నేటి నుంచే భోజనం
♦ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు
♦ 1.48 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
♦ వలసల నివారణకు చర్యలు
♦ రోజూ విద్యార్థుల సంఖ్యను పేర్కొనాలని ఆదేశాలు
పాపన్నపేట: కరువు వేళ విద్యార్థుల ఆకలి తీర్చి.. వలసలు నివారించాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆహార భద్రత చట్టం అమలు చేసి విద్యార్థులకు పోషకాహారం అందించాలన్న ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం 1నుంచి 8 తరగతుల విద్యార్థులకు వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు 9,10 తరగతుల విద్యార్థులకు కూడా పథకాన్ని వర్తింప చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ముందుకొచ్చింది.
లక్షన్నర మందికి లబ్ధి
జిల్లాలోని 46 మండలాల్లో 2,358 ప్రభుత్వ పాఠశాలల్లో 1,48,324 మంది విద్యార్థులకు భోజనాన్ని ఇవ్వనున్నారు. గురువారం ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. 10.30 వరకు విద్యార్థులకు బేసిక్స్‌తో పాటు ఆటపాటలు, సాంస్క ృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ మేరకు అన్ని మండలాల్లో ఎంఈఓలు ప్రధానోపాధ్యాయుల సమావేశాలు ఏర్పాటు చేసి పథకాన్ని ప్రారంభించే చర్యలు తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్న భోజన పథక అమలు గురించి గ్రామాల్లో దండోరా వేయించారు. రోజు భోజనం కాగానే విద్యార్థు ల సంఖ్యను ఎస్‌ఎంఎస్‌ల రూపంలో ఎంఈఓ కార్యాలయాలకు అందజేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, 2009లోనూ ఇలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని వేసవి సెలవుల్లో కొనసాగించారు.