పాములపాడు, న్యూస్‌లైన్: మండల పరిధిలోని వేంపెంట గ్రామంలో పోలీసుల పహరా మధ్య పవర్ ప్లాంట్ పనులు సాగుతున్నాయి. రూ.35 కోట్ల నిధులతో 7.5 మెగా విద్యుత్ ఉత్పత్తి కోసం ర్యాంకో మినీ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్న విషయం విధితమే. అయితే ఊరు మధ్యలో పనులు చేపడుతుండటంతో గ్రామస్తులు వ్యకిరేకిస్తున్నారు. కంపెనీ యాజమాన్యం పోలీసుల సహకారంతో నాలుగు రోజులుగా యంత్రాలతో పనులు చేపడుతోంది. ఈ పనులను అడ్డుకునేందుకు పవర్‌ప్లాంట్ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీని గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు.
కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మండలంలో వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేశారు. ఎలాంటి ధర్నా, రాస్తారోకోలకు అనుమతి ఇవ్వబోమని ముందస్తుగానే ప్రకటించడంతో గ్రామస్తుల ధర్నాకు బ్రేక్ పడింది. ఎలాగైన పనులను అడ్డుకునేందుకు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వేంపెంట గ్రామం విప్లవాలకు పరిటిగడ్డగా పేరుగాంచింది. గతంలో గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీసులు అధిక సంఖ్యలో మొహరించారు.
భారీగా మొహరించిన పోలీసులు..
గ్రామంలో సోమవారం ధర్నా చేపడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ జి.నరసింహారెడ్డి దాదాపు 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరు గ్రామంలోని పురవీధుల్లో పహరా కాశారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 1998లో జరిగిన మరణకాండ సమయంలో ఇంత పెద్ద ఎత్తున పోలీసులు గ్రామంలో మొహరించారు. 16 ఏళ్ల తరువాత మళ్లీ గ్రామాన్ని పోలీసులు చుట్టు ముట్టడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
పోలీసు పహారాలో పవర్ ప్లాంట్ పనులు
Published Tue, Jun 3 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM
Advertisement
Advertisement