సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో సంభవించిన ధౌలిగంగా విషాదం యావత్ దేశ ప్రజలను కలచివేస్తోంది. హిమాలయ మంచుకొండలు విరిగిపడటంతో ఒక్కసారిగా ఉప్పొంగిన ధౌలిగంగా.. 170 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాకుండా చేసింది. అనూహ్యంగా సంభవించిన గంగ ధాటికి నది పరివాహంలోని అనేక ప్రాంతాలు భయం గుప్పిట చిక్కుకున్నాయి. ఆదివారం రాత్రి మరోసారి కొండచరియలు విరగడంతో నది ఉధృతి మరింత పెరిగింది. సహాయ చర్యల్లో నిమగ్నమైన సిబ్బంది ఇప్పటి వరకు 10 శవాలను వెలికి తీయగా.. అతికష్టం మీద 16 మంది రక్షించగలికారు. తపోవన్ వద్ద పనిచేస్తున్న 148 మంది, రిషిగంగ వద్దనున్న 22 మంది మొత్తం 170 మంది అచూకీ ఇంకా లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు నది ప్రవాహం మరింత పెరగడం సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సహాయ సిబ్బందితో మాట్లాడిన మోదీ, అమిత్ షా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. యావత్ దేశ ఉత్తరాఖండ్ ప్రజల కోసం ప్రార్థిస్తోందంటూ మోదీ భరోసా ఇచ్చారు. మరోవైపు ధౌలిగంగా ఘటనపై దేశవ్యాప్తంగా ప్రముఖులు స్పందిస్తున్నారు. వరదలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నారు.
రిషభ్ పంత్ విరాళం..
ఈ క్రమంలోనే టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్ ఉత్తరాఖండ్ జల విలయంపై ఆవేదన వ్యక్తం చేశారు. వరదలో కార్మికులు మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు తొలి టెస్ట్ మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించాడు. ఈ మేరకు సోమవారం పంత్ ట్వీట్ చేశాడు. ‘ధౌలిగంగా ఘటన చోటుచేసుకోవడం ఎంతో కలచివేసింది. ఈ ఘటనలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. నా వంతు సాయంగా తొలిటెస్ట్ మ్యాచ్ ఫీజును విరాళంగా అందిస్తున్నాను. ఈ మొత్తాన్ని అక్కడి సహాయ చర్యల కొరకు అందిస్తాను.’ అని భావోద్వేగంగా ట్వీట్ చేశాడు. అంతేకాకుండా హిమాలయ రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా ట్విటర్ వేదికగా పంత్ కోరాడు. కాగా చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో పంత్ ఆడుతున్న విషయం తెలిసిందే. 88 బంతుల్లో 91; (9 ఫోర్లు, 5 సిక్సర్లు) కీలక ఇన్సింగ్స్‌తో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ పంత్ స్వస్థలమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment