ఎంత సీఎం అయినా ఇంత అన్యాయమా!? | Injustice To A Woman Teacher In uttarakhand | Sakshi
Sakshi News home page

ఎంత సీఎం అయినా ఇంత అన్యాయమా!?

Published Wed, Jul 4 2018 5:19 PM | Last Updated on Wed, Jul 4 2018 9:32 PM

Injustice To A Woman Teacher In uttarakhand - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అది మధ్యయుగాల నాటి రాచరిక ప్రాంగణం. ఎదురుగా ఎత్తైన రాతి కట్టడంపైనున్న సింహాసనంలో ఆసీనుడైన రాజు ప్రజల బాధలను ఆలకిస్తున్నారు. ఓ పెద్దావిడ రాజుముందు మోకరిల్లి తన బాధలను చెప్పుకోవడం మొదలు పెట్టింది. బాధలను చెప్పుకోవడంలో ఆమె గొంతుకాస్త పైకిలేచింది. అంతే, రాజుకు చిర్రెత్తుకొచ్చింది. పక్కనే ఉన్న భటులను పిలిచి, ఆమెను తీసుకెళ్లి కారాగారంలో పడేయాల్సిందిగా ఆదేశించారు. మాట జవదాటని భటులు రాజుగారు చెప్పినట్లే చేశారు.
 
ఇక్కడ బాధలు చెప్పుకున్న పెద్దావిడ పేరు ఉత్తర బహుగుణ. 57 ఏళ్ల ఆమె ఓ ప్రాథమిక పాఠశాల టీచరు. ఇక రాజెవరంటే అత్యంత శక్తివంతమైన పాలకుడు టీఎస్‌ రావత్‌. ఆయన ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి. జూన్‌ 28వ తేదీన టీఎస్‌ రావత్‌ నిర్వహించిన ప్రజా దర్బార్‌లో చోటుచేసుకున్న సన్నివేశం ఇది. రావత్‌ ఆదేశం మేరకు ‘ముఖ్యమైన సమావేశానికి అంతరాయం కల్పిస్తున్నారు’ అన్న ఆరోపణలపై ఉత్తర బహుగుణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమె గత పాతిక సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాల టీచరుగా పనిచేస్తున్నారు. అందులో 17 సంవత్సరాలు ఉత్తరాఖండ్‌ మారుమూల పర్వత ప్రాంతాల్లోనే పనిచేశారు. ఇప్పుడూ చేస్తున్నారు. మరో రెండు, మూడేళ్లలో ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది.
 
మూడేళ్ల క్రితం అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయారు. ఉద్యోగరీత్య కొడుకు డెహ్రాడూన్‌లో ఉంటున్నారు. ఈ వయస్సులో, మారుమూల కొండ ప్రాంతంలో ఒంటరిగా బతకలేక పోతున్నానని, తనను డెహ్రాడూన్‌కు బదిలీ చేయాలని ఆమె ముఖ్యమంత్రి రావత్‌ను ప్రజాదర్బార్‌లో కోరుకుంది. ‘ఉద్యోగంలో చేరే ముందు నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకోకుండానే సంతకం చేశావా?’ అని సీఎం ఎదురు ప్రశ్నించారు. అందుకు ఆమె ‘ప్రవాస జీవితం గడుపుతానని మాత్రం సంతకం చేయలేదు’ అని గడుసుగా సమాధానమిచ్చింది. అంతే సీఎంకు కోపం నసాలానికి ఎక్కింది. ఆమెను తక్షణమే అరెస్ట్‌ చేయాల్సిందిగా పక్కనే భటుల్లా నిలుచున్న పోలీసులను ఆదేశించారు.

ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే సీఎం రావత్‌ భార్య సునీత రావత్‌ కూడా ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల టీచరు. ఆమె ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు 22 ఏళ్లుగా ‘yì డిజైరబుల్‌ (కోరుకున్న)’ డెహ్రాడూన్‌లోనే ఉద్యోగం చేస్తున్నారు. ఉత్తర బహుగుణనేమో గత 17 సంవత్సరాలుగా ‘అన్‌డిజైరబుల్‌ (కోరుకోని)’ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఇక్కడ ‘అన్‌డిజైరబుల్‌’ అంటే ప్రభుత్వ దష్టిలో దష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్న అభివద్థికి నోచుకోని, రవాణా, ఇతర సౌకర్యాలు సరిగ్గాలేని మారుమూల ప్రాంతం అని అర్థం.

అలాంటి మారుమూల ప్రాంతాలకు బదిలీపై వెళ్లడం ఇష్టంలేక చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు కూడా వదులుకుంటుంటారు. కొందరు పదవీ విరమణ కూడా తీసుకుంటారు. ఇది ఒక్క టీచర్లకే కాదు, ప్రభుత్వంలోని అన్ని విభాగాల ఉద్యోగులకు, ఆఖరికి డాక్టర్లకు కూడా వర్తిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో డాక్టర్లు పనిచేసేందుకు వీలుగా ఇదే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మెడిసిన్‌ చదివే విద్యార్థులకు ఫీజు రాయితీని కల్పించింది. మెడిసిన్‌ పూర్తయిన అనంతరం విధిగా రెండేళ్లు మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తానంటూ బాండ్‌ రాసిచ్చిన వారికే ఈ ఫీజు రాయితీ అవకాశాన్ని ఇచ్చింది. అందుకనే 2014లో ఇదే షరతుపై 331 మంది డాక్టర్లు నియమితులయ్యారు.

ఇలా ఏ ఉద్యోగానికైనా బదిలీలు, అందుకు నియమ నిబంధనలు ఉంటాయి. అదేమి దౌర్భాగ్యమేమోగానీ నేటి కంప్యూటర్ల యుగంలో కూడా నియమ నిబంధనలు సామాన్యులకే వర్తిస్తాయి. రాజకీయ నాయకులకుగానీ, వారి బంధు వర్గానికిగానీ, అనుచర వర్గానికిగానీ వర్తించవు. ఏ రాష్ట్రంలోనైనా డిజైరబుల్‌ అంటే కోరుకున్న చోట ఐదారేళ్లు పనిచేసిన వారినే సాధారణంగా మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తారు. అయితే నేడు ఉత్తరాఖండ్‌లో టీచర్ల బదిలీల ప్రక్రియ ఓ పరిశ్రమగా మారిందని, బదిలీల కోసం భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ ఉన్నత విద్యాశాఖాధికారి తెలిపారు. మరి, 22 ఏళ్లుగా డెహ్రాడూన్‌లో పనిచేస్తున్న సీఎం భార్య సునీత రావత్‌ను ఉన్నచోటు నుంచి కదలించక పోవడం ఏమిటీ? మారుమూల ప్రదేశంలో పనిచేస్తున్న బహుగుణను కరుణించక పోవడం ఏమిటీ! ఎంత సీఎం అయినా ఇదెంతటి అన్యాయం?

ఇలాంటి విధానాల కారణంగా సమాజానికి మరో అన్యాయం కూడా జరుగుతోంది. మారుమూల ప్రాంతంలో 17 ఏళ్లుగా పని చేస్తున్న బహుగుణ ఎక్కువ సార్లు సుదీర్ఘంగా సెలవులు పెట్టారు. గతంలో భర్త అనారోగ్యం కారణంగా ఏడాదికి పైగా సెలవులో ఉన్నారు. మళ్లీ గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఆమె సెలవులోనే ఉన్నారు. ఆమె సెలవులు కారణంగా ఆమె పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాల పిల్లలు టీచరులేని కొరతను అనుభవిస్తున్నారు. ఆమెను కోరుకున్న చోటుకు బదిలీ చేయకపోవడం వల్ల ఇటు విద్యార్థులకు కూడా నష్టం వాటిల్లుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement