సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని సడలించి బుధవారం నుంచి ఈ నెల 17వతేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలు, ఉద్యోగుల అభ్యర్థనల మేరకు బదిలీలు చేయనున్నారు.
ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఆదాయ ఆర్జన శాఖల్లోనూ జూన్ 17వ తేదీలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉన్నత విద్య, వైద్య ఆరోగ్య శాఖల్లో బదిలీలు ఉండవని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో ఇటీవలే వర్క్ టు ఆర్డర్‌తో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నెల 18వ తేదీ నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బదిలీ మార్గదర్శకాలు ఇలా..
► ఐదేళ్లుగా ఒకే చోట అంటే నగరం, పట్టణం, గ్రామంలో పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేస్తారు.
► 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యమున్న ఉద్యోగులు సమర్పించే ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ప్రాధాన్యం.
► మానసిక స్థితి సరిగా లేని పిల్లలున్న ఉద్యోగులను సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయాలి.
► వ్యాధులతో చికిత్స పొందుతున్న తల్లిదండ్రులు/జీవిత భాగస్వామి/పిల్లలున్న ఉద్యోగులను క్యాన్సర్, గుండె ఆపరేషన్, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటి సౌకర్యాలు కలిగిన ప్రాంతాలకు బదిలీ చేయాలి.
► కారుణ్య నియామకాల్లో నియమితులైన వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలి.
► భార్య లేదా భర్తలో ఒకరిని మాత్రమే బదిలీ చేయాలి.
► నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఖాళీలు, పోస్టుల భర్తీకి బదిలీల్లో ముందు ప్రాధాన్యం ఇవ్వాలి.
► ఐటీడీఏ ప్రాంతాల్లో 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఉద్యోగులనే నియమించాలి.
► ఐటీడీఏ ప్రాంతాల పరిధిలో గతంలో పనిచేయని ఉద్యోగులను నియమించాలి.
► ఐటీడీఏ పరిధిలోని మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీ పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేసేందుకు సంబంధిత శాఖలు, జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలి.
► అన్ని బదిలీలను ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం అధికారులు అమలు చేయాలి.
► బదిలీల విషయంలో ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా సంబంధిత శాఖాధిపతులు ప్రక్రియను అమలు చేయాలి. నిబంధనలు, మార్గదర్శకాలకు వ్యతిరేకంగా బదిలీలుంటే తీవ్రంగా పరిగణిస్తారు.
► ఆదాయ ఆర్జన శాఖల్లోని ఉద్యోగుల బదిలీలను కూడా ఈ నెల 17వతేదీలోగా పూర్తి చేయాలి. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రవాణా, వ్యవసాయ శాఖలు విడిగా మార్గదర్శకాలను రూపొందించి ఉద్యోగుల బదిలీలను ఈ నెల 17వ తేదీలోగా పూర్తి చేయాలి.
► ఇటీవలే బదిలీలకు అనుమతించినందున ఉన్నత విద్య (కాలేజీ ఎడ్యుకేషన్ ), స్కిల్ డెవలప్‌మెంట్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఉద్యోగులకు ఇప్పుడు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌కు మాత్రం బదిలీలకు అవకాశం కల్పించారు.
► దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలి. అలాంటి ఉద్యోగులు బదిలీ కోరితే, అక్కడ స్పష్టమైన ఖాళీ ఉంటే బదిలీ చేయాలి.
► ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీలకు అనుమతించరాదు.
బదిలీల ప్రక్రియ షురూ
Published Wed, Jun 8 2022 4:12 AM | Last Updated on Wed, Jun 8 2022 10:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment