రెవెన్యూలో బదిలీ ప్రక్రియ మొదలు
ఎక్కువకాలం ఒకేచోట పనిచేసిన వారిలో టెన్షన్
బదిలీలకు అందిన దరఖాస్తులు 370పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు
ఫిర్యాదులున్నవారికి స్థానచలనం
చిత్తూరు: జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమక్షంలో రాత్రి 9 గంటలకు ఈప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కౌన్సెలింగ్‌లో కలెక్టర్‌తో పాటు జేసీ నారాయణభరత్‌గుప్త, మదనపల్లె, తిరుపతి సబ్ కలెక్టర్లు కృతికాబాత్రా, హిమామ్ శుక్లా, డీఆర్వో విజయచందర్‌లు పాల్గొన్నారు. దీర్ఘకాలంగా తమ స్థానాల్లో అంటిపెట్టుకుని వారికి కదలిక తప్పదని భోగట్టా. ఎక్కువ మంది పీఠాలు కదలనున్నాయని తెలిసింది. ఉద్యోగులంతా బదిలీలపై ఉత్కంఠగా ఉన్నారు. కౌన్సెలింగ్ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేస్తున్నామన్నారు. ఈ బదిలీ కౌన్సెలింగ్‌కు ఐదేళ్ళు సర్వీసు దాటిన వారి పేర్లను కూడా పరిశీలించి బదిలీ చేపట్టడం ఖాయమన్నారు. మూడేళ్లు దాటిన సిబ్బందిని కూడా జీఓ ప్రకారం బదిలీ చేస్తామన్నారు. మూడేళ్ల లోపు సర్వీసు ఉన్న సిబ్బంది అభ్యర్థన బదిలీని అవసరాన్ని బట్టి పరిశీలిస్తామన్నారు. పలు మండలాల్లో ఫిర్యాదులున్న సిబ్బందిని పనితీరును బట్టి బదిలీ చేస్తామన్నారు.
బదిలీ అవుతున్న వారు వీరే
జిల్లాలో 370 మంది ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒకే ప్రాంతంలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు 51 మంది, మూడేళ్లు పూర్తి చేసుకున్న 150 మంది ఉన్నారు. అభ్యర్థన బదిలీ కోరిన వారు 169 మంది ఉన్నారు. మూడేళ్లు పూర్తి చేసుకున్న తహశీల్దార్ ఒకరు, ఐదేళ్ళు పూర్తి చేసుకున్న తహశీల్దార్ ఒకరు, మూడేళ్లు పూర్తి చేసుకున్న వీఆర్వోలు 72 మంది, ఐదేళ్లు పూర్తి చేసుకున్న వీఆర్వోలు 10 మంది, మూడేళ్లు పూర్తిచేసుకున్న జూనియర్ అసిస్టెంట్లు 15 మంది, ఐదేళ్లు పూర్తి చేసుకున్న జూనియర్ అసిస్టెంట్లు 06 మంది ఉన్నారు. మూడేళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్లు 34 మంది, ఐదేళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్లు 06 మంది, మూడేళ్లు పూర్తి చేసుకున్న డీటీలు 26 మంది, ఐదేళ్లు పూర్తి చేసుకున్న డీటీలు 26 మంది మూడేళ్లు పూర్తి చేసుకున్న టైపిస్టులు ఇద్దరు, ఐదేళ్లు పూర్తి చేసుకున్న టైపిస్టులు ఇద్దరు ఉన్నారు. అభ్యర్థన బదిలీ కోసం మొత్తం 169 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వీరుగాక బదిలీ కోసం దరఖాస్తు చేసుకోకున్నా, ఫిర్యాదులున్న సిబ్బందిని బదిలీ చేసే అవకాశముంది. శుక్రవారం రాత్రి బదిలీ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. లేనిపక్షంలో శనివారం సాయంత్రానికి పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.