Pamulapadu
-
వింత వ్యాధితో కోళ్లు, కాకులు మృతి
సాక్షి, కొత్తపల్లె/పాములపాడు (కర్నూలు): కొత్తపల్లె, పాములపాడు మండలాల్లోని పలు ప్రాంతాల్లో వింత వ్యాధితో కోళ్లు, కాకులు చనిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోళ్లు చనిపోయిన తర్వాత ముక్కులోంచి ఒక రకమైన ద్రవం కారడం, కొన్ని కోళ్లకు చర్మంపై బోడిపెలుగా వచ్చి చర్మం రాలిపోవడం వంటివి జరుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు. గురువారం కొత్తపల్లె మండలం సింగరాజుపల్లె గ్రామంలో సంజీవరాయుడుకు చెందిన 50 కోళ్లు మృత్యువాత పడ్డాయి. అదే గ్రామంలో ఐదు కాకులు కూడా మృతి చెందాయి. అలాగే పాములపాడుకు చెందిన నబీరసూల్ అనే రైతు ఇంట్లో నాలుగు, కృష్ణానగర్ గ్రామంలో రామకోటినాయక్ అనే రైతు ఇంట్లో 70 కోళ్లు చనిపోయాయి. చాలా మంది రైతుల ఇళ్లలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ విషయం తమ దృష్టికి రాలేదని పాములపాడు పశువైద్యాధికారి భాస్కర్ తెలిపారు. -
లభించని చిన్నారి ఆచూకీ
సాక్షి, పాములపాడు(కర్నూలు): తండ్రి కర్కశత్వానికి గురైన చిన్నారి తేజప్రియ ఆచూకీ లభించలేదు. ఈ నెల 2న మండలంలోని పెంచికలపల్లి గ్రామానికి చెందిన వానాల వెంకటేశ్వర్లు తన భార్య దేవమ్మ, కూతురు తేజప్రియ(3)లను వెలుగోడు మండలం గుంతకందాల గ్రామ సమీపంలోని నిప్పులవాగులో తోసేసిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న పోలీసులు నిప్పులవాగు వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 4న అబ్దుల్లాపురం పవర్‌ప్లాంట్ వద్ద దేవమ్మ చీర లభ్యమైంది. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గాలింపు చర్యలకు కొంత మేర ఇబ్బంది ఏర్పడింది. ఆత్మకూరు, నందికొట్కూరు సీఐలు శివనారాయణస్వామి, సుబ్రమణ్యం, పాములపాడు, వెలుగోడు, ఆత్మకూరు ఎస్ఐలు రాజ్‌కుమార్, రాజారెడ్డి, ఓబులేసు, నాగేంద్ర ప్రసాద్ తమ సిబ్బందితో మూడు రోజులు విస్తృతంగా నిప్పులవాగు వెంట గాలింపు చర్యలు చేపట్టడంతో గురువారం దేవమ్మ మృతదేహం లభ్యమైంది. అక్కడే పంచనామా నిర్వహించి శుక్రవారం పెంచికలపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా చిన్నారి తేజప్రియ ఆచూకీ తెలియలేదు. మూడేళ్ల చిన్నారి కావడంతో ప్రవాహం వేగంగా ఉండటం వల్ల దిగువకు వెళ్లి ఉండవచ్చునని పలువురు పేర్కొంటున్నారు. ఇది చదవండి : రెండో పెళ్లికి అడ్డువస్తున్నారని; భార్య, కూతురిని.. -
రెండో పెళ్లికి భార్య, కూతురు అడ్డుగా ఉన్నారని..
-
రెండో పెళ్లికి అడ్డువస్తున్నారని; భార్య, కూతురిని..
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాములపాడు మండంలం పెంచికలపల్లె గ్రామంలో నివసిస్తున్న వాడాలా వెంకటేశ్వర్లకు భార్య దేవమ్మ(28) మూడేళ్ల కూతురు ఉన్నారు. కాగా ఇటీవల రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వర్లు దానికి భార్య, కూతురు అడ్డుగా ఉన్నారని భావించి సమీపంలో ఉన్న నిప్పుల వాగులోకి తోసేశాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
టీవీ పడి చిన్నారి మృతి
కర్నూలు, పాములపాడు: టీవీ మీద పడడంతోఓ చిన్నారి మృతిచెందింది. ఈవిషాదకర ఘటన మంగళవారం పాములపాడులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పాములపాడుకు చెందిన టైలర్ లింగారెడ్డి, అంజలి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చిన్నమ్మాయి వెంకటసింధుకు ఏడాదిన్నర వయసు. మంగళవారం ఇంట్లో ఆడుకుంటూ టీవీ తీగలు పట్టుకొని లాగింది. స్టాండ్‌కు ఉన్న చక్రాలు ముందుకు కదలడంతోచిన్నారి తలపై టీవీ పడింది. ఆ శబ్దం విన్న తల్లి అంజలి పరుగున వచ్చి టీవీ పక్కకు తీసేసి.. పాపను చేతుల్లోకి తీసుకుంది. ఎలాంటి రక్తస్రావం కాలేదు. అయితే.. తలకు వెనుక భాగంలో వాపు వచ్చింది. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ ఆత్మకూరుకు పంపించారు. అక్కడికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నిత్యం కళ్లముందు వచ్చీరాని మాటలు, బుడిబుడి నడకలతో తిరిగే పాప ఇక లేదన్న వార్త వారిని కలిచివేసింది. -
భారీ వర్షాలకు కూలిన ఇళ్లు
పాములపాడు : రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూడు మట్టి ఇళ్లు నేలకూలాయి. ఈ సంఘటన పాములపాడు మండలం రుద్రవరం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకటేశ్వర్లకు చెందిన మట్టి మిద్దెలు కూలాయి. ఈ ప్రమాదంలో ఇండ్లలో నివసించే వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. -
పాములపాడు తహశీల్దార్‌పై కేసు నమోదు
పగిడ్యాల(కర్నూలు జిల్లా): తప్పుడు రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేసిన పాములపాడు మండల తహశీల్దార్ అనురాధపై కేసు నమోదు చేసినట్లు ముచ్చుమర్రి ఎస్ఐ శివాంజల్ గురువారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామానికి చెందిన షేక్ హుసేన్పీరాకు ఆరుగురు కుమారులు. వీరిలో పెద్దవాడైన షేక్ చాంద్‌భాషాకు జూపాడుబంగ్లా మండలంలోని 80 బన్నూరు గ్రామంలో 5 ఎకరాల భూమి ఉంది. అయితే చాంద్‌భాషా తమ్ముడైన ఫారూక్ భాషా తనను చాంద్‌భాషా అని పిలుస్తారని నోటరీ సర్టిఫికెట్ సమర్పించడంతో 2014లో షేక్ ఫారూక్ భాషా అలియాస్ చాంద్‌భాషా అని అప్పటి పగిడ్యాల తహశీల్దార్‌గా పనిచేసే అనురాధ రెసిడెన్స్ సర్టిఫికెట్ మంజూరు చేశారని వివరించారు. తప్పుడు సర్టిఫికెట్ పొందిన ఫారూక్ భాషా చాంద్‌భాషా పేరు మీద ఉండే 5 ఎకరాల పొలాన్ని తన పేరు మీదుగా పట్టా పొంది అనుభవంలో ఉన్నాడని చెప్పాడు. దీంతో తనకు అన్యాయం జరిగిందని సమాచార హక్కు చట్టం కింద ఫారూక్ భాషాకు జారీ చేసిన రెసిడెన్స్ సర్టిఫికెట్ వివరాలు ఇవ్వాలని దరఖాస్తు చేశాడు. అతని దరఖాస్తును పరిశీలించిన రెవెన్యూ అధికారులు వివరాలు అందజేశారు. అందులో షేక్ ఫారూక్ భాషా అలియాస్ చాంద్‌భాషా అని ఉండడం గమనించిన చాంద్‌భాషా నందికొట్కూరు కోర్టును నెల రోజుల క్రితం ఆశ్రయించాడు. ఫిటిషన్ను పరిశీలించిన కోర్టు తప్పుడు రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేసిన తహశీల్దార్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టి అందుకు బాధ్యులైన షేక్ ఫారూక్ భాషా, తహశీల్దార్ అనురాధ, ఆర్ఐ, వీఆర్వోలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. -
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
పాములపాడు: కర్నూలు జిల్లా పాములపాడు మండల కేంద్రంలో నితిన్‌రెడ్డి(18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. నితిన్‌రెడ్డి ఆత్మహత్యతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
రెండు బైక్‌లు ఢీ: ఒకరు మృతి
పాములపాడు : కర్నూలు జిల్లా పాములపాడు మండలం రుద్రవరం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జూపాడు బంగ్లా మండలం లింగాపురం గ్రామానికి చెందిన రాజు (43) సంక్రాంతి పండుగ సందర్భంగా రుద్రవరంలోని అత్తగారింటికి బైక్‌పై వెళుతున్నాడు. అత్తగారింటికి చేరుకునేలోపే... గ్రామ శివార్లలో ఎదురుగా వచ్చిన ఓ బైక్ ఢీకొంది. ఈ ఘటనలో రాజు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మరో బైక్‌పై ప్రమాదానికి కారణమైన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కుంట గ్రామానికి చెందిన రమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. -
కౌలు రైతు ఆత్మహత్య
పాములపాడు (కర్నూలు) : పెట్టుబడికి తెచ్చిన అప్పు తీర్చే దారి కానరాక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాములపాడు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న తులసీ నాయక్ గ్రామానికి చెందిన రైతు నుంచి 25 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మిరప సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో గింజలు సరిగ్గా మొలకెత్తకపోవడంతో.. రెండోసారి విత్తనాలు నాటాడు. అయినా ఆశించిన స్థాయిలో పంట లేకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన రూ. 5 లక్షల అప్పుతో పాటు భూమి గుత్తకు తీసుకున్న రూ. 4 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడేళ్ల చిన్నారికి డెంగ్యూ
పాములపాడు (కర్నూలు) : కర్నూలు జిల్లాలో ఓ చిన్నారికి డెంగ్యూ వ్యాధి సోకింది. ఈ ఘటన పాములపాడు మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. మండలంలోని ఇస్కాల గ్రామంలో ఆయేషా(7) అనే చిన్నారి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. అయితే ఆమెకు వైద్య పరీక్షలు చేయించగా డెంగ్యూ సోకినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి ప్రస్తుతం కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. -
‘మధ్యాహ్నం’ ఇంటికే!
పాములపాడు: విద్యార్థుల హాజరు శాతం పెంపొందించేందుకు ఉద్దేశించిన మధ్యాహ్న భోజనం పథకం అభాసుపాలవుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండల పరిధిలోని వాడాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెల రోజులుగా పథకం నిలిచిపోయింది. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులు మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లి భోజనం చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా పలువురు విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత పాఠశాలకు వచ్చేందుకు విముఖత చూపుతున్నారు. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 119 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంపై విద్యార్థులు గగ్గోలు పెడుతున్నా అధికారులెవరూ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉపాధ్యాయులు త్రిసభ్య కమిటీకి విషయాన్ని తెలియజేయడంతో చేతులు దులిపేసుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా పాఠశాలలో ఆశ గ్రూపు వంట బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇద్దరు వంట మనుషులను ఏర్పాటు చేశారు. గిట్టుబాటు కావడం లేదనే సాకుతో విద్యార్థుల సంఖ్యను పెంచి చూపడం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తుండగా.. మెనూ పాటించకపోవడం వల్ల విద్యార్థులు తరచూ గొడవ చేస్తున్నారు. సమస్య తలెత్తినప్పుడు మండల అధికారులు పరిష్కారం చూపడం.. ఆ తర్వాత షరా మామూలు కావడంతో మధ్యాహ్న వేళ విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికైనా పథకం సక్రమంగా అమలయ్యేలా అధికారులు చొరవ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పోలీసు పహారాలో పవర్ ప్లాంట్ పనులు
పాములపాడు, న్యూస్‌లైన్: మండల పరిధిలోని వేంపెంట గ్రామంలో పోలీసుల పహరా మధ్య పవర్ ప్లాంట్ పనులు సాగుతున్నాయి. రూ.35 కోట్ల నిధులతో 7.5 మెగా విద్యుత్ ఉత్పత్తి కోసం ర్యాంకో మినీ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్న విషయం విధితమే. అయితే ఊరు మధ్యలో పనులు చేపడుతుండటంతో గ్రామస్తులు వ్యకిరేకిస్తున్నారు. కంపెనీ యాజమాన్యం పోలీసుల సహకారంతో నాలుగు రోజులుగా యంత్రాలతో పనులు చేపడుతోంది. ఈ పనులను అడ్డుకునేందుకు పవర్‌ప్లాంట్ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీని గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు. కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మండలంలో వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేశారు. ఎలాంటి ధర్నా, రాస్తారోకోలకు అనుమతి ఇవ్వబోమని ముందస్తుగానే ప్రకటించడంతో గ్రామస్తుల ధర్నాకు బ్రేక్ పడింది. ఎలాగైన పనులను అడ్డుకునేందుకు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వేంపెంట గ్రామం విప్లవాలకు పరిటిగడ్డగా పేరుగాంచింది. గతంలో గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీసులు అధిక సంఖ్యలో మొహరించారు. భారీగా మొహరించిన పోలీసులు.. గ్రామంలో సోమవారం ధర్నా చేపడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ జి.నరసింహారెడ్డి దాదాపు 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరు గ్రామంలోని పురవీధుల్లో పహరా కాశారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 1998లో జరిగిన మరణకాండ సమయంలో ఇంత పెద్ద ఎత్తున పోలీసులు గ్రామంలో మొహరించారు. 16 ఏళ్ల తరువాత మళ్లీ గ్రామాన్ని పోలీసులు చుట్టు ముట్టడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
వేంపెంటలో ‘ప్లాంట్’ చిచ్చు
వేంపెంట (పాములపాడు), న్యూస్‌లైన్: మండలంలోని వేంపెంట గ్రామంలో పవర్‌ప్లాంట్ నిర్మాణ చిచ్చు రగులుతోంది. గ్రామస్తులకు వ్యతిరేకంగా గురువారం పోలీస్ పహారాలో పనులు ప్రారంభించారు. పనులు వెంటే ఆపివేయాలని, లేదంటే తాము గ్రామాన్ని విడిచి వెళతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. 2011 జులైలో నిప్పుల వాగులో పవర్‌ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. 7.5 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి దాదాపు రూ.35కోట్ల తో ర్యాంక్ మినీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రెండేళ్ల కిందట భూమి పూజ నిర్వహించారు. అయితే ఈ ప్లాంట్ నిర్మాణం వేంపెంట గ్రామం మధ్యలో జరుగుతున్నందున గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పలుమార్లు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చి ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు.. అప్పటి రాష్ట్ర న్యాయ శాఖామంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యే లబ్బివెంకటస్వామిలు కూడా ప్రజలతో చర్చించారు. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటుతాయని, శబ్ద కాలుష్యం, వ్యవసాయ బోరు బావులకు, సాగుతాగు నీటి సమస్యలు ఉత్పన్నమవుతాయని గ్రామస్తులు ఆందోళనకు గురై తమ గోడును వారితో చెప్పుకునప్నారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి గత ఏడాది జులై 13న గ్రామానికి చేరుకుని సభ నిర్వహించి వారితో అభిప్రాయాలు సేకరించారు. గ్రామస్తుల అభీష్టం మేరకే పవర్‌ప్లాంట్ పనులు జరుగుతాయని ప్రజలకు తెలిపారు. ఆ సమయంలేనే ప్లాంటు పనులు నిలిపి వేయించారు. ప్రజల కోరికకు విరుద్ధంగా ప్రజల అభీష్టానికి విరుద్ధంగా గురువారం గ్రామంలో పవర్ ప్లాంట్ పనులు ప్రారంభించారు. గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రాకుండా బస్టాండ్ సెంటర్లో, పనులు జరిగే చోట, ఎస్సీకాలనీలోని స్థూపం వద్ద ప్రధాన కూడళ్లలో డీఎస్పీ జి.నరసింహారెడ్డి, సీఐ రవిబాబుల ఆధ్వర్యంలో దాదాపు 60 మంది పోలీసు పహారా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. పనులు చేసుకునేందుకు తమకు ప్రభుత్వ అనుమతులున్నాయని, అయితే గ్రామస్తుల నుంచి వ్యతిరేకత ఉందని పనులు జరిగేందుకు పోలీసు ఫోర్సు కావాలని కోరడంతో బలగాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామం విడిచి వెళతాం.. పజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా పవర్‌ప్లాంటు పనులు జరుపుతున్నందున గ్రామం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు గ్రామస్తులు గాండ్ల రమేష్, సామేలు, సాలన్న, ఏసురత్నం, కాంతారెడ్డి, రమణారెడ్డి, కోరబోయిన శాంతు, చెలమారెడ్డి, బోయశ్రీనివాసులు పేర్కొన్నారు. పవర్ ప్లాంట్ పనులు ప్రారంభం కావడంతో గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పనులు చేయబోమని హామీ ఇచ్చి ఈరోజు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మాటకు విలువ లేనప్పుడు గ్రామంలో ఉండటం వ్యర్థమని ప్రజలంతా మూకుమ్మడిగా గ్రామం విడిచి వెళ్లేందుకు సిద్ధం కావాలని తీర్మానించామన్నారు. ‘ ఏరాసు, కేఈలు పెద్దోళ్లు.. వారి రాజకీయ, ధన బలాన్ని చూపేం దుకే గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దించారు.’ అని బోరెడ్డి శివారెడ్డి ఆరోపించారు. గ్రామంలోని ప్రజలంతా రోడ్డుమీద పడితే అధికారులకు, పవర్‌ప్లాంట్ యజమానులకు ఆనందమా అంటూ జాను అనే వ్యక్తి ప్రశ్నించారు.