పాములపాడులో చనిపోయిన కోళ్లు
సాక్షి, కొత్తపల్లె/పాములపాడు (కర్నూలు): కొత్తపల్లె, పాములపాడు మండలాల్లోని పలు ప్రాంతాల్లో వింత వ్యాధితో కోళ్లు, కాకులు చనిపోతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోళ్లు చనిపోయిన తర్వాత ముక్కులోంచి ఒక రకమైన ద్రవం కారడం, కొన్ని కోళ్లకు చర్మంపై బోడిపెలుగా వచ్చి చర్మం రాలిపోవడం వంటివి జరుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు. గురువారం కొత్తపల్లె మండలం సింగరాజుపల్లె గ్రామంలో సంజీవరాయుడుకు చెందిన 50 కోళ్లు మృత్యువాత పడ్డాయి. అదే గ్రామంలో ఐదు కాకులు కూడా మృతి చెందాయి. అలాగే పాములపాడుకు చెందిన నబీరసూల్ అనే రైతు ఇంట్లో నాలుగు, కృష్ణానగర్ గ్రామంలో రామకోటినాయక్ అనే రైతు ఇంట్లో 70 కోళ్లు చనిపోయాయి. చాలా మంది రైతుల ఇళ్లలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ విషయం తమ దృష్టికి రాలేదని పాములపాడు పశువైద్యాధికారి భాస్కర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment