బదిలీల జాతర
* 21 మంది తహసిల్దార్లకు స్థానచలనం
* 183 మంది వీఆర్‌ఓలకూ
ఏలూరు (టూ టౌన్) : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో బుధవారం కలెక్టరు కార్యాలయంలో డీఆర్‌ఓ కె.ప్రభాకరరావు తహసిల్దార్లకు, వీఆర్‌ఓలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలోని 46 మండలాల వీఆర్‌ఓలు, తహసిల్దార్లతో కలెక్టరేట్‌లోని సమావేశ హాలు కిక్కిరిసిపోయింది. 21 మంది తహసిల్దార్లను, 12 మంది డిప్యూటీ తహసిల్దార్లను బదిలీ చేశారు. 183 మంది వీఆర్‌ఓలను బదిలీ చేస్తూ డీఆర్‌ఓ ఆదేశాలు జారీచేశారు.
15 మంది ఆఫీసు సబార్డినేట్లను జూనియర్ అసిస్టెంట్లగాను, 15 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లగాను పదోన్నతులు కల్పించారు. ఎంపీడీఓల బదిలీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు నేతృత్వంలో జరగాల్సి ఉండగా ఆయన హైదరాబాదులో ఉండడంతో 15వ తేదీన జరుగుతాయని భావిస్తున్నారు. ఈఓఆర్‌డీలకు, పంచాయతీ కార్యదర్శులకు డీపీఓ ఆధ్వర్యంలో బదిలీలు జరగనున్నాయి.
అధికారుల కసరత్తులు
మినీస్టీరియల్ ఉద్యోగులతో పాటు సబార్డినేట్ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన జీవో నెంబరు 709 ప్రకారం బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసిన ఉద్యోగులందరినీ బదిలీ చేయాల్సి ఉండగా మూడేళ్లు దాటిన వారిలో 20 శాతం మించకుండా బదిలీలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎంపీడీఓలకు సంబంధించి వారు సొంత మండల పరిధిలో ఉన్న డివిజన్లల్లో కాకుండా ఇతర డివిజన్లల్లోనూ, గతంలో ఒకసారి పని చేసిన మండలంలో మరోసారి పనిచేయకుండా బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. డీఆర్‌డీఏలో పనిచేసే పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఇప్పటికే సెర్ప్ సీఈఓ ఆదేశాలు జారీచేశారు.
డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డితో పాటు డీఆర్‌డీఏ పీడీ పులి శ్రీనివాసులు రెండు నెలల క్రితం సెలవులో వెళ్లి ఇంతవరకు జాయిన్ కాలేదు. ఆయన జిల్లా నుంచి బదిలీపై వేరే చోటకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. జిల్లా నుంచి బదిలీ అయిన అధికారుల స్థానంలో జడ్పీ సీఈఓ ఇంతవరకు జాయిన్ కాలేదు. డీపీఓ శ్రీధర్‌రెడ్డి మాత్రం జాయిన్ అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఈఓఆర్‌డీలకు, కార్యదర్శులకు బదిలీలు జరగనున్నాయి.
పంచాయతీ కార్యదర్శుల బదిలీలపై కోర్టు స్టే ?
మరో రెండు రోజుల్లో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరగాల్సి ఉండగా యూనియన్ నాయకులు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చినట్టు సమాచారం.
బదిలీ అయిన తహసిల్దార్లు
జిల్లాలో 21 మంది తహసిల్దార్ల బదిలీ వివరాలు డీఆర్‌ఓ కె.ప్రభాకరరావు తెలిపారు. ద్వారకాతిరుమల తహసిల్దార్ సీహెచ్‌విఎస్‌ఆర్‌ఎల్ ప్రసాద్‌ను మొగల్తూరుకు, జీలుగుమిల్లి తహసిల్దార్ పి.శ్రీనివాస్‌ను తాళ్లపూడికి, కలెక్టరేట్‌లో ఫార్మర్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జీవి సుబ్బారావును ఏఓ ఎల్‌ఆర్‌గా, పెనుగొండ తహసిల్దార్‌గా పనిచేస్తున్న ఎన్.నాగరాజును టి.నర్సాపురం తహసిల్దార్‌గా బదిలీ చేశారు. కలెక్టరేట్‌లో ఏఓగా పనిచేస్తున్న డీఏ నరిసింహరాజును కామవరకోట తహసిల్దారుగా బదిలీ చేశారు.
కామవరపుకోట తహ సిల్దార్ కె.అద్దయ్యను కొయ్యలగూడెంకు, బుట్టాయిగూడెం తహసిల్దారు ఎం.గంగరాజును కొవ్వూరుకు, మొగల్తూరు తహసిల్దార్ వీఎస్‌ఎస్ బ్రహ్మానందాన్ని పెనుగొండకు బదిలీ చేశారు. తాళ్ళపూడి తహసిల్దార్ ఏ.సుధాకర్‌ను నిడమర్రుకు, అత్తిలి తహసిల్దారు ఎ.శ్రీనివాస్‌ను వేలేరుపాడు, కొవ్వూరు తహసిల్దార్ జి.కనకరాజును అత్తిలి, కుక్కునూరు తహసిల్దారుగా పనిచేస్తున్న బి.సుమతిని డ్వామా ఏపీడీగాను, వేలేరుపాడు తహసిల్దారుగా పనిచేస్తున్న ఎండీ అసీఫాను బుట్టాయిగూడెం, ఏలూరు తహసిల్దారు జీవి సుబ్బారావును కలెక్టరేట్‌లో ఏఓగా బదిలీ చేశారు.
ఏలూరు ఏఓ ఎల్‌ఆర్‌గా పనిచేస్తున్న జి.సాంబశివరావును జీలుగుమిల్లి తహసిల్దార్‌గా, తూర్పుగోదావరి జిల్లాలో తహసిల్దారుగా పనిచేస్తున్న బి.నాగరాజు నాయక్‌ను కుక్కునూరు, నిడమర్రు తహసిల్దారు ఎం.ఇందిరాగాంధీని పెదవేగి తహశీల్దార్‌గా బదిలీ చేశారు. టి.నర్సాపురం తహసిల్దారుగా పనిచేస్తున్న ఎల్.దేవికాదేవిని ద్వారకాతిరుమల, పెదవేగి తహసిల్దారుగా పనిచేస్తున్న బి.సోమశేఖరరావును ఏలూరు ఆర్ డీఓ ఆఫీసు డీఏఓగా, కొయ్యలగూడెం తహసిల్దారుగా పనిచేస్తున్న ఎం.ముక్కంఠని పోలవరం, ఏలూరు ఆర్‌డీఓ ఆఫీసులో డీఏఓగా పనిచేస్తున్న బీఎస్ రామాంజనేయులును ఏలూరు తహసిల్దార్‌గా బదిలీ చేస్తూ డీఆర్‌ఓ కె.ప్రభాకరరావు ఆదేశాలు జారీచేశారు.