Transfers of government employees
-
బదిలీల ప్రక్రియ షురూ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని సడలించి బుధవారం నుంచి ఈ నెల 17వతేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలు, ఉద్యోగుల అభ్యర్థనల మేరకు బదిలీలు చేయనున్నారు. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఆదాయ ఆర్జన శాఖల్లోనూ జూన్ 17వ తేదీలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉన్నత విద్య, వైద్య ఆరోగ్య శాఖల్లో బదిలీలు ఉండవని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో ఇటీవలే వర్క్ టు ఆర్డర్‌తో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నెల 18వ తేదీ నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ మార్గదర్శకాలు ఇలా.. ► ఐదేళ్లుగా ఒకే చోట అంటే నగరం, పట్టణం, గ్రామంలో పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేస్తారు. ► 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యమున్న ఉద్యోగులు సమర్పించే ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ప్రాధాన్యం. ► మానసిక స్థితి సరిగా లేని పిల్లలున్న ఉద్యోగులను సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయాలి. ► వ్యాధులతో చికిత్స పొందుతున్న తల్లిదండ్రులు/జీవిత భాగస్వామి/పిల్లలున్న ఉద్యోగులను క్యాన్సర్, గుండె ఆపరేషన్, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటి సౌకర్యాలు కలిగిన ప్రాంతాలకు బదిలీ చేయాలి. ► కారుణ్య నియామకాల్లో నియమితులైన వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. ► భార్య లేదా భర్తలో ఒకరిని మాత్రమే బదిలీ చేయాలి. ► నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఖాళీలు, పోస్టుల భర్తీకి బదిలీల్లో ముందు ప్రాధాన్యం ఇవ్వాలి. ► ఐటీడీఏ ప్రాంతాల్లో 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఉద్యోగులనే నియమించాలి. ► ఐటీడీఏ ప్రాంతాల పరిధిలో గతంలో పనిచేయని ఉద్యోగులను నియమించాలి. ► ఐటీడీఏ పరిధిలోని మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీ పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేసేందుకు సంబంధిత శాఖలు, జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలి. ► అన్ని బదిలీలను ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం అధికారులు అమలు చేయాలి. ► బదిలీల విషయంలో ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా సంబంధిత శాఖాధిపతులు ప్రక్రియను అమలు చేయాలి. నిబంధనలు, మార్గదర్శకాలకు వ్యతిరేకంగా బదిలీలుంటే తీవ్రంగా పరిగణిస్తారు. ► ఆదాయ ఆర్జన శాఖల్లోని ఉద్యోగుల బదిలీలను కూడా ఈ నెల 17వతేదీలోగా పూర్తి చేయాలి. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రవాణా, వ్యవసాయ శాఖలు విడిగా మార్గదర్శకాలను రూపొందించి ఉద్యోగుల బదిలీలను ఈ నెల 17వ తేదీలోగా పూర్తి చేయాలి. ► ఇటీవలే బదిలీలకు అనుమతించినందున ఉన్నత విద్య (కాలేజీ ఎడ్యుకేషన్ ), స్కిల్ డెవలప్మెంట్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఉద్యోగులకు ఇప్పుడు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌కు మాత్రం బదిలీలకు అవకాశం కల్పించారు. ► దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలి. అలాంటి ఉద్యోగులు బదిలీ కోరితే, అక్కడ స్పష్టమైన ఖాళీ ఉంటే బదిలీ చేయాలి. ► ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీలకు అనుమతించరాదు. -
దూమారం రేపుతున్న ఉద్యోగుల స్థానచలనం
► పనితీరుకు పాతర ► రెవెన్యూలో కొనసాగుతున్న కసరత్తు ► కీలక మండలాల తహసీల్దార్ పోస్టింగ్‌ల కోసం ప్రజాప్రతినిధుల పట్టు ► వాణిజ్య, రవాణా శాఖ బదిలీల్లో ఎన్జీవో రాష్ట్ర నేత జోక్యం ► కావాల్సిన 10 మందికి కీలక ఏసీటీవో పోస్టింగ్‌లు ► జిల్లా పరిషత్‌లో 163 మంది ఉద్యోగులకు బదిలీలు ► మాట వినని అటవీశాఖ అధికారులకు స్థానచలనం ► చక్రం తిప్పుతున్న అమాత్యులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సాక్షి, విజయవాడ : గుంటూరు, కృష్ణాజిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారు. నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసే అధికారులను పక్కన పెట్టి, తమకు కావాల్సిన, తమ సామాజికవర్గం వారు, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఏజెంట్లా పనిచేసే అధికారులకు పెద్దపీట వేస్తున్నారు. బాగా ముట్టజెప్పడాన్ని అదనపు అర్హతగా నిర్ణయించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అమాత్యులు బదిలీల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, జిల్లా పరిషత్, వాణిజ్యపన్నులు, రవాణా, నీటి పారుదల శాఖల్లో బదిలీలపై పూర్తి దృష్టి కేంద్రీకరించి జేబులు నింపుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో సాధారణ బదిలీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి జిల్లా అధికారి వరకు బదిలీలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈనెల 20వ తేదీ నాటికి బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారిని బదిలీ చేయాల్సి ఉంది. మూడేళ్లు పనిచేసిన వారిని రిక్వెస్ట్ బదిలీ చేయొచ్చు. జిల్లాలో దీనికి భిన్నంగా బదిలీల పర్వం సాగుతోంది. కావాల్సి ఉద్యోగి అయితే ఒకేచోట ఏడేళ్లకు పైగా పనిచేస్తున్నా పట్టించుకోవడంలేదు. జిల్లాలో కీలకమైన తహసీల్దార్ల బదిలీల వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కృష్ణాజిల్లాలో 15 మందికిపైగా తహసీల్దార్లకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. కొందరు అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తమకు అనుకూలురైన తహసీల్లార్లకు పోస్టింగ్ ఇప్పించే పైరవీల్లో నిమగ్నమయ్యారు. మచిలీపట్నంలో కలెక్టరేట్లో బదిలీల ప్రహసనం సాగుతూనే ఉంది. రాజకీయ ఒత్తిళ్లు, పైరవీలు ఎక్కువగా ఉండటంతో ఉన్నతాధికారులు తేల్చులేకపోతున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే.. కైకలూరు నియోజకవర్గంలో మాట వినని అధికారులను మంత్రి కామినేని శ్రీనివాసరావు, అధికార పార్టీ నేతలు పట్టుబట్టి మరీ బదిలీచేయించారు. కైకలూరు, మండవల్లి పరిధిలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. ఇక్కడ చేపల సాగు నిషిద్ధం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలు, మంత్రి కామినేని అనుచరులు అక్రమంగా చేపల సాగు చేపట్టారు. దీనిని అడ్డుకున్న అటవీశాఖ రేంజర్ సునీల్‌కుమార్, తెలంగాణ కేడర్‌కు చెందిన వి.వి.ఎల్.సుభద్రాదేవిని కొద్ది నెలలకే బదిలీ చేశారు. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఇటీవల జరిగిన బదిలీల్లో మంత్రి, చైర్పర్సన్ తమకు ఇష్టం లేని ఉద్యోగులను అక్కడి నుంచి సాగనంపారు. జూనియర్ అసిస్టెంట్లు ఏడుగురు, సీనియర్ అసిస్టెంట్ ఒకరు, బిల్ కలెక్టర్లు ఐదుగురు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఒకరిని బదిలీ చేయించారు. రాష్ట్ర ఎన్జీవో నేత జోక్యం కృష్ణాజిల్లాలోని వాణిజ్య పన్నులు, రవాణా శాఖల ఉద్యోగుల బదిలీల్లో రాష్ట్ర ఎన్జీవో సంఘ కీలక నేత చక్రం తిప్పారు. విజయవాడ పరిధిలో పనిచేస్తున్న 10 మంది ఏసీటీవోలను బదిలీలు చేయించడం వెనుక ఆ నేత పరపతితో పాటు భారీగా నగదు చేతులు మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు కావాల్సిన వారిని కీలక ప్రాంతాల్లో, అధిక ఆదాయం ఉండే చోట ఏసీటీవోలుగా నియమించారు. మూడేళ్ల సర్వీసు పూర్తికానివారిని కూడా బదిలీ చేయించారు. ఇదే క్రమంలో పరపతి ఉన్న అధికారుల జోలికి వెళ్లలేదు. సదరు ఎన్జీవో నేతతో సన్నిహితంగా ఉంటూ ఇటీవల తన నివాసంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుతో ఏసీబీ సోదాలు ఎదుర్కొన్న అధికారి, మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఇద్దరు జిల్లా స్థాయి అధికారుల బదిలీల్లో చక్రం తిప్పారు. పరపతి లేకపోవడంతో ఏడాది కాలం పూర్తి కాని గుంటూరు, ఏలూరు అధికారులను బదిలీ చేశారు. సదరు నేత రవాణా శాఖ బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారు. తమ యూనియన్ కార్యకలాపాల్లో ఉండే ఒక ఉద్యోగికి తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ జరిగింది. ఆ ఉద్యోగి బదిలీని నిలిపివేసే ప్రయత్నాల్లో ఎన్జీవో నేత ఉన్నారని సమాచారం. గుంటూరు జిల్లాలో అడ్డగోలు రాజకీయ బదిలీలు గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అడ్డగోలుగా సాగుతోంది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగుల బదిలీ విషయంలో కూడా ప్రజాప్రతినిధులు, అమాత్యులు జోక్యం చేసుకోవడం గందరగోళానికి దారితీస్తోంది.20వ తేదీ కల్లా బదిలీల ప్రకియ పూర్తి కావాల్సి ఉన్నా సిఫార్సులు, నగదు పైరవీలు అధికంగా ఉండడంతో ఇంకా ప్రహసనంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జిల్లా పరిషత్, పంచాయతీ రాజ్, ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీలు మాత్రమే ఇప్పటి వరకు పూర్తి అయ్యాయి. జిల్లాలో చక్రం తిప్పే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు అన్ని శాఖల బదిలీల్లో విపరీతంగా జోక్యం చేసుకుంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ శాఖ వ్యవహారాలు, బదిలీలు అన్నీ అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చూస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల వ్యవహారాలను మరో సీనియర్ ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జరిగిన సాధారణ బదిలీల్లో వారిద్దరు పూర్తిస్థాయిలో చక్రం తిప్పారు. ఇక జిల్లాలో కీలకంగా ఉన్న ఓ మంత్రి అన్ని శాఖల బదిలీల్లో తన మాట చెల్లుబాటుకు అధికప్రాధాన్యం దక్కేలా జిల్లా స్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. బదిలీకి నిర్ణయించిన కాలపరిమితి, సీనియారిటీతో సంబంధం లేకుండా తమకు కావాల్సిన అధికారులు ఇక్కడే కొన్నేళ్ళ కొనసాగేలా చేశారు. ముఖ్యంగా జిల్లా పరిషత్‌లో సుమారు 152 మంది ఉద్యోగుల బదిలీలు జరిగాయి. వీటిలో 50 శాతం వరకు నిబంధలకు విరుద్ధంగానే చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, యూనియన్ నేతల జోక్యం అధికంగా ఉంది. అలాగే పంచాయతీరాజ్ విభాగంలో, ఆర్డబ్ల్యూఎస్, ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లో డబ్బు ప్రాధాన్యంతో బదిలీలు జరిగాయి. ముఖ్యంగా ఏఈ స్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారి వరకు బదిలీల్లో సామాజిక వర్గంతో పాటు డబ్బు, రాజకీయ సిఫార్సులు బాగా నడిచాయి. రెవెన్యూ శాఖలో 20 మంది వరకు తహశీల్దార్లకు స్థాన చలనం ఉంటుందని ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెవెన్యూ బదిలీలు అలస్యం అయినట్లు సమాచారం. -
ఉత్కంఠ
రెవెన్యూలో బదిలీ ప్రక్రియ మొదలు ఎక్కువకాలం ఒకేచోట పనిచేసిన వారిలో టెన్షన్ బదిలీలకు అందిన దరఖాస్తులు 370పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు ఫిర్యాదులున్నవారికి స్థానచలనం చిత్తూరు: జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమక్షంలో రాత్రి 9 గంటలకు ఈప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కౌన్సెలింగ్‌లో కలెక్టర్‌తో పాటు జేసీ నారాయణభరత్‌గుప్త, మదనపల్లె, తిరుపతి సబ్ కలెక్టర్లు కృతికాబాత్రా, హిమామ్ శుక్లా, డీఆర్వో విజయచందర్‌లు పాల్గొన్నారు. దీర్ఘకాలంగా తమ స్థానాల్లో అంటిపెట్టుకుని వారికి కదలిక తప్పదని భోగట్టా. ఎక్కువ మంది పీఠాలు కదలనున్నాయని తెలిసింది. ఉద్యోగులంతా బదిలీలపై ఉత్కంఠగా ఉన్నారు. కౌన్సెలింగ్ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేస్తున్నామన్నారు. ఈ బదిలీ కౌన్సెలింగ్‌కు ఐదేళ్ళు సర్వీసు దాటిన వారి పేర్లను కూడా పరిశీలించి బదిలీ చేపట్టడం ఖాయమన్నారు. మూడేళ్లు దాటిన సిబ్బందిని కూడా జీఓ ప్రకారం బదిలీ చేస్తామన్నారు. మూడేళ్ల లోపు సర్వీసు ఉన్న సిబ్బంది అభ్యర్థన బదిలీని అవసరాన్ని బట్టి పరిశీలిస్తామన్నారు. పలు మండలాల్లో ఫిర్యాదులున్న సిబ్బందిని పనితీరును బట్టి బదిలీ చేస్తామన్నారు. బదిలీ అవుతున్న వారు వీరే జిల్లాలో 370 మంది ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒకే ప్రాంతంలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు 51 మంది, మూడేళ్లు పూర్తి చేసుకున్న 150 మంది ఉన్నారు. అభ్యర్థన బదిలీ కోరిన వారు 169 మంది ఉన్నారు. మూడేళ్లు పూర్తి చేసుకున్న తహశీల్దార్ ఒకరు, ఐదేళ్ళు పూర్తి చేసుకున్న తహశీల్దార్ ఒకరు, మూడేళ్లు పూర్తి చేసుకున్న వీఆర్వోలు 72 మంది, ఐదేళ్లు పూర్తి చేసుకున్న వీఆర్వోలు 10 మంది, మూడేళ్లు పూర్తిచేసుకున్న జూనియర్ అసిస్టెంట్లు 15 మంది, ఐదేళ్లు పూర్తి చేసుకున్న జూనియర్ అసిస్టెంట్లు 06 మంది ఉన్నారు. మూడేళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్లు 34 మంది, ఐదేళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్లు 06 మంది, మూడేళ్లు పూర్తి చేసుకున్న డీటీలు 26 మంది, ఐదేళ్లు పూర్తి చేసుకున్న డీటీలు 26 మంది మూడేళ్లు పూర్తి చేసుకున్న టైపిస్టులు ఇద్దరు, ఐదేళ్లు పూర్తి చేసుకున్న టైపిస్టులు ఇద్దరు ఉన్నారు. అభ్యర్థన బదిలీ కోసం మొత్తం 169 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వీరుగాక బదిలీ కోసం దరఖాస్తు చేసుకోకున్నా, ఫిర్యాదులున్న సిబ్బందిని బదిలీ చేసే అవకాశముంది. శుక్రవారం రాత్రి బదిలీ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. లేనిపక్షంలో శనివారం సాయంత్రానికి పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. -
ప్రహసనంగా మారిన ఉద్యోగుల బదిలీలు
మంత్రులు, పైరవీ కారుల అవసరాల కోసమే మార్పులు హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఎవరి అవసరం ఆధారంగానో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15వ తేదీ వరకు జన్మభూమి కార్యక్రమానికి ఎటువంటి అవరోధం లేకుండా అవసరం ఆధారంగా (నీడ్ బేస్డ్) బదిలీలకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఈ నెల 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనపరమైన లేదా ఆయా ఉద్యోగుల భార్య-భర్తల కేసుల్లోను, లేదా వైద్య సమస్యల కేసుల్లోను అనేది అవసరం ఆధారంగా బదిలీలు అనేది వర్తిస్తుందనేది ప్రభుత్వ అభిప్రాయం. ఇప్పుడు మాత్రం మంత్రులు, పైరవీ కారుల అవసరం కోసంగా బదిలీలు మారిపోయాయని ఉద్యోగ వర్గాలే కోడై కూస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులకు, కొంతమంది ఎమ్మెల్యేలకు ఆదాయ వనరుగా బదిలీల ప్రహసనం మారిందని ఉద్యోగ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల మినహాయించి జిల్లా, జోనల్ స్థాయి కేడర్ పోస్టుల బదిలీలకు అనుమతించారు. ఈ నెల 15వ తేదీతో బదిలీలకు గడువు ముగుస్తుండటంతో ప్రస్తుతం మంత్రుల కార్యాలయాలు, నివాసాల్లో అంతా ఈ తతంగమే సాగుతోంది. సంబంధిత శాఖనుంచి ప్రతిపాదనలు రాకుండానే మంత్రుల పేషీల్లో సిబ్బందే బదిలీలకు సంబంధించిన ఉద్యోగుల పేర్లతో జాబితాలను తయారు చేస్తున్నారు. ఎవరు ఎక్కువ ముట్టచెబితే వారికి కావాల్సిన చోటకు బదిలీలు చేయనున్నారు. దీంతో ఏడాది క్రితం బదిలీ అయ్యి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా స్థానచలనం కలుగుతోంది. దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారినే బదిలీ చేస్తారు. ఈ ప్రహసనంలో ఉపాధ్యాయులు కూడా ఉంటున్నారు. నవంబర్ నెలలో టీచర్లను బదిలీలు చేయడం అంటే విద్యార్థులకు చదువు ఇక ఎలాగ ఉంటుందో ఆలోచించవచ్చునని ఉద్యోగ వర్గాలే పేర్కొంటున్నాయి.