హమ్మయ్య
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిధులను ఎట్టకేలకు
ప్రభుత్వం పెంచింది. ఏజెన్సీ నిర్వాహకుల ఇబ్బందులను కొంత వరకు తగ్గించింది.
నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించడానికి
వెసులుబాటు కల్పించింది.
పెరిగిన మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నిధులు
‘జీవో 31’ జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి
ప్రతి నెలా జిల్లాపై రూ.30 లక్షల అదనపు భారం
సత్తెనపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నిర్వహణ నిధులు పెంచాలని ఏజెన్సీ నిర్వాహకులు కొంతకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే నిధులను కొంత పెంచుతూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా శుక్రవారం జీవో 31 జారీ చేశారు. ఈ ఉత్తర్వులు గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8 తరగతులు చదువుతున్న విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన సదుపాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. 1 నుంచి 8 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అయ్యే ఖర్చును ఆయా ప్రభుత్వాలు ఉమ్మడిగా భరిస్తాయి. 9,10 తరగతుల విద్యార్థులకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
మధ్యాహ్న భోజన నిర్వహణ నిధులు అప్పటికి అమల్లో ఉన్న మెస్ ఛార్జీలను బట్టి ఏటా 7.5 శాతం తక్కువ కాకుండా పెంచాల్సి ఉంది. దీని ప్రకారం ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా ప్రభుత్వం పెంచింది. కొంత ఆలస్యమైనప్పటికీ గత ఏడాది జూలై నుంచి వర్తింపు జేయడంతో నష్టపోయిన మొత్తాన్ని పూడ్చినట్లు అయింది.
జిల్లాపై రూ.30 లక్షల భారం...
జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 2,739, ప్రాథమికోన్నత పాఠశాలలు 439, ఉన్నత పాఠశాలలు 408 ఉన్నాయి. మొత్తం 3,586 పాఠశాలలు ఉండగా వీటిలో 3,21,307 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 2,11,916 మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.2 కోట్లు ఖర్చు చేస్తుంది. ప్రభుత్వం తాజాగా మెస్ చార్జీలు పెంచడంతో ప్రతి నెలా రూ. 30 లక్షల వరకు జిల్లా పై అదనపు భారం పడుతుందని అంచనా. జిల్లా వ్యాప్తంగా ఈ పథకాన్ని 3,696 నిర్వాహణ ఏజన్సీలు అమలు చేస్తున్నాయి. మొత్తం 6,647 మంది వంట సిబ్బంది పని చేస్తున్నారు. తాజాగా పెరిగిన ధరలతో అప్పుల భారం నుంచి కొంత మేరకు వీరికి ఉపశమనం కలుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన ధరలు ఇలా..
ఒక్కో విద్యార్థికి ఒక రోజుకు పెంచిన ధరలు ఇలా ఉన్నాయి
పాఠశాల ప్రస్తుత ధర కొత్త ధర పెరిగిన మొత్తం
ప్రాథమిక రూ. 4.60 రూ. 4.86 26 పైసలు
ప్రాథమి
కోన్నత రూ. 6.38 రూ. 6.78 40 పైసలు
ఉన్నత రూ. 6.38 రూ. 6.78 40 పైసలు