పగిడ్యాల(కర్నూలు జిల్లా): తప్పుడు రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేసిన పాములపాడు మండల తహశీల్దార్ అనురాధపై కేసు నమోదు చేసినట్లు ముచ్చుమర్రి ఎస్‌ఐ శివాంజల్ గురువారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామానికి చెందిన షేక్ హుసేన్‌పీరాకు ఆరుగురు కుమారులు. వీరిలో పెద్దవాడైన షేక్ చాంద్‌భాషాకు జూపాడుబంగ్లా మండలంలోని 80 బన్నూరు గ్రామంలో 5 ఎకరాల భూమి ఉంది. అయితే చాంద్‌భాషా తమ్ముడైన ఫారూక్ భాషా తనను చాంద్‌భాషా అని పిలుస్తారని నోటరీ సర్టిఫికెట్ సమర్పించడంతో 2014లో షేక్ ఫారూక్ భాషా అలియాస్ చాంద్‌భాషా అని అప్పటి పగిడ్యాల తహశీల్దార్‌గా పనిచేసే అనురాధ రెసిడెన్స్ సర్టిఫికెట్ మంజూరు చేశారని వివరించారు.
తప్పుడు సర్టిఫికెట్ పొందిన ఫారూక్ భాషా చాంద్‌భాషా పేరు మీద ఉండే 5 ఎకరాల పొలాన్ని తన పేరు మీదుగా పట్టా పొంది అనుభవంలో ఉన్నాడని చెప్పాడు. దీంతో తనకు అన్యాయం జరిగిందని సమాచార హక్కు చట్టం కింద ఫారూక్ భాషాకు జారీ చేసిన రెసిడెన్స్ సర్టిఫికెట్ వివరాలు ఇవ్వాలని దరఖాస్తు చేశాడు. అతని దరఖాస్తును పరిశీలించిన రెవెన్యూ అధికారులు వివరాలు అందజేశారు. అందులో షేక్ ఫారూక్ భాషా అలియాస్ చాంద్‌భాషా అని ఉండడం గమనించిన చాంద్‌భాషా నందికొట్కూరు కోర్టును నెల రోజుల క్రితం ఆశ్రయించాడు. ఫిటిషన్‌ను పరిశీలించిన కోర్టు తప్పుడు రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేసిన తహశీల్దార్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టి అందుకు బాధ్యులైన షేక్ ఫారూక్ భాషా, తహశీల్దార్ అనురాధ, ఆర్‌ఐ, వీఆర్వోలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
పాములపాడు తహశీల్దార్‌పై కేసు నమోదు
Published Thu, Mar 24 2016 11:54 PM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM
Advertisement