ఇంటర్‌లో మధ్యాహ్న భోజనం
గోదావరిఖని కళాశాలలో ప్రారంభం
గోదావరిఖని టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కళశాల విద్యార్థుల కోసం ఇలాంటి పథకం లేదు. కానీ, కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో దాతల సహకారంతో సోమవారం మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో ఉండాల్సి వస్తుంది. అయితే, చాలా మంది విద్యార్థులు మధ్యాహ్నమే కళాశాలకు డుమ్మా కొడుతున్నారు.
దీంతో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ మాధవి, అధ్యాపకులు.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని భావించారు. ఇందు కోసం జిల్లా అధికారుల చర్చించిన ప్రిన్సిపాల్ వారి అనుమతి పొందారు. పట్టణంలోని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వాణిజ్య, స్వచ్ఛంద సంస్థల వారిని కలిశారు. విరాళాలు ఇవ్వాలని కోరగా, సానుకూల స్పందన వచ్చింది. దాతల బియ్యం, వంట సామగ్రి ఇచ్చారు. కళాశాలలో మొత్తంగా 800 మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం పెరుగన్నం, చట్నీలతో వారికి భోజనం వడ్డిస్తున్నారు.