ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: అధికారుల మధ్య సమన్వయ లోపంతో జిల్లాలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అధ్వానంగా తయారైంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ పథకం అమలుకు పూనుకున్న ప్రభుత్వం ఆచరణలో అలవిమాలిన అలసత్వం ప్రదర్శిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ‘న్యూస్‌లైన్’ బృందం శుక్రవారం పరిశీలించింది. సకాలంలో బియ్యం అందించడంలో అధికారులు విఫలమవుతుండటంతో పథకం అమలులో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఏటా రూ. 40 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్న ఈ పథకంపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
3591 పాఠశాలల్లో అమలు
జిల్లాలో మొత్తం 3591 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. మొత్తం 3,29,000 మంది విద్యార్థుల్లో 2,62,000 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు. 2790 ప్రాథమిక పాఠశాలల్లో, 1,99,000 మందికిగాను, 1,68,000 మంది 416 ప్రాథమికోన్నత పాఠశాలల్లో, 81,000 మందికి గాను 62,000 మంది 385 ఉన్నత పాఠశాలల్లో 40,000 మందికి 32,000 మంది మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోజుకు 100 గ్రాముల బియ్యం, ప్రాథమికోన్నతస్థాయి విద్యార్థులకు 6 నుంచి 10 తరగతుల వరకు 150గ్రాములు ఇస్తారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి రూ.4.65, ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6 ఇస్తారు.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి నెలకు 4 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తం 10 నెలలకు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ రూ.40 కోట్లు ఖజానా కార్యాలయానికి విడుదల చేస్తారు. బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేవు. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించి బిల్లులను డిసెంబర్ వరకు చెల్లించారు. 9,10 తరగతుల విద్యార్థులకు కుక్ కం హెల్పర్లకు నవంబర్ వరకు చెల్లింపులు జరిగాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే మిగిలిన చెల్లింపులు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు.
మెనూ ఊసేదీ...
మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన మెనూకు, పాఠశాలల్లో అమలు చేస్తున్న మెనూకు అసలు సంబంధమే లేదు. వారంలో రెండు రోజులు గుడ్లు ఇవ్వాల్సి ఉండగా అతి కొద్ది పాఠశాలల్లోనే రెండు గుడ్లు ఇస్తున్నారు. మెజారిటీ పాఠశాలల్లో వారంలో కేవలం ఒక గుడ్డు మాత్రమే ఇస్తున్నారు. పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం దండిగానే నిధులు విడుదల చేస్తున్నా విద్యార్థులకు మాత్రం పౌష్టికాహారం అందడం లేదు.
మెనూ ఎంత ఘనంగా ఉన్నా పిల్లలకు మాత్రం నీళ్లచారు, రుచీపచీ లేని కూరలే దిక్కయ్యాయి. వారానికి రెండు గుడ్లు పెట్టకపోయినా కుకింగ్ ఏజన్సీలను కొందరు హెచ్‌ఎంలు అదేమంటున్న దాఖలాల్లేవు. ప్రధానంగా తనిఖీ అధికారుల పర్యవేక్షణ లోపం, పథకం అమలుకు శాపంగా మారింది.
పూర్తి కాని కుకింగ్ షెడ్లు: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు కుకింగ్ షెడ్లు మంజూరు చేసినా నిర్మాణానికి నోచుకోలేదు. మూడేళ్ల క్రితం మంజూరైన కుకింగ్ షెడ్లు నిర్మాణాలు ముందుకు సాగడం లేదు.
4 జిల్లాలో మొత్తం 2388 పాఠశాలలకు ప్రభుత్వం కుకింగ్ షెడ్లు మంజూరు చేసింది. అయితే వీటిలో 501 షెడ్ల నిర్మాణానికి మాత్రమే నిధులు విడుదల చేసింది. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.75 వేల చొప్పున మొత్తం రూ. 3.75 కోట్లు విడుదల చేశారు.
4నిధులు మంజూరైన వాటిలో ఇప్పటి వరకు 299 కుకింగ్ షెడ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. 55 ఇప్పటి వరకు అసలు ప్రారంభం కాలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
4 పాఠశాలల్లో కుకింగ్ షెడ్లు లేకపోవడంతో ఆరుబయటే విద్యార్థులకు వండి పెడుతున్నారు. పరిశుభ్రమైన ప్రదేశాల్లో, ఆహారం వండాలని ఆదేశిస్తున్న ప్రభుత్వం కుకింగ్ షెడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయకపోవడం గమనార్హం. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న పాఠశాలల్లో కేవలం పది శాతం లోపు పాఠశాలలకు మాత్రమే కుకింగ్ షెడ్లున్నాయి.
నాసిరకం బియ్యం...
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుకు ప్రభుత్వం నాసిరకం బియ్యం సరఫరా చేస్తుండటంతో పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. జిల్లాలో అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రతినెలా 720 టన్నుల బియ్యం అవసరం. పాఠశాలలకు ‘పెయిర్ యావరేజ్ క్వాలిటీ’ బియ్యం సరఫరా చేయనున్న మండలాల స్థాయి స్టాకు పాయింట్ల నుంచి పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా అవుతున్నాయి. మంచి నాణ్యమైన బియ్యానికి విద్యాశాఖ టన్నుకు రూ.5650, ఒక శాతం పన్ను కూడా చెల్లిస్తున్నారు. బియ్యం రవాణాకు టన్నుకు రూ. 750 ఇస్తున్నారు. పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం బస్తాలకు ప్రత్యేకంగా ట్యాగ్‌లు వేసి సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించినా పౌరసరఫరాల శాఖ అధికారులు ఆ పని చేయకపోవడంతో పాఠశాలలకు నాసిరకం బియ్యమే సరఫరా అవుతున్నాయి. దీంతో అన్నం ముద్దగా తయారవుతుండటంతో పిల్లలు పాఠశాలల్లో భోజనం చేసేందుకు ఇష్టపడటం లేదు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు మంచి నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అధ్వాన భోజనం
Published Sat, Jan 18 2014 5:18 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement