డెహ్రాడూన్: అసమ్మతి వార్తల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వంతో సమావేశం అనంతరం డెహ్రాడూన్‌కు తిరిగివచ్చిన సీఎం రావత్ రాజ్‌భవన్‌లో గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు. కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభాపక్షం బుధవారం సమావేశమవుతుందని వెల్లడించారు. రాష్ట్ర మంత్రి ధన్‌సింగ్ రావత్, ఎంపీలు అజయ్‌భట్, అనిల్ బలూనీలు రేసులో ఉన్నప్పటికీ.. ధన్ సింగ్‌కే తదుపరి సీఎం అయ్యే చాన్సుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజీనామా సమర్పించే ముందు తన అధికార నివాసంలో మంత్రులు ధన్‌సింగ్, మదన్ కౌశిక్ సహా పలువురు సన్నిహితులతో రావత్ సమావేశమయ్యారు.
రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పాలనను మరొకరు చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. మరొకరికి సీఎంగా అవకాశం కల్పించాలన్న పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని, తదుపరి సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అకస్మాత్తుగా సీఎం మార్పునకు కారణమేంటన్న ప్రశ్నకు.. అది ‘పార్టీ నాయకత్వం ఒక్కటిగా తీసుకున్న నిర్ణయం. ఇంకా వివరాలు కావాలంటే ఢిల్లీ వెళ్లి అడగండి’అని సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రిగా తాను చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా రావత్ మీడియాకు వివరించారు. భర్త తరఫు వారసత్వ ఆస్తిపై భార్యకు కూడా హక్కు కల్పిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను గుర్తు చేశారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బన్సిధర్ భగత్, ధన్‌సింగ్ రావత్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అధికార మార్పిడి సజావుగా సాగేందుకు వీలుగా రమణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్‌లను పరిశీలకులుగా డెహ్రాడూన్ పంపించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. 2000 నవంబర్‌లో ఉత్తర ప్రదేశ్ నుంచి విడిపడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఇప్పటివరకు కాంగ్రెస్ నేత ఎన్‌డీ తివారీ మినహా ఏ ముఖ్యమంత్రి కూడా పూర్తిగా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగకపోవడం ఉత్తరాఖండ్ ప్రత్యేకత. 2017, మార్చి 18న రావత్ ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకుగాను 57 సీట్లను బీజేపీ గెలుచుకుంది. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌పై అసమ్మతి పెరుగుతోందన్న సమాచారంతో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, పార్టీ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు రమణ్‌సింగ్, దుష్యంత్ గౌతమ్‌లను పార్టీ నాయకత్వం గత శనివారం రాష్ట్రానికి పంపించింది.
వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే..
సీఎం పదవికి రావత్ రాజీనామా చేయడంపై విపక్ష కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించింది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో విఫలం చెందామని ఈ రాజీనామాతో బీజేపీ అంగీకరించిందని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దేవేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని రాష్ట్రపతిని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment