పశ్చిమ ప్రకాశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి ముప్పు వాటిల్లింది. సమైక్యాంధ్ర సమ్మె కాలంలో ఎంఈఓలు బియ్యం ఇండెంట్లు సకాలంలో సమర్పించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.
మార్కాపురం, న్యూస్‌లైన్ : పశ్చిమ ప్రకాశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి ముప్పు వాటిల్లింది. సమైక్యాంధ్ర సమ్మె కాలంలో ఎంఈఓలు బియ్యం ఇండెంట్లు సకాలంలో సమర్పించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ బియ్యం సరఫరా నిలిపివేయటంతో ఇక రెండు మూడు రోజుల తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టలేమని కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులు చేతులెత్తేశారు. మార్కాపురం డివిజన్‌లోని 12 మండలాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మార్కాపురం మండలంలో 40 పాఠశాలలు ఉండగా సుమారు 15 పాఠశాలలకు 10 రోజుల నుంచి బియ్యం సరఫరా నిలిచిపోయింది. వేములకోట, చింతగుంట్ల, రాయవరం తదితర పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు బియ్యాన్ని బయట కొనుగోలు చేసి విద్యార్థులకు వండిపెడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పథకాన్ని నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు.
మార్కాపురం డివిజన్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 6, జెడ్పీ ఉన్నత పాఠశాలలు 66, ఎయిడెడ్ పాఠశాలలు 17 ఉన్నాయి. సుమారు 10 వేల మంది విద్యార్థులు డివిజన్‌లోని వివిధ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. బేస్తవారిపేట, తర్లుపాడు, పెద్దారవీడు, రాచర్ల, మార్కాపురం, కంభం, మరికొన్ని మండలాల్లోని వివిధ పాఠశాలల్లో ఈ పరిస్థితి ఉండటంతో పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని ఏజెన్సీలు అంగన్‌వాడీ కేంద్రాల నుంచి బియ్యాన్ని అప్పు తీసుకుని వండి పెడుతున్నాయి. పాఠశాలల్లో డ్రాఫ్ అవుట్స్‌ను నిరోధించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి నెలా ఎంఈఓలు ఇచ్చే నివేదిక ఆధారంగా జిల్లా కేంద్రం నుంచి పాఠశాలలకు బియ్యం సరఫరా చేసేవారు. సమైక్యాంధ్ర సమ్మె సమయంలో ఏర్పడిన జాప్యం ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం: రామ్మోహన్‌రావు, ఉప విద్యాశాఖాధికారి
మార్కాపురం డివిజన్‌లోని 12 మండలాల పాఠశాలల్లో బియ్యం నిల్వలు అయిపోయి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న మాట వాస్తవమే. కలెక్టర్, డీఈఓల దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. సాధ్యమైనంత త్వరలో బియ్యం సరఫరా చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.