బాధ్యతలు ఎవరికి?
♦ సెలవుల్లో మధ్యాహ్న భోజనంపై కరువు మండలాల్లో సందిగ్ధత
♦ జిల్లా కలెక్టర్లు చూసుకుంటారు: ఉప ముఖ్యమంత్రి కడియం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 231 కరువు మండలాల్లో వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై కొంత గందరగోళం నెలకొంది. ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈనెల 23 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం అవుతాయని, అప్పటినుంచి మధ్నాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా వేసవి సెలవులను ఈనెల 16 నుంచే ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కరువు మండలాల్లో 16 నుంచి మధ్యాహ్న భోజనం పథకం కొనసాగిస్తారా? లేక ఈనెల 23నుంచి అమలు చేస్తారా? అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది.
శుక్రవారం రాత్రి వరకు కూడా దీనిపై ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో భోజనం బాధ్యతలను ఎవరికి అప్పగించాలనేదానిపై ప్రధానోపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. అయితే మౌఖికంగా మాత్రం స్థానికంగా ఉండే గ్రామ కార్యదర్శులకు బాధ్యత అప్పగిస్తే బాగుంటుందన్న ఆలోచనలు చేశారు. ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని వివరణ కోరగా.. ఆ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించామని పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి వారు చూసుకుంటారని ఆయన తెలిపారు.