
తహసీల్దార్ చాంబర్‌లో కనకమ్మను నిలువరిస్తున్న మహిళా ఉద్యోగులు
కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఓ మహిళ హల్‌చల్ చేసింది. తన భర్త పేరిట ఉన్న భూమిని అతని సోదరులపై అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ వీఆర్వో కాలర్ పట్టుకుంది. మండలంలోని నమిలికొండలో కనకమ్మ భర్త లింగాల లచ్చయ్య, అతని సోదరులిద్దరికి 8 గుంటల చొప్పున భూమి ఉంది. కనకమ్మ భర్త చనిపోవడంతో కొన్నాళ్లుగా తల్లి ఊరైన మంగపేటలో ఉంటోంది.
కనకమ్మ స్థానికంగా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఆమె బావ, మరిది కుమారులు కనకమ్మకు సంబంధించిన 8 గుంటల భూమిని వారి పేరిట మార్చుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేదు. ఇదే విషయమై వీర్వోను ప్రశ్నిస్తూ కాలర్ పట్టుకుంది. వీఆర్వో రమేశ్ మాట్లాడుతూ కనకమ్మ తనను గతంలో ఒకసారి కలిసిందన్నారు. మళ్లీ సోమవారం రాగా.. ఫోన్‌లో ఆమె మరిది నుంచి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుండగా దాడి చేసిందని పేర్కొన్నారు.