బదిలీల జాతర
♦ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సందడి
♦ బదిలీ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ కోన శశిధర్
అనంతపురం అర్బన్ : జిల్లాలో మూడు సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గురువారం మొదలైంది. దీంతో కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బదిలీలు చేపట్టిన కలెక్టరేట్ కార్యాలయం, జెడ్పీ, డీఆర్‌డీఏ, కార్యాలయాలను కలెక్టర్ కోన శశిధర్ పర్యవేక్షించారు. మొదటి రోజులో భాగంగా వీఆర్‌ఓలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్ల బదిలీల ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వ ఉత్తర్వులు 57, 58 ప్రకారం ఒకే కార్యాలయంలో మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు, మూడేళ్ల కాకపోయినా ప్రత్యేక కారణాలతో బదిలీ కోరుకునే ఉద్యోగులు ఆధారాలను జతచేసి బదిలీ కోరుతూ జిల్లా అధికారులకు ఆప్షన్లు ఇచ్చారు.
ఈ ఆప్షన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో సంక్షేమశాఖలు, ప్రణాళికశాఖకు చెందిన ఉద్యోగులు పెన్నార్ భవన్, పంచాయితీరాజ్ శాఖ ఉద్యోగులు జిల్లా పరిషత్ హాల్‌లో గ్రామీణాభివృద్ధి, అటవీ, సమాచార పౌరసంబంధాల శాఖ, పరిశ్రమలు, శాఖలకు చెందిన ఉద్యోగులు డ్వామా హాల్‌లో, వ్యవసాయశాఖ దాని అనుబంధ శాఖల ఉద్యోగులు, వ్యవసాయశాఖ జెడీ కార్యాలయంలో, రెజఠన్యూ మిగిలిన ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు రెవిన్యూ భవన్‌లో తమ ఆప్షన్లకు సంబంధిత అధికారులకు సమర్పించారు. జిల్లా అధికారుల తో ఉద్యోగుల ఆప్షన్ వివరాలను శుక్రవారం పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు.
జెడ్పీలో బదిలీల కోలాహలం
అనంతపురం సెంట్రల్ : జిల్లా పరిషత్, జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగుల బదిలీలు గురువారం జెడ్పీ మీటింగ్ హాలులో నిర్వహించారు. మొత్తం 630 మంది ఉద్యోగులు బదిలీల కోసం ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు జెడ్పీ సీఈఓ రామచంద్ర తెలిపారు. జెడ్పీ మీటింగ్ హాలులో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ కోన శశిధర్, జాయింట్‌కలెక్టర్ లక్ష్మీకాంతం బదిలీల ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామచంద్ర, డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణ, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.
జేడీఏ కార్యాలయంలో
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం గురువారం ఉద్యోగులతో కిటకిటలాడింది. వ్యవసాయశాఖతో పాటు అనుబంధ శాఖలైన ఉద్యాన, పట్టుపరిశ్రమ, పాడి పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్, మత్స్యశాఖలకు సంబంధించి బదిలీ ఆప్షన్ల ప్రక్రియ కార్యక్రమం జేడీఏ కార్యాలయంలోనే వేర్వేరుగా శిబిరాల్లో నిర్వహించారు. ఏఈవో, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్స్, డ్రైవర్లు, అటెం డర్లు, వాచ్‌మెన్లు తదితర కిందిస్థాయి సిబ్బందికి సంబంధించి బదిలీల ఆప్షన్లు తీసుకున్నారు.
వ్యవసాయశాఖలో 76 మంది, పట్టు పరిశ్రమశాఖలో 177 మంది, ఉద్యానశాఖలో ఇద్దరు, మార్కెటింగ్‌శాఖలో 18 మంది, పాడి, పశుసంవర్ధకశాఖలో 112 మంది నుంచి ఐదు ఆప్షన్లు తీసుకున్నారు. జేడీఏ పీవీ శ్రీరామమూర్తి, జేడీఎస్ అరుణకుమారి, జేడీఏహెచ్ డాక్టర్ వి.శ్యాంమోహన్‌రావు, డీడీ డాక్టర్ కె.జయకుమార్, డీడీహెచ్ బీఎస్ సుబ్బరాయుడు, ఏడీహెచ్ సీహెచ్ శివసత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.