోవడం మొదలు పెట్టింది. బాధలను చెప్పుకోవడంలో ఆమె గొంతుకాస్త పైకిలేచింది. అంతే, రాజుకు చిర్రెత్తుకొచ్చింది. పక్కనే ఉన్న భటులను పిలిచి, ఆమెను తీసుకెళ్లి కారాగారంలో పడేయాల్సిందిగా ఆదేశించారు. మాట జవదాటని భటులు రాజుగారు చెప్పినట్లే చేశారు. ఇక్కడ బాధలు చెప్పుకున్న పెద్దావిడ పేరు ఉత్తర బహుగుణ. 57 ఏళ్ల ఆమె ఓ ప్రాథమిక పాఠశాల టీచరు. ఇక రాజెవరంటే అత్యంత శక్తివంతమైన పాలకుడు టీఎస్ రావత్. ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి. జూన్ 28వ తేదీన టీఎస్ రావత్ నిర్వహించిన ప్రజా దర్బార్‌లో చోటుచేసుకున్న సన్నివేశం ఇది. రావత్ ఆదేశం మేరకు ‘ముఖ్యమైన సమావేశానికి అంతరాయం కల్పిస్తున్నారు’ అన్న ఆరోపణలపై ఉత్తర బహుగుణను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమె గత పాతిక సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాల టీచరుగా పనిచేస్తున్నారు. అందులో 17 సంవత్సరాలు ఉత్తరాఖండ్ మారుమూల పర్వత ప్రాంతాల్లోనే పనిచేశారు. ఇప్పుడూ చేస్తున్నారు. మరో రెండు, మూడేళ్లలో ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. మూడేళ్ల క్రితం అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయారు. ఉద్యోగరీత్య కొడుకు డెహ్రాడూన్‌లో ఉంటున్నారు. ఈ వయస్సులో, మారుమూల కొండ ప్రాంతంలో ఒంటరిగా బతకలేక పోతున్నానని, తనను డెహ్రాడూన్‌కు బదిలీ చేయాలని ఆమె ముఖ్యమంత్రి రావత్‌ను ప్రజాదర్బార్‌లో కోరుకుంది. ‘ఉద్యోగంలో చేరే ముందు నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకోకుండానే సంతకం చేశావా?’ అని సీఎం ఎదురు ప్రశ్నించారు. అందుకు ఆమె ‘ప్రవాస జీవితం గడుపుతానని మాత్రం సంతకం చేయలేదు’ అని గడుసుగా సమాధానమిచ్చింది. అంతే సీఎంకు కోపం నసాలానికి ఎక్కింది. ఆమెను తక్షణమే అరెస్ట్ చేయాల్సిందిగా పక్కనే భటుల్లా నిలుచున్న పోలీసులను ఆదేశించారు. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే సీఎం రావత్ భార్య సునీత రావత్ కూడా ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల టీచరు. ఆమె ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు 22 ఏళ్లుగా ‘yì డిజైరబుల్ (కోరుకున్న)’ డెహ్రాడూన్లోనే ఉద్యోగం చేస్తున్నారు. ఉత్తర బహుగుణనేమో గత 17 సంవత్సరాలుగా ‘అన్డిజైరబుల్ (కోరుకోని)’ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఇక్కడ ‘అన్డిజైరబుల్’ అంటే ప్రభుత్వ దష్టిలో దష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్న అభివద్థికి నోచుకోని, రవాణా, ఇతర సౌకర్యాలు సరిగ్గాలేని మారుమూల ప్రాంతం అని అర్థం. అలాంటి మారుమూల ప్రాంతాలకు బదిలీపై వెళ్లడం ఇష్టంలేక చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు కూడా వదులుకుంటుంటారు. కొందరు పదవీ విరమణ కూడా తీసుకుంటారు. ఇది ఒక్క టీచర్లకే కాదు, ప్రభుత్వంలోని అన్ని విభాగాల ఉద్యోగులకు, ఆఖరికి డాక్టర్లకు కూడా వర్తిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో డాక్టర్లు పనిచేసేందుకు వీలుగా ఇదే ఉత్తరాఖండ్ ప్రభుత్వం మెడిసిన్ చదివే విద్యార్థులకు ఫీజు రాయితీని కల్పించింది. మెడిసిన్ పూర్తయిన అనంతరం విధిగా రెండేళ్లు మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తానంటూ బాండ్ రాసిచ్చిన వారికే ఈ ఫీజు రాయితీ అవకాశాన్ని ఇచ్చింది. అందుకనే 2014లో ఇదే షరతుపై 331 మంది డాక్టర్లు నియమితులయ్యారు. ఇలా ఏ ఉద్యోగానికైనా బదిలీలు, అందుకు నియమ నిబంధనలు ఉంటాయి. అదేమి దౌర్భాగ్యమేమోగానీ నేటి కంప్యూటర్ల యుగంలో కూడా నియమ నిబంధనలు సామాన్యులకే వర్తిస్తాయి. రాజకీయ నాయకులకుగానీ, వారి బంధు వర్గానికిగానీ, అనుచర వర్గానికిగానీ వర్తించవు. ఏ రాష్ట్రంలోనైనా డిజైరబుల్ అంటే కోరుకున్న చోట ఐదారేళ్లు పనిచేసిన వారినే సాధారణంగా మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తారు. అయితే నేడు ఉత్తరాఖండ్‌లో టీచర్ల బదిలీల ప్రక్రియ ఓ పరిశ్రమగా మారిందని, బదిలీల కోసం భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ ఉన్నత విద్యాశాఖాధికారి తెలిపారు. మరి, 22 ఏళ్లుగా డెహ్రాడూన్‌లో పనిచేస్తున్న సీఎం భార్య సునీత రావత్‌ను ఉన్నచోటు నుంచి కదలించక పోవడం ఏమిటీ? మారుమూల ప్రదేశంలో పనిచేస్తున్న బహుగుణను కరుణించక పోవడం ఏమిటీ! ఎంత సీఎం అయినా ఇదెంతటి అన్యాయం? ఇలాంటి విధానాల కారణంగా సమాజానికి మరో అన్యాయం కూడా జరుగుతోంది. మారుమూల ప్రాంతంలో 17 ఏళ్లుగా పని చేస్తున్న బహుగుణ ఎక్కువ సార్లు సుదీర్ఘంగా సెలవులు పెట్టారు. గతంలో భర్త అనారోగ్యం కారణంగా ఏడాదికి పైగా సెలవులో ఉన్నారు. మళ్లీ గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఆమె సెలవులోనే ఉన్నారు. ఆమె సెలవులు కారణంగా ఆమె పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాల పిల్లలు టీచరులేని కొరతను అనుభవిస్తున్నారు. ఆమెను కోరుకున్న చోటుకు బదిలీ చేయకపోవడం వల్ల ఇటు విద్యార్థులకు కూడా నష్టం వాటిల్లుతోంది. -
బదిలీల జాతర
♦ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సందడి ♦ బదిలీ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ కోన శశిధర్ అనంతపురం అర్బన్ : జిల్లాలో మూడు సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గురువారం మొదలైంది. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బదిలీలు చేపట్టిన కలెక్టరేట్ కార్యాలయం, జెడ్పీ, డీఆర్డీఏ, కార్యాలయాలను కలెక్టర్ కోన శశిధర్ పర్యవేక్షించారు. మొదటి రోజులో భాగంగా వీఆర్ఓలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్ల బదిలీల ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వ ఉత్తర్వులు 57, 58 ప్రకారం ఒకే కార్యాలయంలో మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు, మూడేళ్ల కాకపోయినా ప్రత్యేక కారణాలతో బదిలీ కోరుకునే ఉద్యోగులు ఆధారాలను జతచేసి బదిలీ కోరుతూ జిల్లా అధికారులకు ఆప్షన్లు ఇచ్చారు. ఈ ఆప్షన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో సంక్షేమశాఖలు, ప్రణాళికశాఖకు చెందిన ఉద్యోగులు పెన్నార్ భవన్, పంచాయితీరాజ్ శాఖ ఉద్యోగులు జిల్లా పరిషత్ హాల్లో గ్రామీణాభివృద్ధి, అటవీ, సమాచార పౌరసంబంధాల శాఖ, పరిశ్రమలు, శాఖలకు చెందిన ఉద్యోగులు డ్వామా హాల్లో, వ్యవసాయశాఖ దాని అనుబంధ శాఖల ఉద్యోగులు, వ్యవసాయశాఖ జెడీ కార్యాలయంలో, రెజఠన్యూ మిగిలిన ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు రెవిన్యూ భవన్లో తమ ఆప్షన్లకు సంబంధిత అధికారులకు సమర్పించారు. జిల్లా అధికారుల తో ఉద్యోగుల ఆప్షన్ వివరాలను శుక్రవారం పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. జెడ్పీలో బదిలీల కోలాహలం అనంతపురం సెంట్రల్ : జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగుల బదిలీలు గురువారం జెడ్పీ మీటింగ్ హాలులో నిర్వహించారు. మొత్తం 630 మంది ఉద్యోగులు బదిలీల కోసం ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు జెడ్పీ సీఈఓ రామచంద్ర తెలిపారు. జెడ్పీ మీటింగ్ హాలులో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ కోన శశిధర్, జాయింట్‌కలెక్టర్ లక్ష్మీకాంతం బదిలీల ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామచంద్ర, డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణ, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. జేడీఏ కార్యాలయంలో అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం గురువారం ఉద్యోగులతో కిటకిటలాడింది. వ్యవసాయశాఖతో పాటు అనుబంధ శాఖలైన ఉద్యాన, పట్టుపరిశ్రమ, పాడి పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్, మత్స్యశాఖలకు సంబంధించి బదిలీ ఆప్షన్ల ప్రక్రియ కార్యక్రమం జేడీఏ కార్యాలయంలోనే వేర్వేరుగా శిబిరాల్లో నిర్వహించారు. ఏఈవో, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్స్, డ్రైవర్లు, అటెం డర్లు, వాచ్మెన్లు తదితర కిందిస్థాయి సిబ్బందికి సంబంధించి బదిలీల ఆప్షన్లు తీసుకున్నారు. వ్యవసాయశాఖలో 76 మంది, పట్టు పరిశ్రమశాఖలో 177 మంది, ఉద్యానశాఖలో ఇద్దరు, మార్కెటింగ్‌శాఖలో 18 మంది, పాడి, పశుసంవర్ధకశాఖలో 112 మంది నుంచి ఐదు ఆప్షన్లు తీసుకున్నారు. జేడీఏ పీవీ శ్రీరామమూర్తి, జేడీఎస్ అరుణకుమారి, జేడీఏహెచ్ డాక్టర్ వి.శ్యాంమోహన్రావు, డీడీ డాక్టర్ కె.జయకుమార్, డీడీహెచ్ బీఎస్ సుబ్బరాయుడు, ఏడీహెచ్ సీహెచ్ శివసత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
బదిలీల జాతర
* 21 మంది తహసిల్దార్లకు స్థానచలనం * 183 మంది వీఆర్ఓలకూ ఏలూరు (టూ టౌన్) : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో బుధవారం కలెక్టరు కార్యాలయంలో డీఆర్ఓ కె.ప్రభాకరరావు తహసిల్దార్లకు, వీఆర్ఓలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలోని 46 మండలాల వీఆర్ఓలు, తహసిల్దార్లతో కలెక్టరేట్లోని సమావేశ హాలు కిక్కిరిసిపోయింది. 21 మంది తహసిల్దార్లను, 12 మంది డిప్యూటీ తహసిల్దార్లను బదిలీ చేశారు. 183 మంది వీఆర్ఓలను బదిలీ చేస్తూ డీఆర్ఓ ఆదేశాలు జారీచేశారు. 15 మంది ఆఫీసు సబార్డినేట్లను జూనియర్ అసిస్టెంట్లగాను, 15 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లగాను పదోన్నతులు కల్పించారు. ఎంపీడీఓల బదిలీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు నేతృత్వంలో జరగాల్సి ఉండగా ఆయన హైదరాబాదులో ఉండడంతో 15వ తేదీన జరుగుతాయని భావిస్తున్నారు. ఈఓఆర్డీలకు, పంచాయతీ కార్యదర్శులకు డీపీఓ ఆధ్వర్యంలో బదిలీలు జరగనున్నాయి. అధికారుల కసరత్తులు మినీస్టీరియల్ ఉద్యోగులతో పాటు సబార్డినేట్ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన జీవో నెంబరు 709 ప్రకారం బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసిన ఉద్యోగులందరినీ బదిలీ చేయాల్సి ఉండగా మూడేళ్లు దాటిన వారిలో 20 శాతం మించకుండా బదిలీలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎంపీడీఓలకు సంబంధించి వారు సొంత మండల పరిధిలో ఉన్న డివిజన్లల్లో కాకుండా ఇతర డివిజన్లల్లోనూ, గతంలో ఒకసారి పని చేసిన మండలంలో మరోసారి పనిచేయకుండా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. డీఆర్డీఏలో పనిచేసే పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఇప్పటికే సెర్ప్ సీఈఓ ఆదేశాలు జారీచేశారు. డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డితో పాటు డీఆర్డీఏ పీడీ పులి శ్రీనివాసులు రెండు నెలల క్రితం సెలవులో వెళ్లి ఇంతవరకు జాయిన్ కాలేదు. ఆయన జిల్లా నుంచి బదిలీపై వేరే చోటకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. జిల్లా నుంచి బదిలీ అయిన అధికారుల స్థానంలో జడ్పీ సీఈఓ ఇంతవరకు జాయిన్ కాలేదు. డీపీఓ శ్రీధర్‌రెడ్డి మాత్రం జాయిన్ అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఈఓఆర్డీలకు, కార్యదర్శులకు బదిలీలు జరగనున్నాయి. పంచాయతీ కార్యదర్శుల బదిలీలపై కోర్టు స్టే ? మరో రెండు రోజుల్లో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరగాల్సి ఉండగా యూనియన్ నాయకులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చినట్టు సమాచారం. బదిలీ అయిన తహసిల్దార్లు జిల్లాలో 21 మంది తహసిల్దార్ల బదిలీ వివరాలు డీఆర్ఓ కె.ప్రభాకరరావు తెలిపారు. ద్వారకాతిరుమల తహసిల్దార్ సీహెచ్విఎస్ఆర్ఎల్ ప్రసాద్‌ను మొగల్తూరుకు, జీలుగుమిల్లి తహసిల్దార్ పి.శ్రీనివాస్‌ను తాళ్లపూడికి, కలెక్టరేట్లో ఫార్మర్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జీవి సుబ్బారావును ఏఓ ఎల్ఆర్గా, పెనుగొండ తహసిల్దార్‌గా పనిచేస్తున్న ఎన్.నాగరాజును టి.నర్సాపురం తహసిల్దార్‌గా బదిలీ చేశారు. కలెక్టరేట్లో ఏఓగా పనిచేస్తున్న డీఏ నరిసింహరాజును కామవరకోట తహసిల్దారుగా బదిలీ చేశారు. కామవరపుకోట తహ సిల్దార్ కె.అద్దయ్యను కొయ్యలగూడెంకు, బుట్టాయిగూడెం తహసిల్దారు ఎం.గంగరాజును కొవ్వూరుకు, మొగల్తూరు తహసిల్దార్ వీఎస్ఎస్ బ్రహ్మానందాన్ని పెనుగొండకు బదిలీ చేశారు. తాళ్ళపూడి తహసిల్దార్ ఏ.సుధాకర్‌ను నిడమర్రుకు, అత్తిలి తహసిల్దారు ఎ.శ్రీనివాస్‌ను వేలేరుపాడు, కొవ్వూరు తహసిల్దార్ జి.కనకరాజును అత్తిలి, కుక్కునూరు తహసిల్దారుగా పనిచేస్తున్న బి.సుమతిని డ్వామా ఏపీడీగాను, వేలేరుపాడు తహసిల్దారుగా పనిచేస్తున్న ఎండీ అసీఫాను బుట్టాయిగూడెం, ఏలూరు తహసిల్దారు జీవి సుబ్బారావును కలెక్టరేట్లో ఏఓగా బదిలీ చేశారు. ఏలూరు ఏఓ ఎల్ఆర్గా పనిచేస్తున్న జి.సాంబశివరావును జీలుగుమిల్లి తహసిల్దార్‌గా, తూర్పుగోదావరి జిల్లాలో తహసిల్దారుగా పనిచేస్తున్న బి.నాగరాజు నాయక్‌ను కుక్కునూరు, నిడమర్రు తహసిల్దారు ఎం.ఇందిరాగాంధీని పెదవేగి తహశీల్దార్‌గా బదిలీ చేశారు. టి.నర్సాపురం తహసిల్దారుగా పనిచేస్తున్న ఎల్.దేవికాదేవిని ద్వారకాతిరుమల, పెదవేగి తహసిల్దారుగా పనిచేస్తున్న బి.సోమశేఖరరావును ఏలూరు ఆర్ డీఓ ఆఫీసు డీఏఓగా, కొయ్యలగూడెం తహసిల్దారుగా పనిచేస్తున్న ఎం.ముక్కంఠని పోలవరం, ఏలూరు ఆర్డీఓ ఆఫీసులో డీఏఓగా పనిచేస్తున్న బీఎస్ రామాంజనేయులును ఏలూరు తహసిల్దార్‌గా బదిలీ చేస్తూ డీఆర్ఓ కె.ప్రభాకరరావు ఆదేశాలు జారీచేశారు.