దూమారం రేపుతున్న ఉద్యోగుల స్థానచలనం | Trade, transportation, transfer branches NGO of state leader intervention | Sakshi
Sakshi News home page

దూమారం రేపుతున్న ఉద్యోగుల స్థానచలనం

Published Thu, Jun 23 2016 8:00 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

దూమారం రేపుతున్న ఉద్యోగుల స్థానచలనం - Sakshi

దూమారం రేపుతున్న ఉద్యోగుల స్థానచలనం

పనితీరుకు పాతర
రెవెన్యూలో కొనసాగుతున్న కసరత్తు
కీలక మండలాల తహసీల్దార్ పోస్టింగ్‌ల కోసం ప్రజాప్రతినిధుల పట్టు
వాణిజ్య, రవాణా శాఖ బదిలీల్లో ఎన్జీవో రాష్ట్ర నేత జోక్యం
కావాల్సిన 10 మందికి కీలక ఏసీటీవో పోస్టింగ్‌లు
జిల్లా పరిషత్‌లో 163 మంది ఉద్యోగులకు బదిలీలు
మాట వినని అటవీశాఖ అధికారులకు స్థానచలనం
చక్రం తిప్పుతున్న అమాత్యులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు

 
 
సాక్షి, విజయవాడ : గుంటూరు, కృష్ణాజిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారు. నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసే అధికారులను పక్కన పెట్టి, తమకు కావాల్సిన, తమ సామాజికవర్గం వారు, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఏజెంట్‌లా పనిచేసే అధికారులకు పెద్దపీట వేస్తున్నారు. బాగా ముట్టజెప్పడాన్ని అదనపు అర్హతగా నిర్ణయించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అమాత్యులు బదిలీల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, జిల్లా పరిషత్, వాణిజ్యపన్నులు, రవాణా, నీటి పారుదల శాఖల్లో బదిలీలపై పూర్తి దృష్టి కేంద్రీకరించి జేబులు నింపుకునే పనిలో నిమగ్నమయ్యారు.


జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో సాధారణ బదిలీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి జిల్లా అధికారి వరకు బదిలీలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈనెల 20వ తేదీ నాటికి బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారిని బదిలీ చేయాల్సి ఉంది. మూడేళ్లు పనిచేసిన వారిని రిక్వెస్ట్ బదిలీ చేయొచ్చు. జిల్లాలో దీనికి భిన్నంగా బదిలీల పర్వం సాగుతోంది. కావాల్సి ఉద్యోగి అయితే ఒకేచోట ఏడేళ్లకు పైగా పనిచేస్తున్నా పట్టించుకోవడంలేదు. జిల్లాలో కీలకమైన తహసీల్దార్ల బదిలీల వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కృష్ణాజిల్లాలో 15 మందికిపైగా తహసీల్దార్లకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. కొందరు అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తమకు అనుకూలురైన తహసీల్లార్లకు పోస్టింగ్ ఇప్పించే పైరవీల్లో నిమగ్నమయ్యారు. మచిలీపట్నంలో కలెక్టరేట్‌లో బదిలీల ప్రహసనం సాగుతూనే ఉంది. రాజకీయ ఒత్తిళ్లు, పైరవీలు ఎక్కువగా ఉండటంతో ఉన్నతాధికారులు తేల్చులేకపోతున్నారు.


అధికార పార్టీ కనుసన్నల్లోనే..
కైకలూరు నియోజకవర్గంలో మాట వినని అధికారులను మంత్రి కామినేని శ్రీనివాసరావు, అధికార పార్టీ నేతలు పట్టుబట్టి మరీ బదిలీచేయించారు. కైకలూరు, మండవల్లి పరిధిలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. ఇక్కడ చేపల సాగు నిషిద్ధం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలు, మంత్రి కామినేని అనుచరులు అక్రమంగా చేపల సాగు చేపట్టారు. దీనిని అడ్డుకున్న అటవీశాఖ రేంజర్ సునీల్‌కుమార్, తెలంగాణ కేడర్‌కు చెందిన వి.వి.ఎల్.సుభద్రాదేవిని కొద్ది నెలలకే బదిలీ చేశారు. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఇటీవల జరిగిన బదిలీల్లో మంత్రి, చైర్‌పర్సన్ తమకు ఇష్టం లేని ఉద్యోగులను అక్కడి నుంచి సాగనంపారు. జూనియర్ అసిస్టెంట్లు ఏడుగురు, సీనియర్ అసిస్టెంట్ ఒకరు, బిల్ కలెక్టర్లు ఐదుగురు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఒకరిని బదిలీ చేయించారు.

రాష్ట్ర ఎన్జీవో నేత జోక్యం
కృష్ణాజిల్లాలోని వాణిజ్య పన్నులు, రవాణా శాఖల ఉద్యోగుల బదిలీల్లో రాష్ట్ర ఎన్జీవో సంఘ కీలక నేత చక్రం తిప్పారు. విజయవాడ పరిధిలో పనిచేస్తున్న 10 మంది ఏసీటీవోలను బదిలీలు చేయించడం వెనుక ఆ నేత పరపతితో పాటు భారీగా నగదు చేతులు మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు కావాల్సిన వారిని కీలక ప్రాంతాల్లో, అధిక ఆదాయం ఉండే చోట ఏసీటీవోలుగా నియమించారు. మూడేళ్ల సర్వీసు పూర్తికానివారిని కూడా బదిలీ చేయించారు. ఇదే క్రమంలో పరపతి ఉన్న అధికారుల జోలికి వెళ్లలేదు. సదరు ఎన్జీవో నేతతో సన్నిహితంగా ఉంటూ ఇటీవల తన నివాసంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుతో ఏసీబీ సోదాలు ఎదుర్కొన్న అధికారి, మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ఇద్దరు జిల్లా స్థాయి అధికారుల బదిలీల్లో చక్రం తిప్పారు. పరపతి లేకపోవడంతో ఏడాది కాలం పూర్తి కాని గుంటూరు, ఏలూరు అధికారులను బదిలీ చేశారు. సదరు నేత రవాణా శాఖ బదిలీల్లో జోక్యం చేసుకుంటున్నారు. తమ యూనియన్ కార్యకలాపాల్లో ఉండే ఒక ఉద్యోగికి తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ జరిగింది. ఆ ఉద్యోగి బదిలీని నిలిపివేసే ప్రయత్నాల్లో ఎన్జీవో నేత ఉన్నారని సమాచారం.

గుంటూరు జిల్లాలో అడ్డగోలు రాజకీయ బదిలీలు
 
గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అడ్డగోలుగా సాగుతోంది.  జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగుల బదిలీ విషయంలో కూడా ప్రజాప్రతినిధులు, అమాత్యులు జోక్యం చేసుకోవడం గందరగోళానికి దారితీస్తోంది.20వ తేదీ కల్లా బదిలీల ప్రకియ పూర్తి కావాల్సి ఉన్నా సిఫార్సులు, నగదు పైరవీలు అధికంగా ఉండడంతో ఇంకా ప్రహసనంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జిల్లా పరిషత్, పంచాయతీ రాజ్, ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో బదిలీలు మాత్రమే ఇప్పటి వరకు పూర్తి అయ్యాయి. జిల్లాలో చక్రం తిప్పే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు అన్ని శాఖల బదిలీల్లో విపరీతంగా జోక్యం చేసుకుంటున్నారు.

పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ శాఖ వ్యవహారాలు, బదిలీలు అన్నీ అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చూస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల వ్యవహారాలను మరో సీనియర్ ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జరిగిన సాధారణ బదిలీల్లో వారిద్దరు పూర్తిస్థాయిలో చక్రం తిప్పారు. ఇక జిల్లాలో కీలకంగా ఉన్న ఓ మంత్రి అన్ని శాఖల బదిలీల్లో తన మాట చెల్లుబాటుకు అధికప్రాధాన్యం దక్కేలా జిల్లా స్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.  బదిలీకి నిర్ణయించిన కాలపరిమితి, సీనియారిటీతో సంబంధం లేకుండా తమకు కావాల్సిన అధికారులు ఇక్కడే కొన్నేళ్ళ కొనసాగేలా చేశారు. ముఖ్యంగా జిల్లా పరిషత్‌లో సుమారు 152 మంది ఉద్యోగుల బదిలీలు జరిగాయి. వీటిలో 50 శాతం వరకు నిబంధలకు విరుద్ధంగానే చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, యూనియన్ నేతల జోక్యం అధికంగా ఉంది.

అలాగే పంచాయతీరాజ్ విభాగంలో, ఆర్‌డబ్ల్యూఎస్, ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లో డబ్బు ప్రాధాన్యంతో బదిలీలు జరిగాయి. ముఖ్యంగా ఏఈ స్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారి వరకు బదిలీల్లో సామాజిక వర్గంతో పాటు డబ్బు, రాజకీయ సిఫార్సులు బాగా నడిచాయి. రెవెన్యూ శాఖలో 20 మంది వరకు తహశీల్దార్‌లకు స్థాన చలనం ఉంటుందని ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెవెన్యూ బదిలీలు అలస్యం అయినట్లు సమాచారం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement